‘ఇంటి’ నుంచి గెంటివేత! | Outsourcing Employees Affected by Bifurcation | Sakshi
Sakshi News home page

‘ఇంటి’ నుంచి గెంటివేత!

Published Sun, Aug 3 2014 3:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

‘ఇంటి’ నుంచి గెంటివేత! - Sakshi

‘ఇంటి’ నుంచి గెంటివేత!

 ‘బాబు వస్తే.. జాబ్ వస్తుంది’.. ఎన్నికల సమయంలో టీడీపీ వదిలిన ఈ ప్రచారాస్త్రం బాగా పనిచేసింది. బాబుకు అందలం దక్కింది గానీ.. నిరుద్యోగులకు జాబులు రాకపోగా.. ఉన్నవారి జాబులు ఊడిపోతున్నాయి. అధికారంలోకి రాగానే మాట మారిం ది.. తీరూ మారింది. ఫలితం నాటి నినాదం కాస్త తిరగబడి.. ‘బాబు వచ్చారు.. జాబ్ పోయింది’గా మారింది. వేలాది ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు తదితరులను ఇంటికి పంపించిన బాబు సర్కారు తాజాగా గృహనిర్మాణ శాఖ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా గెంటేసింది.
 
 శ్రీకాకుళం పాతబస్టాండ్: టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వేలాది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి సరికొత్త రికార్డు సాధించింది. ఇప్పటికే వేలాది ఉద్యోగులపై వేటు వేసిన ఈ సర్కారు తాజాగా గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందిని గెటవుట్ అంటూ ఒక్క జీవోతో గెంటేసింది. రాష్ట్రంలో ఈ సంస్థ పరిధిలో సుమారు ఏడేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలో 165 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీధిన పడ్డారు. వీరిలో గత ఏడేళ్లుగా పనిచేస్తున్న 9 మంది ఇంజినీర్లతోపాటు 100మందికిపైగా వర్క్ ఇన్‌స్పెక్టర్లు,  
 
 ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తదితర సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి వీరి నియామక కాలపరిమితి జూలై 31తో ముగిసింది. పొడిగింపు ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శనివారం జారీ అయిన తొలగింపు జీవో శరాఘాతంలా తగిలింది. దీంతో జూలై 31 నుంచే వీరు ఉద్యోగాలు కోల్పోయినట్టయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖల్లో జరిగిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నియామకాల్లో పలు అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ నాయకుల అనుచరులు, కార్యకర్తలను నియమించుకున్నారని టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ఆ పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇదే ఆరోపణతో ఇప్పుడున్న వారిని తొలగించి..
 
 వారి స్థానంలో పచ్చ చొక్కాల తమ్ముళ్లను నియమించుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన అని ఆరోపణలు వనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఉద్యోగాలనే నమ్ముకొని.. చాలీచాలని జీతాలతో రోజులు నెట్టుకొస్తున్న ఉద్యోగులను తొలగిస్తే పేద కుటుంబాలు రోడ్డున పడుతాయని, అందువల్ల ఉద్యోగుల తొలగింపు ఆలోచన విరమించుకోవాలన్న విన్నపాలు ప్రభుత్వానికి అందాయి. ఇవేవీ చెవికెక్కించుకోని సర్కారు రాజకీయ ప్రయోజనాలు, ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా ఉద్యోగులపై వరుసగా వేటు వేసుకుంటూ వెళుతోంది.
 
 గృహనిర్మాణ పథకాలకు విఘాతం
 ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడటం ఒక ఎత్తయితే.. ప్రభుత్వ నిర్ణయం వల్ల గృహ నిర్మాణ పథకాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల మంజూరు, నిర్మాణాల పర్యవేక్షణ, తదితర కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇప్పటికే గత ఏడాది నిర్మాణ లక్ష్యాలు పూర్తికాలేదు. జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు రూ. 14 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు 20వేల మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బందిని తగ్గించడంతో ఈ గృహ నిర్మాణ పథకాలు పూర్తిగా పడకేసే ప్రమాదముంది.
 
 ఉత్తర్వులు అందలేదు
 అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ జారీ అయిన జీవో విషయమమై గృహ నిర్మాణ సంస్థ పీడీ పి.ఎన్.నర్సింగరావు వద్ద ప్రస్తావించగా తమకు ఉత్తర్వులు అందలేదని చె ప్పారు. ఇంతవరకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు గడువు జూలై 31తో ముగిసిందని అన్నారు. జీవో వచ్చిన వెంటనే సిబ్బందికి తెలియజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement