
బీమా సొమ్ముకు ఎగనామం!
చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ
రూ.600 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయం
కోటయ్య కమిటీ సిఫారసులకు ఆమోద ముద్ర
లక్షన్నర కన్నా ఎక్కువ బీమా వస్తే.. ఆ సొమ్ము మాత్రమే రైతులకు
ఒక్కో రైతుకు రూ.50 వేలకు మించి వచ్చే అవకాశం లేదు
హైదరాబాద్: రుణాలు చెల్లించలేదన్న కారణం చూపిస్తూ రైతుల సేవింగ్స్ ఖాతాలను స్తంభింపజేయడానికి ఒకవైపు బ్యాంకులు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు రైతులకు రావలసిన పంటల బీమాకు ప్రభుత్వం ఎగనామం పెట్టనుంది. రుణ మాఫీ పేరుతో రైతుల పంటల బీమా సొమ్మును సర్కారు ఖాతాలోకి జమ చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చింది. గత ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు దాదాపు రూ.600 కోట్ల బీమా మొత్తం చెల్లించాల్సి ఉందని ప్రాథమికంగా లెక్కతేల్చారు. రుణ మాఫీ చేస్తున్నప్పుడు బీమాచెల్లించడమెందుకని భావిస్తున్న ప్రభుత్వం ఆ సొమ్మును తన ఖాతాలో వేసుకోనుంది. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నర రుణం మాఫీ చేస్తున్నట్టు ప్రకటించినందున ఇక ఆయా కుటుంబాలకు వచ్చే బీమా సొమ్ములను రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని కోటయ్య కమిటీ చేసిన సిఫార్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఒక్కో కుటుంబానికి మాఫీ చేస్తున్న లక్షన్నర రూపాయలకు మించి బీమా సొమ్ము వస్తే ఆ ఎక్కువగా వచ్చే సొమ్మునే రైతులకు ఇవ్వాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసింది. ఎలాగూ పంటల బీమా కింద రైతులకు రూ.లక్షల్లో సొమ్ము రాదు. ఒక్కో రైతుకు అత్యధికంగా వచ్చినా రూ.50 వేలకు మించి రాదు. అరుుతే ఆ రూ.50 వేలను కూడా మాఫీ కింద జమ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం చూస్తే ఒకో రైతు కుటుంబానికి రూ.లక్షమాత్రమే మాఫీ చేసినట్లవుతుందని, మిగతా రూ.50 వేలు రైతుల పంటల బీమా కింద వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి రైతు వ్యవసాయ రుణం తీసుకునే సమయంలో పంటల ఆధారంగా బీమా ప్రీమియంను కూడా చెల్లిస్తున్నారు. ఉదాహరణకు రూ.లక్ష వరకు పంటకు బీమా చేస్తే అందుకుగాను కొన్ని పంటలకు ఐదు శాతం, కొన్ని పంటలకు ఆరు శాతం చొప్పున రుణం మంజూరు సమయంలోనే ప్రీమియంను బ్యాంకులు మినహాయించుకుంటాయి. రాష్ట్రంలో మెజారిటీ రైతులు పంటల బీమా పథకం పరిధిలో ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత ఖరీఫ్‌లో వేసిన పంటలు కోతలకు వచ్చిన సమయంలో అంటే గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇన్సూరెన్స్ కంపెనీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు కలసి పంటల దిగుబడి ఆధారంగా ఇన్సూరెన్స్ సొమ్మును అంచనా వేస్తారు. ఆ మేరకు గత ఖరీఫ్‌లో పంటల బీమా కింద రైతులకు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.బీమా మొత్తంలో సగం కేంద్రం తన వాటా కింద విడుదల చేస్తే.. మిగతా సగాన్ని రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుందని ఆ అధికారి వివరించారు.
లక్షన్నర మాఫీ చేసినట్టు కాదు..!
పంటల బీమా కింద ఒక్కో రైతు కుంటుంబానికి రూ.25 వేల నుంచి రూ.50 వేలకు మించి రావని, ఇప్పుడు రుణ మాఫీ పేరుతో ఆ మొత్తాన్ని మినహాయించుకుని, రూ.లక్షన్నరమాఫీ అనడం సమంజసంకాదనిఅధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. రూ.లక్షన్నరకు పైగా బీమా సొమ్ము వస్తే అలా ఎక్కువగా వచ్చిన సొమ్మునే రైతులకు చెల్లించాలని కోటయ్య కమిటీ సిఫారసు చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులేనని, వారికి బీమా సొమ్ము రూ.50 వేలకు మించి రాదని, మిగతా 10 శాతం మంది పెద్ద రైతులకు మాత్రమే లబ్ధిచేకూరుతుందని అంటున్నారు.
ఈ ఖరీఫ్‌కు లేనట్టే!
మరోవైపు సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఈ ఖరీఫ్‌లో వేసే పంటలకు బీమా లేకుండా పోతోంది. జూలై నెలాఖరుతో చెల్లింపు గడువు ముగిసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగింపుపై ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఆగస్టు నెలాఖరు వరకు గడువు పొడిగించాలని ఒక లేఖ రాసి చేతులు దులుపుకుంది. దీంతో రైతుల పంటల బీమా గడువు పొడిగింపును పట్టించుకునే నాధుడే కరువయ్యారు.