
టీడీపీ నేతల బరితెగింపు
తీవ్రంగా గాయపడిన కార్యకర్తను పరామర్శిస్తున్న వీఆర్ రామిరెడ్డి
తాడిపత్రి రూరల్ : తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. ఆధిపత్యం కోసం ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటం లేదు. ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారనే కారణంతో తాడిపత్రి మండలం వీరాపురంలో శనివారం వేటకొడవళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరాముడు (44), పుల్లారెడ్డి (60), నారాయణ (62), సుబ్బమ్మ (45)ల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
కర్రెప్ప (65), వినోద్‌కుమార్ (22) తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి విషయం తెలియగానే వైఎస్‌ఆర్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ అండతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యే ప్రోద్బలంతో దాడులు జరిగాయని ఆరోపించారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో మైనార్టీ నేత మున్నా, నాయకులు మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పేరం రామచంద్రారెడ్డి ఉన్నారు.