
సాక్షి, అమరావతి : అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. గత ఐదు రోజులుగా గుంటూరు జిల్లా మందడం, తుళ్లూరు కేంద్రంగా కొనసాగుతున్న ఈ ఆందోళనల వెనుక ఎవరున్నారనే దానిపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి వర్గాలు ఆరా తీస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ అలజడులకు శ్రీకారం చుట్టారని, ఆ పార్టీ నేతలే వెనకుండి నడిపిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. కేవలం అమరావతి ప్రాంతంలోని రెండు, మూడు చోట్ల మాత్రమే ఈ ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు రాజధాని పేరిట ప్రజలను రెచ్చగొట్టి, రోడ్లపైకి తీసుకొస్తున్నారని నిఘా వర్గాలు తేల్చినట్లు తెలుస్తోంది.
టీడీపీకి చెందిన మాజీ మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు నేరుగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయ పలుకుబడి ప్రయోగించి ఆదివారం ప్రత్యేకంగా విద్యార్థులను కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇచ్చేలా ప్రేరేపించడం గమనార్హం.
వందల మంది పోలీసులతో బందోబస్తు
అమరావతి ప్రాంతంలో తాజా పరిణామాలపై నిఘా వర్గాలు అందిస్తున్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇద్దరు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 32 మంది ఎస్సైలు, 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. జన జీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అవసరమైతే అమరావతికి అదనపు బలగాలు తరలిస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. శాంతీయుత నిరసనలు నిర్వహించుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అమరావతిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment