బినామీలకు భూముల విందు | Tdp govt plan to real estate business in amaravathi | Sakshi
Sakshi News home page

బినామీలకు భూముల విందు

Published Fri, Nov 23 2018 3:00 AM | Last Updated on Fri, Nov 23 2018 5:20 AM

Tdp govt plan to real estate business in amaravathi - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ రాజధాని నిర్మాణం అనే ముసుగులో భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి లాక్కున్న భూములను తన బినామీలైన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు ఉపక్రమించారు. రైతుల నుంచి తీసుకున్న భూములను ఎలాంటి టెండర్లు లేకుండా కమీషన్ల కోసం నామినేషన్‌పై తమకు నచ్చిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, ఏజన్సీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు... రిజర్వ్‌ రేటు పేరుతో భూముల అసలు ధర కన్నా తక్కువ ధరకు కట్టబెట్టటమే కాకుండా వాయిదాల పద్ధతిలో నెమ్మదిగా చెల్లించే వెసులుబాటును కూడా కల్పిస్తూ భారీ స్కాంకు తెర తీశారు. ఇందుకోసం సీఆర్‌డీఏ అనుసరిస్తున్న భూ కేటాయింపుల నిబంధనలను సైతం సమూలంగా మార్చేయడం గమనార్హం. 

‘రియల్‌’ వ్యాపారులకు రాయితీతో రైతుల భూములు
రాజధాని ప్రాంత రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు, రిబేటులతో కట్టబెట్టాలని టీడీపీ సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబరు 19న జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలింది. 

ప్రైవేట్‌ డెవలపర్లకు రాయితీలు, రిబేటులు 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం భూములు కేటాయించేందుకు పనితీరు, ఆర్థిక స్థోమత ఆధా రంగా ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు /నామినేషన్‌ / నేరుగా సంప్రదింపుల విధానాల ద్వారా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకుపట్టణ అభివృద్ధి ప్రాజెక్టులను అప్పగించనున్నారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ అనుసరిస్తున్న భూ కేటాయింపుల విధానాలు, నిబంధనలు డెవలప్‌మెంట్‌కు అనుకూలంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం భూములు విక్రయించినా, లీజుకు ఇచ్చినా ఒప్పంద సమయంలోనే అందుకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం ప్రైవేట్‌ డెవలపర్స్‌కు సమస్యగా తయారైందని అంచనా వేస్తోంది. ఒకవేళ ప్రాజెక్టును మధ్యలో వదిలేస్తే అప్పటి వరకు చెల్లించిన సొమ్ము వెనక్కు ఇవ్వడం, టెర్మినేషన్‌ పేమెంట్‌ లాంటి వెసులుబాటు లేదు. అందువల్లే ప్రైవేట్‌ సంస్థలు రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు రావడం లేదని, ఈ నేపథ్యంలో రాజధానిలో పెద్ద, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులను చేపట్టే ప్రైవేట్‌ డెవలపర్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు, రిబేటులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విక్రయించుకునే హక్కులు కూడా వారికే...
రియల్‌ ఎస్టేట్, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలను వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములకు నిర్ధారించిన రిజర్వ్‌ ధరలో రాయితీలు, వాయిదాల రూపంలో చెల్లించేందుకు ప్రైవేట్‌ డెవలపర్లకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు వ్యక్తులు, కార్పొరేట్‌ కంపెనీలు, ఏజెన్సీలు, అసోసియేషన్లు, జాయింట్‌ కంపెనీలను అనుమతించనున్నారు. విక్రయించిన లేదా లీజుకు ఇచ్చిన భూమిపై నూటికి నూరు శాతం అభివృద్ధి హక్కులను ప్రైవేట్‌ డెవలపర్స్‌కు కల్పిస్తారు. ప్రైవేట్‌ డెవలపర్స్‌ ఆ భూమిని విక్రయించుకోవడం లేదా లీజు / సబ్‌ లీజు / మూడో పార్టీకి బదలాయించే హక్కులను కూడా కల్పిస్తారు. అల్ట్రా మెగా, ఐకానిక్‌ ప్రాజెక్టులు, సోషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు, టెక్నాలజీ లైసెన్సు కలిగిన  ప్రాజెక్టులు, గతంలో టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాని ప్రాజెక్టులను ఇప్పటికే పని చేస్తున్న సంస్థలకు దరఖాస్తుల ఆహ్వానం లేదా నామినేషన్, సంప్రదింపుల విధానంలో అప్పగించాలని నిర్ణయించారు. 

