స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరితెగించిన టీడీపీ
దొడ్డిదారిన కర్నూలు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్సీలు కైవసం
బలం లేకపోయినా బరిలో తెలుగుదేశం అభ్యర్థులు
ప్రకాశంలో వైఎస్సార్ సీపీ కన్నా 36 ఓట్లు తక్కువ, కానీ 232 ఓట్ల ఆధిక్యం
కర్నూలులో వైఎస్సార్ సీపీ కన్నా 71 ఓట్లు తక్కువ, కానీ 147 ఓట్ల ఆధిక్యం
హైదరాబాద్: తెలంగాణలోనే కాదు.. అధికారంలో ఉన్న ఆంధ్రలోనూ ఓట్లకు నోట్లను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వెదజల్లారు. తెలంగాణలో ఓటుకు కోట్లు లంచం ఎరచూపి అడ్డంగా దొరికినా.. ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం అదే ఒరవడిని కొనసాగించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, యధేచ్చగా డబ్బు వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేస్తూ టీడీపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. బలం లేకపోయినా దొడ్డిదారిన కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఎట్టకేలకు గెలిపించుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా మం డలి ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసిన తక్షణమే చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఏపీలోనూ పక్కాగా అమలు చేయడానికి పూనుకున్నారు. బలం లేకపోయినా ఓట్లకు నోట్లను వెదజల్లి.. అవసరమైతే అధికారాన్ని దుర్వినియోగం చేసైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా ప్రకాశం, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా.. పార్టీ అభ్యర్థులను బరిలోకి దించారు(పార్టీల బలాబలాల వివరాలు పక్క పట్టికలో చూడవచ్చు).
అధికార దుర్వినియోగం: ప్రకాశం, కర్నూ లు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఓట్లకు నోట్లను వెదజల్లాలని మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ఆయన ఆదేశాలందుకున్న మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగాన్ని యధేచ్ఛగా వాడుకుని ఇతర పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీటీసీకి రూ.మూడు లక్షలు, జడ్పీటీసీకి రూ.ఐదు లక్షలను ఎరగా వేసి తమ వైపునకు తిప్పుకున్నారు. నోట్లకు లొంగని వారిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన 36 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలతో నెల్లూరులోని ఓ లాడ్జిలో టీడీపీ నేతలు క్యాంపు పెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు ఆ లాడ్జికి వెళ్లి.. ఎంపీటీసీలతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంలో టీడీపీ నేతలు తమకు ఒక్కొక్కరికి అడ్వాన్సుగా రూ.50 వేలు ఇచ్చారని.. ఓటు వేసిన తర్వాత రూ.2.50 లక్షలు ఇస్తామని చెప్పి తమను ఇక్కడికి తరలించారని చెప్పారు. లాడ్జిలో ఉన్న 36 మంది ఎంపీటీసీలను తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఎంపీటీసీలను వారి సొంతూళ్లకు పంపుతామని చెప్పిన పోలీసులు.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిని టీడీపీ క్యాంపునకు తరలించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల సంఘానికి, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సంతలో పశువులను కొనుగోలు చేసినట్టుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎన్నికలను బహిష్కరించింది. కర్నూలు జిల్లాలోనూ ఇదే రీతిలో ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను అడ్డగోలుగా కొనుగోలు చేశారు. పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు.
దొడ్డిదారిన విజయం
ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో 992 ఓట్లకుగానూ 775 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 724 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ ఎన్నికల అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి అట్లా చిన వెంకటరెడ్డికి 13 ఓట్లు రాగా.. 17 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిని పరిశీలిస్తే.. టీడీపీకి ఉన్న ఓట్ల కన్నా 232 ఓట్లు అధికంగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. అంటే ఇతర పార్టీలకు చెందిన 232 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలను నోట్ల కట్టలు ముట్టజెప్పి తమ అభ్యర్థికి ఓట్లేయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఒక్కొక్కరికి రూ.3 నుంచి 5 లక్షల చొప్పున 232 మందిని కొనుగోలు చేయడానికి రూ.8 కోట్లను ఖర్చు చేసినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన 456 మందికి కూడా ఇంచుమించుగా ఇదే రీతిలో పంపిణీ చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఫలితంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి 711 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో 1,087 ఓట్లకుగానూ 1,080 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి 610 ఓట్లు రాగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డికి 464 ఓట్లు, స్వతంత్రులకు రెండు ఓట్లు పడ్డాయి. తక్కిన 14 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిని పరిశీలిస్తే.. టీడీపీ వాస్తవ బలం కన్నా 147 ఓట్లు ఎక్కువగా ఓట్లు పోలైనట్లు స్పష్టమవుతోంది. అంటే.. 147 మంది ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లకు నోట్ల కట్టలు వెదజల్లి టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు కొందరికి ఏకంగా 10 నుంచి 15 లక్షల రూపాయల మేరకు లంచం ఎరవేసినట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలకూ డబ్బు ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కర్నూలు, ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు రూ.45 నుంచి 50 కోట్ల కుపైగా ఖర్చు చేసినట్లు టీడీపీ వర్గాలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్లు: 992
వైఎస్సార్‌సీపీ బీ ఫారమ్‌పై గెలిచినవారు : 492 మంది
టీడీపీ బీ ఫారమ్‌పై గెలిచినవారు: 456 మంది
టీడీపీ కన్నా వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం: 36 ఓట్లు
ప్రకాశం జిల్లాలో పోలయిన ఓట్లు: 775
టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి వచ్చినవి: 724
టీడీపీకి ఉన్న ఓట్ల కన్నా అధికంగా వచ్చినవి: 232 ఓట్లు
ఒక్కో ఓటరుకు టీడీపీ చెల్లించినట్టుప్రచారం జరుగుతున్నది: రూ.3 నుంచి 5 లక్షలు
232 మందిని కొనుగోలు చేయడానికి వెచ్చించింది: రూ.8 కోట్లు
సొంత పార్టీకి చెందిన 456 మందికి చెల్లించింది: రూ.8 కోట్లు
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్లు: 1,087 మంది
వైఎస్సార్‌సీపీ బీ ఫారమ్‌పై గెలిచినవారు: 534 మంది
టీడీపీ బీ ఫారమ్‌పై గెలిచినవారు: 463 మంది
టీడీపీ కన్నా వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం: 71 ఓట్లు
కర్నూలు జిల్లాలో పోలయిన ఓట్లు: 1,080
టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి వచ్చినవి: 610 ఓట్లు
టీడీపీకి ఉన్న ఓట్ల కన్నా అధికంగా వచ్చినవి: 147 ఓట్లు
ఒక్కో ఓటరుకు టీడీపీ చెల్లించినట్టు
ప్రచారం జరుగుతున్నది: రూ.10 నుంచి 15 లక్షలు
147 మందిని కొనుగోలు చేయడానికి వెచ్చించింది: రూ.10 కోట్లు
సొంత పార్టీ వారికి చెల్లించింది: రూ.7.50 కోట్లు
‘పచ్చ’నోట్ల ప్రవాహంలో రెండు ఎమ్మెల్సీలు
Published Wed, Jul 8 2015 1:27 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement