అనుచర వర్గం... అవినీతి మార్గం | TDP Leaders On Corrupt Way In Addanki | Sakshi
Sakshi News home page

అనుచర వర్గం... అవినీతి మార్గం

Published Fri, Mar 15 2019 11:55 AM | Last Updated on Fri, Mar 15 2019 11:55 AM

TDP Leaders On Corrupt Way In Addanki - Sakshi

చెన్నుపల్లి–అనంతవరం రహదారిని ఆధీనంలోకి తీసుకుని ఉపయోగించుకుంటున్న జిల్లా మంత్రి, ఎమ్మెల్యే క్వారీలు

సాక్షి, అద్దంకి(ప్రకాశం​): వాళ్ల అవినీతి ఆకాశమంత, వాళ్ల కబ్జాలు కడలంత, వాళ్ల దోపిడి ధరిత్రంత, వాళ్ల రాక్షసత్వం రావణుడే అసూయపడేంత. కొండలు కరిగించారు, ఇసుక తరలించారు గిరిజనుల భూముల్ని బదలాయించుకున్నారు. లోకమంతా పచ్చగా ఉండాలి అనేది ఆరోక్తి, పచ్చనేతలే పచ్చగా ఉండేలి అనేది అధికార పార్టీ రీతి ‘‘నారా’’జ్యం అంటున్న తెలుగు తమ్ములు అభివృద్ధి పేరుతో దోచుకున్న సొమ్ము కోట్లలోనే ఉంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లాకు చెందిన మంత్రి అండదండలు ఉండటంతో వారి అనుచర వర్గం చేసిన అవినీతి పతాకస్థాయికి చేరుకుంది.

అధికార పార్టీ అండదండలతో అకమ్ర సంపాదనే ధ్యేయంగా తెలుగుతమ్ముళ్లు ఈ ఐదేళ్లలో దోచుకున్న సొమ్ముతో పాటు ప్రశ్నించిన వారిని బెదిరించిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. మండలంలో చక్రాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక క్వారీలో తవ్వాల్సిన దాని కన్నా ఎక్కువగా తవ్వి కోట్లాది రూపాయలు సంపాదించాడని ఎమ్మెల్యేతో పాటు ఆయన ఆనుచర వర్గంపై ఆరోపణలున్నాయి. ఈ అవినీతిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వర్గం నాయకులు, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమంగా ఇసుక తరలించే క్వారీలను గుర్తించారు. కానీ అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో తరువాత అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక మండల పరిధిలోని మోదేపల్లి, పేరాయిపాలెం గ్రామ సమీపంలోని ద్వార్నపు వాగు, చిలకలేరుల్లో సైతం ఇదే తరహా ఇసుక దోపిడీ చోటు చేసుకుంది. ధేనువకొండ సమీపంలోని కొండను సైతం అధికార పార్టీకి వారు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి.

బల్లికురవ మండలంలో..
బల్లికురవ: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువలేదు అన్న చందంగా అధికార అహంతో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఆర్‌అండ్‌బీ రహదారులను సైతం ఆధీనంలోకి తీసుకుని క్వారీయింగ్‌ చేస్తున్నారు. క్వారీల కోసం తిరిగే లారీలతో తారు రోడ్డు సైతం మట్టిరోడ్డుగా తయారైంది. గ్రానైట్‌ వృథా రాళ్లను రోడ్డు మార్జిన్లో పడేయటంలో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. బ్లాస్టింగ్‌ మోతలతో సమీప గృహాలు పగుళ్లిచ్చి ధ్వంసం అవుతున్నాయని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తమ క్వారీలకు మీ గృహాలే అడ్డంగా ఉన్నాయని వాటిని ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. 60 కుటుంబాలను ఊరికి దూరంగా నాసిరకం గృహాలు నిర్మించి ఇచ్చారు. ఆ ఇళ్లలలో తాముండబోమని చెప్పడంతో, ఎమ్మెల్యేకు చెందిన మనుషులు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని మళ్లీ బెదింరిపుకు దిగారు. అదేవిధంగా ఈర్లకొండ చూట్టూ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు బినామీల పేరులో క్వారీలున్నాయి. మంత్రి శిద్దా రాఘవరావుకు ఒక క్వారీ ఉంది. ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వారిద్దరూ క్వారీలు నిర్వహిస్తున్నారు. నలభై ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న మాపై జిల్లా మంత్రి అనుచరులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు.

నీరు చెట్టు అంతా అవినీతిమయం..
జె.పంగులూరు: తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలో వందల కోట్లు అవినీతి చోటు చేసుకుంది. నీరు చెట్టుకింద చేసిన పనే చేస్తూ బిల్లు చేసుకుంటున్నారు. మండలంలో చిన్నమల్లవరం గ్రామానికి ఆనుకోని ఉన్న వాగుపై ఒక్క సంవత్సరం మూడుసార్లు మరమ్మతులు చేశారు.ఈ పనుల్లో గ్రామానికి చెందిన శ్మశానం కూడా 60 శాతం వాగులో కలుపుకున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులు ఇష్టానుసారంగ ప్రభుత్వ సొమ్మును దండుకున్నారు. ఇచ్చిందే తగుదు అన్నట్లు నీరు చెట్టు పనుల చేయకుండా కూడా బిల్లుల పొందిన దాఖాలాలు అనేకం.  ఈ అవినీతి మండలంలోని ప్రతి గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిదులు కుమ్మకై ప్రభుత్వ సోమ్మును దర్జాగా దోచుకున్నారు. టీడీపీ పాలనలో పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, టీడీపీ కార్యకర్త మాత్రం పెద్దవాడయ్యాడు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది ఒక్క వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు.

మేదరమెట్ల: గడచిన ఐదేళ్ల కాలంలో మండలంలోని పలు గ్రామాల్లో నీరు చెట్టు పేరుతో కోట్లాది రూపాయలను టీడీపీకి చెందిన వారు అక్రమంగా దండుకోవడంతో పాటు పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్రయోజనం పొందుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక శాసనసభ్యుడి అండదండలుండటంతోనే అక్రమాకు పాల్పడేవారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి.

నీరు చెట్టు పేరుతో మండలంలో చెరువుల్లో అధికార పార్టీకి చెందిన వారు, మట్టిని అమ్ముకుని కోట్లు కొల్లగొట్టారు. చెక్‌డ్యాంలు, సీసీ రహదారుల నిర్మాణాల్లో కమీషన్లు దండుకున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన చెక్‌డ్యాలకు సంబంధించి చేసిన పనుల్లో రూ.30 లక్షల వరకు అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన వారు, జిల్లా కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా, ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారపార్టీ అండదండలున్నాయనే విమర్శలకు బలాన్నిస్తోంది. అధికార పార్టీకి చెందిన వారు ఆక్రమించుకొని ఊర చెరువులో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటూ గ్రామానికి చెందిన కొందరు యువకులు కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. పీ. గుడిపాడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు  ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని సాగు చేస్తుండగా వారి భూములను వదిలిపెట్టి, సామాన్యులు సాగు చేసుకుంటున్న దొండ పందిర్లను ముందస్తు సమాచారం లేకుండా అధికారులు తొలగించారు.

దీంతో ఆ రైతు భార్య మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైంది. ఇంలాంటి అక్రమాలకు ఆక్రమణలకు పాల్పడుతున్న తముళ్లకు కొమ్ముకాస్తుంది ఎమ్మెల్యేనే అనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా రైతుల పొలంలో బోర్లు వేసేందుకు ప్రభుత్వం జలసిరి పథకాన్ని రూపొందించిన ఘటన తెలిసిందే. ఐతే జలసిరి బోర్లు వేసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు రైతుల నుంచి కొంత సొమ్మును తీసుకున్నారని, అలాగే బ్యాంకుల ద్వారా అందజేసే రుణాలకు సంబందించి సిఫార్సులు చేయాలంటే కూడా అధికార పార్టీ నేతలకు తమ వాటా తముకు అందిచాలని సొంతపార్టీకి చెందిన వారే ఆరోపించిన ఘటనలు చాలనే ఉన్నాయి. ఈ ఐదేళ్లలో టీడీపీ నాయకులు అవినీతికి అంతే లేకుండా పోయింది.

గిరిజన భూములు కొనుగోలు..
బల్లికురవకు చెందిన గిరిజనులకు ప్రభుత్వం సర్వే నంబరు 295, 296, 297లో 11 ఎకరాలను 11 మందికి భూమి కొనుగోలు పథకం ద్వారా అందజేసింది. ఆ భూములను అమ్మె హక్కు గిరిజనులకు లేదు. 2017 డిసెంబరులో అప్పటి తహశీల్దారు ఎస్వీ సుధాకర్‌ సహకారంతో ఈ భూములను బినామీ పేర్లతో ఎమ్మెల్యే కొనుగోలు చేశాడనే ఆరోపణ.లున్నాయి. ఈ భూమిలో ప్రస్తుతం గ్రానైట్‌ వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరు గారింది. గిరిజనులకు ఉపాధి కొరవడింది.

ఏ సమయంలో ఏం జరుగుతుందో..
యానాది సంఘం కాలనీలో 40 సంవత్సరాలుగా నివశిస్తున్నాం. క్వారీల పుణ్యమా అంటూ దుమ్ము దూళి బ్లాస్టింగ్‌ మోతలతో ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయండిని చాలా మంది అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరించారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టిచుకోలేదు.
– ఆలకుంట అంకమ్మ రాజు, బల్లికురవ
 
అకమ్రాలకు హద్దే లేదు
పమిడిపాడు గ్రామంలో వాటర్‌షెడ్‌ పథకం, నీరు చెట్టు పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారే కానీ అక్రమాలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మండలంలో అధికార పార్టీ నేతలకే జలసిరి బోర్లు, రుణాలు మంజూరు చేశారు. అర్హులైన వారికి పలు ప్రభుత్వ పథకాలను మంజూరు చేయడంలో  మొండిచేయి చూపించారు.
– రావినూతల సుబ్బయ్య, పమిడిపాడు 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

గిరిజనుల నుంచి ఎమ్మెల్యే బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూమిలో చేస్తున్న డంపింగ్‌

2
2/3

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు (ఫైల్‌)

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement