నెల్లూరులో ‘ రాజకీయ కుట్ర’ | TDP Leader Conspiracy In Nellore District | Sakshi

నెల్లూరులో ‘ రాజకీయ కుట్ర’

Published Sat, May 18 2019 2:52 PM | Last Updated on Sat, May 18 2019 2:57 PM

TDP Leader Conspiracy In Nellore District - Sakshi

మెట్టుకూరు ధనంజయరెడ్డి

సాక్షి , నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం పార్టీ మారారనే ఏకైక కారణంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మెట్టుకూరు ధనంజయరెడ్డిపై తెలుగుదేశం పార్టీ కక్ష కట్టింది. అన్ని అనుమతులు, తీర్మానాలతో ఖర్చులను నిధులు దుర్వినియోగం అయినట్లు హడావుడిగా చిత్రీకరించారు. వాటిపై హడావుడిగా విచారణ నిర్వహించినట్లు చేసి కలెక్టర్‌ వద్దకు విచారణకు హాజరుకావాలని చైర్మన్‌కు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా దుమారం రేగింది.

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్‌ సాగుతూ సర్వత్రా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో జిల్లాలో రాజకీయ కక్షలతో విచారణకు తెరతీశారు. కేవలం వ్యక్తిగత టార్గెట్‌ చేసి రాజకీయంగా ప్రతిష్టను మసకబార్చటం కోసం హడావుడిగా కుట్ర రాజకీయలు తెర తీసి ఈ నెల 25న కలెక్టర్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై న్యాయపరంగానే తేల్చుకోవటానికి

చైర్మన్‌ వర్గం సన్నద్ధమైంది. 
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కొన్ని ఏళ్ల క్రితం అనుమతులతో చేసిన ఖర్చులకు ఇప్పుడు విచారణకు తెరతీశారు. అది కూడా తేల్చాల్సిన అంశాలు వదిలేసి టార్గెట్‌ చేసే దిశగా కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా మెట్టుకూరు ధనంజయరెడ్డి 2013లో ఎన్నిక అయి నేటికీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గత నెల ముందు వరకు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. గత నెల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్‌ స్థానాల్లో ఒక చోట అవకాశం కల్పిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడే అనేక మార్లు చెప్పిన పరిస్థితి.

ఈ క్రమంలో జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు, దివంగత వైఎస్సార్‌ కుటుంబంతో 20 ఏళ్లకుపైగా ధనంజయరెడ్డికి వ్యక్తిగతంగా అనుబంధం ఉండడంతో ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. పార్టీ మారడంతో వేధింపుల పర్వానికి అధికార పార్టీ తెరతీసింది. వాస్తవానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో కుదువ పెట్టిన బంగారం విషయంలో గతంలో దుర్వినియోగం జరిగితే దీనిపై అప్పట్లో చైర్మన్‌ హోదాలో ధనంజయరెడ్డి విచారణ కోరగా విచారణకు కమిటీ వేశారు. దానికి సంబంధించి విచారణ ప్రకియ ముగియడం, పాలకవర్గం కూడా వివరణ ఇచ్చింది. అంతవరకు విచారణ సజావుగానే సాగింది. 

కొత్తగా విచారణ
ఇప్పుడు పాత విచారణను పక్కన పెట్టి దాని కొనసాగింపుగా కొత్త విచారణ మొదలుపెట్టి ధనంజయరెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2013, 2014లో చేసిన ఖర్చులపై ఇప్పుడు విచారణ నిర్వహిస్తున్నామని దీనికి చైర్మన్‌ ధనంజయరెడ్డి, పాలకవర్గం వ్యక్తిగతంగా ఈ నెల 25న కలెక్టర్‌ ముత్యాలరాజు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

నోటీసుల్లో ఏముందంటే..
రాజధాని నిర్మాణం కోసం అందరి నుంచి ముఖ్యమంత్రి భారీగా విరాళాలు సేకరించారు. రాజధానికి బాగా విరాళాలు వస్తున్నాయని చెప్పుకునేందుకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విరాళాలు పంపమని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బ్యాంక్‌ పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుని 2014 డిసెంబర్‌ 9వ తేదీన రూ.6 లక్షల విరాళాన్ని ప్రభుత్వానికి పంపారు. దీనిపై విచారణ వేశారు. అలాగే బ్యాంక్‌ కాంప్లెక్స్‌లోని షాపుల ఆద్దెలు బాగా తక్కువగా ఉండటం, కొందరు మొండి బకాయిలుగా మారిన క్రమంలో పాలక మండలి తీర్మానంతో బిడ్‌లు ఆహ్వానించి షాపులను కేటాయించారు. ఈ క్రమంలో అద్దెలు తగ్గించడం వల్ల, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని వల్ల రూ.42.30 లక్షలు నష్టం వాటిల్లిందని, దీనిని దుర్వినియోగంగా చూపారు.

అలాగే బ్యాంక్‌ ఏర్పడి 100 ఏళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించి, దానికి సీఎం చంద్రబాబు నాయుడును కూడా ఆçహ్వానించి, శత జయంతి వేడుకల్ని నిర్వహించారు. దానికి బ్యాంక్‌ ద్వారా రూ.35 లక్షలు ఖర్చును పాలకవర్గం అనుమతితో సబ్‌ కమిటీ వేసి దాని మేరకు సహకార శాఖ నిబంధనలకు లోబడి ఖర్చు చేశారు. సీఎం హాజరుకానప్పటికీ జిల్లా మంత్రులు నారయణ, సోమిరెడ్డి మొదలుకుని ఎమ్మెల్యేలు అందరూ హాజరై బ్యాంక్‌ బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారు. ఇప్పుడు దీనిని కూడా దుర్వినియోగంగా చూపించి విచారణకు ఆదేశించారు. ఈమూడు అంశాలపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలనేది నోటీసుల సారాంశం

బీద రవిచంద్ర ఒత్తిడితోనే..
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఒత్తిడితో అధికారులు తలొగ్గారనే ప్రచారం బలంగా సాగుతోంది. అధికార పార్టీలో ఉన్నంత వరకు అంతా మంచిగా కనిపించి ఒక్కసారి పార్టీ మారగానే వేధింపులకు గురి చేసి వ్యక్తిగతంగా రాజకీయ ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఇవ్వన్నీ కూడా కొన్నేళ్ల క్రితం టీడీపీలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు. వీటికి బీద రవిచంద్ర కూడా హాజరయ్యారు. సహకార బ్యాంక్‌లో అవినీతి ఆరోపణలు ఉన్న ఒక అధికారి సలహాతో ఈ తతంగం నడిపారు. ఆగమేఘాల మీద కలెక్టర్‌ విచారణ చేయాలని ఒత్తిడి తెచ్చి బ్యాంక్‌ డీజీఎం, సీఈఓలను మూడు రోజుల విచారణకు పిలిచి హడావుడిగా లెక్కలు వేయించి విచారణ చేసినట్లు చూపించి, నోటీసులు జారీ చేశారు. దీనిపై చైర్మన్‌ మెట్టుకూరు ధనంజయరెడ్డి న్యాయపోరాటం ద్వారా తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement