రాజధానిలో ‘కమీషన్ల’ నిర్మాణం  | Estimate costs increased in each work in Amaravati | Sakshi
Sakshi News home page

రాజధానిలో ‘కమీషన్ల’ నిర్మాణం 

Published Sun, May 12 2019 3:43 AM | Last Updated on Sun, May 12 2019 4:12 AM

Estimate costs increased in each work in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దోచేశారని సాక్షాత్తూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తేల్చిచెప్పింది. ఈ మేరకు నివేదిక సమర్పించింది. అయినా ప్రభుత్వ పెద్దలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దోపిడీలో మరింత దూకుడు ప్రదర్శించారు. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణ వ్యయాన్ని కూడా భారీగా పెంచేశారు. తమ కోటరీలోని మూడు కాంట్రాక్టు సంస్థలకే పనులు అప్పగించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకున్నారు. నాలుగున్నరేళ్లుగా రాజధానిలో శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల గురించి పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు ‘శాశ్వత ప్రభుత్వ భవనాల సముదాయం’ నిర్మాణానికి హడావుడిగా టెండర్లు ఆహ్వానించింది. ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 మించి కాదని నిపుణులు అంటున్నారు. కానీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.19,707.24కు పెంచేశారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, మొబిలైజేషన్లు అడ్వాన్స్‌లు ఇచ్చి, కమీషన్లు నొక్కేశారు.  

భూమి, ఇసుక, కంకర ఉచితం.. అయినా అంత వ్యయమెందుకు?    
రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు(ఎక్సెస్‌) కాంట్రాక్టర్లకు అప్పగించారని ‘కాగ్‌’ స్పష్టం చేసింది. చిన్నపాటి వర్షం కురిసినా లోపల నీరు కారే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థలకే శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణ టెండర్లను అప్పగించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయం కంటే శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం అధికంగా ఉండడం గమనార్హం. శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల పేరుతో ఐదు టవర్ల నిర్మాణాన్ని 30 లక్షల చదరపు అడుగుల్లో చేపట్టాలని తొలుత నిర్ణయించారు. టెండర్ల దగ్గరకు వచ్చేసరికి అది 69 లక్షల చదరపు అడుగులకు పెరిగిపోయింది. 69 లక్షల చదరపు అడుగుల్లో ఐదు టవర్ల నిర్మాణానికి రూ.13,598 కోట్ల వ్యయం అవుతుందని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంటే చదరపు అడుగుకు రూ.19,707.24 చొప్పున ఖర్చవుతుంది. ఆ అంచనా వ్యయాన్ని చూసి అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. భూమి ఉచితమే, ఇసుక, కంకరను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. అలాంటప్పుడు చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.19,707.24 ఎలా అవుతుందని అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల ఖర్చును కలిపినా ఇంత పెద్ద ఎత్తున వ్యయం కాదని, ఈ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి.  

కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లిస్తారట!  
ఐదో టవర్‌ నిర్మాణాన్ని సాధారణ పరిపాలన శాఖ ‘ఎన్‌సీసీ’ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. మూడు, నాలుగో టవర్ల పనులను ఎల్‌అండ్‌టీకి అప్పగించారు. ఒకటి, రెండో టవర్ల పనులను షాపూర్‌జీ పల్లోంజీకి కట్టబెట్టారు. ఈ ఐదు టవర్ల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ ఫీజుతోపాటు జీఎస్‌టీ కలిపి కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.  

రహదారుల నిర్మాణంలోనూ చిలక్కొట్టుడే..  
రాజధానిలో ఏ పనులకైనా ముందుగానే అంచనా వ్యయాలను భారీగా పెంచేస్తున్నారని సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. రాజధానిలో రహదారుల నిర్మాణం విషయంలోనూ ముందుగానే అంచనా వ్యయాలను పెంచేసి, టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కిలోమీటర్‌ రహదారి నిర్మాణ వ్యయాన్ని రూ.27.92 కోట్ల నుంచి రూ.34 కోట్లకు పెంచేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారు. రాజధానిలో 36.68 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ వ్యయాన్ని రూ.1,024.33 కోట్లుగా నిర్ధారించారు. అంటే కిలోమీటర్‌కు రూ.27.92 కోట్లు అవుతుంది. రాజధానిలోనే మరో 30.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ వ్యయాన్ని రూ.1,028.21 కోట్లుగా నిర్ధారించారు. అంటే కిలోమీటర్‌కు రూ.34 కోట్ల వ్యయం అవుతుంది. సాధారణంగా నాలుగు లేన్ల జాతీయ రహదారుల నిర్మాణంలో కిలోమీటర్‌ వ్యయం రూ.15 కోట్లకు మించడం లేదు. రాజధాని అమరావతిలో ఆ వ్యయం అంతకు రెండింతలు కావడం విశేషం.  

ఖర్చు ఎక్కువ..నాణ్యత తక్కువ  
6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టారు. తరువాత మరమ్మతుల పేరుతో చదరపు అడుగుకు రూ.11,000కు పైగా వ్యయం చేశారు. అయినా తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. తాత్కాలిక సచివాలయం పేరిట రూ.750 కోట్లు ఖర్చు చేసినట్లు  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వినియోగ పత్రాలను    పంపించింది.  

కొత్త ప్రభుత్వం సమీక్షించాలి
టీడీపీ ప్రభుత్వ పెద్దలు రాజధానిలో తాత్కాలిక, శాశ్వత భవనాలు, రహదారుల నిర్మాణాల అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, పనులను అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీగా కమీషన్లు కొల్లగొట్టారని సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజధాని పేరుతో చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా బిజినెస్‌ రూల్స్‌ మేరకు జరగలేదని, అంతా ముఖ్యమంత్రి, సీఆర్‌డీఏ ఉన్నతాధికారుల స్థాయిలోనే నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంటున్నారు. రాజధానిలో దాదాపు అన్ని పనులు ముఖ్యమంత్రికి బాగా కావాల్సిన నాలుగు కాంట్రాక్టు సంస్థలకే దక్కాయని గుర్తుచేస్తున్నారు. రాజధాని నిర్మాణం ముసుగులో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనులను త్వరలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం క్షుణ్నంగా సమీక్షించాలని, కమీషన్లు మింగిన అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని సచివాలయ సిబ్బంది, సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement