దర్శి : జిల్లాలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడుతూ రెచ్చిపోతున్నాయి. గతంలో ఉన్న చిన్నాచితకా విభేదాలు, ఎన్నికల సమయంలో జరిగిన స్వల్ప ఘర్షణలకు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదని, ఓట్లు వేయించలేదని, వైఎస్‌ఆర్ సీపీకి అండగా నిలిచారనే కారణాలతో పలువురిపై తెగబడి దాడులుచేస్తూ గాయాలపాలుచేస్తున్నాయి. దర్శి నియోజకవర్గంలో గత మూడు నెలల్లో ఇలాంటి దాడులు అనేకం జరగ్గా.. తాజాగా గత బుధవారం రాత్రి వినాయకచవితి ఉత్సవాల్లో జరిగిన దాడులు చర్చనీయాంశంగా మారాయి.
దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామంలో వినాయకుని విగ్రహం నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ముప్పరాజు చినవెంకయ్య, చెన్నయ్య, ముప్పరాజు పెదవెంకయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముప్పరాజు శ్రీను, మాజీ సర్పంచ్ మందపాటి సీతారావమ్మ, మదుమంచి సుబ్బారావు, ఏడుకొండలు, ముప్పరాజు వెంకటేశ్వర్లు తదితరుల ఇళ్లపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కనీసం స్పందించకపోగా, ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకోండి అంటూ వైఎస్‌ఆర్ సీపీ బాధితులకు ఉచిత సలహా ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టీడీపీ శ్రేణులు రౌడీల్లా రెచ్చిపోతూ వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారుల ఇళ్లపై రాళ్లు రువ్వుతున్నప్పటికీ పోలీసులు చూస్తూ ఉండిపోవడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ సైతం ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారే తప్ప టీడీపీ వర్గీయులను కట్టడి చేసేందుకు ప్రయత్నించలేదని వాపోయారు.
మంత్రి అండదండలతోనే...
దర్శి నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రోడ్డురవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు అండతోనే స్థానిక టీడీపీ శ్రేణులు రెచ్చిపోతూ వైఎస్‌ఆర్ సీపీ వర్గీయులపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి మండలం రాజంపల్లి, తూర్పువీరాయపాలెంలో వైఎస్‌ఆర్ సీపీ వర్గీయులపై ్డటీడీపీ వర్గీయులు దాడిచేశారు. ముండ్లమూరు మండలం శంకరాపురంలో, కురిచేడు మండలం దేకనకొండలోనూ దాడిచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఇవన్నీ మంత్రి అండదండలతోనే జరుగుతున్నాయని వైఎస్‌ఆర్ సీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
‘అధికార’ దాడులు
Published Sat, Sep 6 2014 2:11 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement