కొత్తపేట: రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో పాలనను భ్రష్టుపట్టిస్తోందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయకుండా, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ అటు నిరుద్యోగులు, ఇటు సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం పలివెల గ్రామంలో వైఎస్సార్ సీపీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా వైఎస్సార్ కుటుంబం, నవరత్నాల ప్రచారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగమిస్తామని, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వాటి సంగతే మర్చిపోయారని విమర్శించారు. వివిధ శాఖల్లో 10 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించి వారిని రోడ్డున పడేశారని తెలిపారు. ఫలితంగా వయోపరిమితి దాటిపోయి మరో ఉద్యోగంలో చేరే అవకాశం లేక వారి భవిష్యత్ అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఉచిత సివిల్ సర్వీస్ కోచింగ్‌కు 4 నెలలు క్రితం అర్హత పరీక్ష పెట్టి, వారికి ఆ అవకాశం కల్పించకుండా అయోమయానికి గురిచేసిందన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉందన్నారు. రైతులు, మహిళలు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేశారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో పేద, సామాన్య కుటుంబాలకు అన్ని విధాలా ప్రయోజనాలు, ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించారని చెప్పారు.
ఈ పథకాల అమలు ద్వారా రాష్ట్రానికి వైఎస్సార్ స్వర్ణయుగాన్ని తీసుకురానున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్‌కు చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ నేతృత్వంలో ఏర్పడే రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, సర్పంచి సరిపెల్ల ఆనంద్, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు సత్తిరాజు (రాజా), పార్టీ జిల్లా కార్యదర్శులు నెల్లి లక్ష్మీపతిరావు, రెడ్డి చంటి, పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, గ్రామ అధ్యక్షుడు భమిడిపాటి దుర్గాలక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment