
సాక్షి, ప్రకాశం జిల్లా : వైఎస్సార్‌సీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కన్నమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. సుబ్బారెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సుబ్బారెడ్డి మానవత్వం ఉన్న గొప్ప నేత అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
రేపు స్వగ్రామంలో సుబ్బారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితవర్గాలు చెప్పాయి. 2004 ఎన్నికల్లో సుబ్బారెడ్డికి కాంగ్రెస్ దర్శి అసెంబ్లీ టికెట్ ను నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు శివప్రసాద్ కాంగ్రెస్ తరఫున గెలిచి వైస్సార్‌సీపీలో చేరారు.