టీడీపీ ఆర్నెల్ల పాలన.. కష్టాలే నజరానా | TDP govt to complete 6 months tomorrow | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆర్నెల్ల పాలన.. కష్టాలే నజరానా

Published Tue, Dec 9 2014 1:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

టీడీపీ ఆర్నెల్ల పాలన.. కష్టాలే నజరానా - Sakshi

టీడీపీ ఆర్నెల్ల పాలన.. కష్టాలే నజరానా

 ఏదేదో చేస్తామన్నారు. ప్రజలను ఆశల పల్లకి ఎక్కించారు. వారి ఓట్లతో అధికార పీఠం అధిష్టించారు. ఆర్నెల్లు గడిచాయి. ఏమైనా చేశారా?.. అంటే.. ప్చ్.. అంటూ పెదవి విరుపులు.. నిట్టూర్పులే. టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ, పింఛన్ల పెంపు, నిరంతర విద్యుత్.. వంటి రాష్ట్రస్థాయి హామీలతోపాటు ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాకు పలు హామీలు ఇచ్చిన పాలకులు అధికారంలోకి రాగానే వాటిని గాలికొదిలేశారు. జిల్లాను అగ్నిగుండంగా మార్చిన సోంపేట థర్మల్ అనుమతులు రద్దు చేయకపోగా మరో థర్మల్ కుంపటి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆమదాలవలస సుగర్స్ తెరిపిస్తామన్న నేతలు ప్రస్తుతం నోళ్లు మూసుకున్నారు. తరచి చూస్తే ఇలాంటి అమలు కాని హామీలెన్నో..
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఎన్నికలకు ముందు తెలుగుదేశం విప్పిన హామీల చిట్టా చూసి తమకేదో ఒనగూరుతుందని ఆశించిన ప్రజలకు ఆ పార్టీ పాలనపగ్గాలు చేపట్టిన ఈ ఆరు నెలల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానమైనా పరిపూర్ణంగా అమలు కాక అసంతృప్తే మిగిలింది. పూటకో మాట చెబుతున్న చంద్రబాబును ఎందుకు గెలిపించామా.. అని మధనపడే పరిస్థితి నెలకొంది.
 
 రుణమాఫీలో ఖాతాలు కట్
 జిల్లాలో 3.60 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు. 47వేల డ్వాక్రా సంఘాలున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వం రోజుకోమాట పూటకో ప్రకటన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతోంది. తాజాగా రూ.50 వేల లోపు రుణం తీసుకున్నవారికే మాఫీ చేస్తామని తేల్చేశారు. జిల్లాలో ఇప్పటికీ సర్వే పూర్తికాలేదు. తక్కువ రుణం తీసుకున్న కొంతమంది వడ్డీతో సహా కట్టేశారు. బ్యాంకర్ల నుంచీ స్పష్టత లేదు. బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నవారి పరిస్థితి ఏంటో చెప్పలేదు. కౌలు రుణాలపైనా స్పష్టత కొరవడింది. రైతు సాధికార సంస్థ పేరిట ఈ ఏడాది రుణమాఫీకి రూ.5వేల కోట్లే బడ్జెట్‌లో కేటాయించడంతో రైతులు ఉసూరుమంటున్నారు. కాగా నిబంధనల పేరిట సుమారు లక్ష ఖాతాలు అనర్హుల జాబితాలో చేరిపోయాయని బ్యాంకర్లే చెబుతున్నారు.
 
 పింఛన్లది మరో గాథ
 రూ.200 ిపింఛను తీసుకునేటప్పుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రెండు రోజులకోసారైనా కడుపునిండా తినేవారు. ఎన్నికల హామీ ప్రకారం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పింఛను మొత్తాన్ని రూ.1000, రూ.1500 పెంచినా.. బినామీ లబ్ధిదారుల ఏరివేత పేరుతో టీడీపీ సభ్యులతో కమిటీలు వేసి వేలాదిమంది అర్హులను కూడా రద్దుల పద్దులో చేర్చారు. జిల్లాలో సుమారు 30 వేల ఫించన్లను తొలగించారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో జాబితాలు రాలేదు. జన్మభూమి కమిటీల పేరిట తెలుగుదేశం కార్యకర్తలకు నచ్చిన వారినే అర్హుల జాబితాలో ఉంచడంతో గ్రామాల్లో జనాగ్రహం వెల్లువెత్తుతోంది. పెంపు మాటే మో గానీ పింఛనే ఊడిపోవడంతో పండుటాకులు, వికలాంగులు విలవిల్లాడుతున్నారు.
 
 నిరంతర విద్యుత్ ఎక్కడ?
 తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో గృహావసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని గొప్పలకు పోయిన ప్రభుత్వం, ఆ తర్వాత వెనక్కితగ్గి పెలైట్ ప్రాజెక్టు పేరుతో జిల్లాలోని పాతపట్నం, రేగిడి మండలాలను ఎంపిక చేసింది. అయితే ఆ రెండు మండలాల్లో ఈ రోజుకీ విద్యుత్ సరఫరా మెరుగుపడలేదు.
 
 జాడలేని ఎన్టీఆర్ సుజలం
 పల్లె ప్రజలకు నామమాత్రపు ధరకే స్వచ్ఛమైన తాగునీరు ఇప్పిస్తామని, ఊరూరా ఎన్టీఆర్ సుజల ధారను ప్రవహింపజేస్తామని ప్రకటించింది. రూ.2కే 20 లీటర్ల నీరు సరఫరా చేస్తామని ఊరించింది. అయితే ఈ పథకానికి ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడంతో పథకం ఆరంభంలోనే నీరుగారిపోయింది. చాలాచోట్ల స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాలేదు. వచ్చిన చోట్ల స్థలాలు దొరకలేదు. ఫలితంగా ఇప్పటివరకు జిల్లాలో 13 చోట్ల మాత్రమే పరిశుద్ధ నీటి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వాటిలోనూ కొన్ని సక్రమంగా పని చేయడంలేదు.
 
 బెల్ట్ దుకాణాల జల్సా
 జిల్లాలో సుమారు వెయ్యి బెల్ట్ దుకాణాలున్నట్టు అధికారులే అప్పట్లో లెక్క తేల్చారు. వీటి అంతు చూస్తామని చెప్పిన పాలకులు వాటి ఊసే పట్టడం లేదు. ఫలితంగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. రేగిడి మండలంలో ఓ దుకాణదారు ఇంటి వద్దకే మద్యం పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలొచ్చాయి. ఒడిశా మద్యం జిల్లాలో ఎంతగా పారుతోందో ఎక్సైజ్ అధికారుల లెక్కలే చెబుతున్నాయి. పట్టణంలో ఏకంగా ఓ బార్‌నే సీజ్ చేయడం, ఇచ్చాపురం సరిహద్దులో చెరువులో భారీగా మద్యం బాటిళ్లు దొరకడం, ఒడిశాకు కేసు బనాయించడం తెలిసిందే. విచిత్రమేమిటంటే ఎక్కడ అక్రమ మద్యం దొరికినా.. దాంతో టీడీపీ నేతలకు లింకు ఉంటోంది.
 
 తుపాను సాయం పక్కదారి
 హుద్‌హుద్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. సుమారు రూ.1300 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనాలే వెల్లడిస్తున్నాయి. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి జిల్లాకు ఒక్కపైసా అయినా మంజూరు కాలేదు. తుపాను నష్టమంతా విశాఖలోనే ఉన్నట్లు పాలకులు హడావుడి చేస్తున్నారు తప్ప శ్రీకాకుళం జిల్లాను అసలు పట్టించుకోవడం లేదు. కాగా బాధితులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించిన తక్షణ సాయం కూడా దారి మళ్లి టీడీపీ కార్యకర్తల ఇళ్లకు చేరిందన్న ఆరోపణలు ఉన్నాయి.  నెలరోజుల పాటు జనం ఇక్కట్లకు గురయ్యారు. కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చినా ఒక్కరోజుకే ఆ పర్యటన పరిమితం కావడంపై జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇద్దరి ఆత్మహత్య
 ప్రభుత్వ తీరుతో ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కోటబొమ్మాళి మండలం పేటపాడుకు చెందిన సంపతిరావు బలరాం (66), బొడ్డేపల్లికి చెందిన బొడ్డేపల్లి జయలక్ష్మి (45) అనే కౌలు రైతులు పంట నష్టపోయి, అప్పుల బాధతో, రుణమాఫీ వర్తించదన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నదిలో గల్లంతైన జయలక్ష్మి మృతదేహం ఇప్పటివరకు లభ్యం కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement