కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా.. కనిపింఛనే లేదా? | Tdp Leaders Against The Election Code | Sakshi
Sakshi News home page

కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా.. కనిపింఛనే లేదా?

Published Tue, Apr 2 2019 10:01 AM | Last Updated on Tue, Apr 2 2019 10:01 AM

Tdp Leaders Against The Election Code - Sakshi

పైడికొండంలో జన్మభూమి కమిటీ సభ్యుడి సమక్షంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న అధికారులు  

సాక్షి, అమలాపురం టౌన్‌:  ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు తెలుగు తమ్ముళ్లు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా పట్టించుకోకుండా పింఛను సొమ్ము, పసుపు కుంకుమ పథకాల సొమ్ములను పంపిణీలు వారి ఆధ్వర్యంలోనే చేపట్టడం విశేషం. ఇప్పటికే పసుపు–కుంకుమ పథకానికి సంబంధించి మూడో చెక్కును ఈ వారంలోనే అందించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఇక నెలనెలా పింఛన్ల పంపిణీ సొమ్మును కూడా అదేదో చంద్రబాబే తన జేబులోని సొమ్ములను ఇస్తున్నంత బిల్డప్‌తో టీడీపీ రంగు, రుచి, వాసనతో సామాజిక పింఛన్లను జిల్లా అంతటా సోమవారం నుంచి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సంఘం ఆదేశాలను భేఖాతరు చేస్తూ అమలాపురం రూరల్‌ మండలం బండార్లంక గ్రామంలో సోమవారం సామాజిక పింఛన్ల పంపిణీ ఆర్భాటంగా సాగింది.

పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు తమ వెంట పింఛన్ల కార్డులు (చంద్రబాబు ఫొటో, టీడీపీ రంగు, పింఛన్ల పెంపు సమాచారంతో ఉన్న కార్డులు) తీసుకురావద్దని, కేవలం పింఛన్‌ పత్రం, పింఛన్‌ కార్డు నంబర్‌ తీసుకుని వస్తే పింఛన్‌ ఇస్తామని దండోరా నిర్వహించాల్సి ఉంది. కొన్ని మండలాల్లో  దండోరా వేయించారు. ఈ సూచనను పింఛన్లు బట్వాడా చేసే సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై గ్రామంలో విజ్ఞులైన ఓటర్లు, టీడీపీయేతర పార్టీల నాయకులు, కార్యకర్తల్లో కొం దరు పింఛన్లు పంపిణీ చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా దండోరా వేయమన్న ఆదేశాలు తమకు రాలేదని చెప్పారు. పరోక్ష ప్రలోభంలా ఉన్న ఈ పింఛన్ల పంపిణీని ఎన్నికల అధికారులు అడ్డుకోవాలని, దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు స్థానిక యువకులు కొందరు చెప్పారు.  


జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో పింఛన్ల పంపిణీ
తొండంగి (తుని):  ఏం చేసైనా సరే మళ్లీ అధికారాన్ని పొందేందుకు టీడీపీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించి అధికారులు టీడీపీ నేతల సమక్షంలో పింఛనుదారులకు పింఛన్లు అందజేస్తున్నారు. తొండంగి మండలం పైడికొండ గ్రామంలో పంచాయతీ అధికారులు సోమవారం జన్మభూమి కమిటీ సభ్యుడైన నర్సే ఫకీరయ్య సమక్షంలో పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టకుండా అధికారులు ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పథకాలను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అలా కాకుండా జన్మభూమి కమిటీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ పింఛనుదారులనున ప్రలోభాలకు గురిచేస్తున్నారని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.

అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ వారి సమక్షంలోనే పింఛన్లు పంపిణీ చేయడం ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ జరుగుతున్న ప్రాంతంలో టీడీపీ నేతలను నిలదీయడంతో వారంతా అక్కడి నుంచి జారుకున్నారు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో అధికారులు, టీడీపీ నేతల తీరుపై మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఇదే మండలంలోని బెండపూడిలో పింఛన్లు పంపిణీ అనంతరం లబ్ధిదారులకు టీడీపీ వర్గీయులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీనేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement