
ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు
బుచ్చిరెడ్డిపాళెం : అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడకుండా స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై
తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడే సమయంలో మైక్ కట్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన శాసనసభ స్పీకర్ అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారన్నారు. పార్టీల కతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి అసెంబ్లీ గౌరవాన్ని బంగాళాఖాతంలో పడేశారన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. విదేశాలకు వెళ్లి టీడీపీని పొగడ్తలతో ముంచి, అసెంబ్లీలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించి కోడెల స్పీకర్ పదవికే మచ్చతెచ్చారన్నారు. గతంలో అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ఎందరో మహానుభావులు స్పీకర్లుగా పనిచేశారన్నారు.
వారందరూ హూందాగా వ్యవహరించి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చి, ప్రభుత్వంతో సమాధానాలు చెప్పించారన్నారు. నేడు నేరారోపణలు, క్రిమినల్ కేసులున్న వ్యక్తులను స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టి ఆ స్థానాన్ని మలినం చేస్తున్నారన్నారు. హత్యారాజకీయాలతో కూడిన మనస్తత్వం చంద్రబాబునాయుడిదన్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించే సమయంలో అప్పట్లో స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడును మభ్యపెట్టి, తన మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఇప్పటికైనా స్పీకర్ కోడెల శివప్రసాద్ పసుపుచొక్కాను వీడి, అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలో టీడీపీ శాసనభ్యులకు వివరించాలని ఆయన తెలిపారు.
టీడీ పీ జిల్లా నాయకులకు ఉలికిపాటు ఎందుకో?
అసెంబ్లీలో జరిగిన విషయాలపై టీడీపీ జిల్లా నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అనవసరంగా నిందారోపణలు చేస్తుంటే ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, పార్టీ బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, కలువ బాలశంకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నరసింహరావు, ఈదూరు బాబు, నాయకులు చెర్లో సతీష్‌రెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్, యామాల మోహన్, పిడుగు మధు తదితరులు పాల్గొన్నారు.