జాప్యం జరిగితే అపరాధ వడ్డీతో బకాయిల చెల్లింపులు..
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టుల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఆర్‌డీఏ బిల్లులను సకాలంలో చెల్లించకుంటే ఆ బకాయిలను అపరాధ వడ్డీతో చెల్లించేలా క్లాజు పొందుపరచాలని నిర్ణయించడం గమనార్హం. చెల్లింపుల్లో ఎంత సమయం జాప్యం జరిగిందనే అంశం ఆధారంగా అపరాధ వడ్డీ శాతాన్ని నిర్ణయిస్తారు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రాజెక్టు నుంచి మధ్యలోనే నిషŠక్రమిస్తే అప్పటివరకూ ఆ ప్రాజెక్టుపై చేసిన ఖర్చును సదరు సంస్థకు సీఆర్‌డీఏ తిరిగి చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన కూడా పొందుపరిచారు.

పెద్ద ప్రాజెక్టులకు 75 శాతం ధరకే భూమి
పెద్ద ప్రాజెక్టులకు రూ. 200 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు క్యాపిటల్‌ వ్యయంగా నిర్ధారించారు. ఈ కేటగిరీ ప్రాజెక్టులకు రిజర్వ్‌ ధరలో భూమిని 75 శాతం ధరకే ఇవ్వాలని నిర్ణయించారు. ఉదాహరణకు ఎకరం రిజర్వ్‌ ధర నాలుగు కోట్ల రూపాయలుంటే మూడు కోట్ల రూపాయలకే భూమి ఇవ్వనున్నారు. ఇందుకు 25 ఎకరాల నుంచి 75 ఎకరాల వరకు కేటాయించనున్నారు.

మెగా ప్రాజెక్టులకు 50 శాతం ధరకు భూమి..
మెగా ప్రాజెక్టులకు రూ. 500 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల రూపాయలు క్యాపిటల్‌ వ్యయంగా నిర్ధారించారు. ఈ కేటగిరీ ప్రాజెక్టులకు రిజర్వ్‌ ధరలో భూమిని 50 శాతం ధరకే ఇస్తారు. అంటే ఎకరం రిజర్వ్‌ ధర నాలుగు కోట్ల రూపాయలుంటే రెండు కోట్ల రూపాయలకే భూమి ఇవ్వనున్నారు.  ఇందుకోసం 75 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు కేటాయించనున్నారు. 

అల్ట్రా మెగా / ఐకానిక్‌ ప్రాజెక్టులకు 25 శాతం ధరకే భూమి
అల్ట్రా మెగా/ ఐకానిక్‌ ప్రాజెక్టులకు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,500 కోట్లు క్యాపిటల్‌ వ్యయంగా నిర్ణయించారు. ఈ కేటగిరీ ప్రాజెక్టులకు భూమి రిజర్వ్‌ ధరలో 25 శాతం ధరకే ఇవ్వనున్నారు. అంటే ఎకరం నాలుగు కోట్ల రూపాయల రిజర్వ్‌ ధర ఉంటే కోటి రూపాయలకే ఇవ్వనున్నారు. ఇందుకు 150 ఎకరాలను కేటాయించనున్నారు. ప్రాజెక్టుల స్థాయి ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన విధించనున్నారు.

(రైతుల భూములతో దోపిడీకి ప్రణాళిక)
రాజధాని ప్రాంతం ప్రకటనకు ముందే తమ బినామీలతో రైతుల నుంచి కారుచౌకగా భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా దోపిడీ చేసిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా రైతుల భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే సీఆర్‌డీఏ భూ కేటాయింపు నిబంధనలను సమూలంగా మార్చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ముసుగులో నామినేషన్‌ పద్ధతిలో రాయితీపై పెద్ద ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు, అల్ట్రా మెగా, ఐకానిక్‌ ప్రాజెక్టుల పేరుతో బినామీలతో వేలాది ఎకరాలు కాజేసేందుకు స్కెచ్‌ వేశారు. తిరిగి ఆ భూములనే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుని భవనాలు నిర్మించి విక్రయించడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి పొందడానికి వ్యూహం రచించారు. 

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement