నీరు–చెట్టు.. అక్రమార్కుల పని పట్టు | TDP Leaders Corruption in Neeru Chettu Scheme | Sakshi
Sakshi News home page

నీరు–చెట్టు.. అక్రమార్కుల పని పట్టు

Published Thu, Jun 6 2019 10:47 AM | Last Updated on Thu, Jun 6 2019 10:47 AM

TDP Leaders Corruption in Neeru Chettu Scheme - Sakshi

ఎటువంటి పనులు చేయకుండా నిధులు స్వాహా చేసిన నెమళ్లవాని కుంట దుస్థితి

గత ఐదేళ్లలో టీడీపీ నేతలు నీరు–చెట్టు పథకాన్ని కల్పవృక్షంలా మార్చుకున్నారు. చెరువులు, కాలువల పూడిక తీత, చెరువు కట్ట, చెరువుల అనుసంధానం, ఇంకుడు కుంటలు, చెక్‌డ్యాం పనులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పనులన్నీ ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల, గ్రామస్థాయి నాయకులు చేజిక్కించుకున్నారు. చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేపట్టినట్టు రికార్డులు సృష్టించారు. రూ.వేల కోట్ల ప్రజాధనం మింగేశారు. ఉపాధిహామీ పథకం కింద తీసిన గుంతల్లోనే కొత్తగా పూడిక తీత పనులు చేపట్టినట్లు చూపి బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదర్శక పాలనవైపు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అవినీతిపై దృష్టిసారిస్తున్నారు.

సాక్షి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్‌: ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. నీరు–చెట్టులో చోటుచేసుకున్న అక్రమాలను కొనసాగనీయకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకం ద్వారా రూ. 748 కోట్ల అంచనాతో 7,937 పనులు చేపట్టారు. అందులో 5,490 పనులు పూర్తి చేయగా, 2,447 పనులు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చూపుతున్నాయి. అయితే 329 పనులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. అవసరమైన చోట నీరు–చెట్టు పనులు చేపట్టాల్సి ఉంటే.. టీడీపీ నేతలు, కార్యకర్తలు అవసరం లేనిచోట్ల పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చెయ్యించుకున్నారు. చేపట్టిన పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు.  వాటర్‌ షెడ్‌ పథకం కింద జిల్లాలో ఏ నియోజకవర్గానికి మంజూరు కానన్ని నిధులు ఒక్క పీలేరుకు మాత్రం విడుదలయ్యాయి. పీలేరు పరిధిలో తలుపుల, రేగళ్లు పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.13.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ముఖ్య అనుచరులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ అమర్‌నాథ్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి ఏకమై నిధులను స్వాహాచేశారని తెలిసింది. మరోవైపు నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున నిధులు స్వాహా అయ్యాయని గత ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్‌ అధికారులు సైతం ప్రభుత్వ పెద్దలకు నివేదికలు పంపారు. ఆ పనులను అధికారులుచూసీ చూడనట్లు ఉండాలని టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు అందడంతో నివేదికలకు విలువలేకుండా పోయింది.

ఆరంభం నుంచే అవినీతి
నీరు–చెట్టు పనుల్లో అగ్రిమెంట్ల నుంచే అవినీతికి ఆజ్యం పోశారు.  పనుల కేటాయింపు విషయంలో జిల్లా స్థాయి అధికారి ఒకరు ఒకేరోజు సుమారు రూ.200 కోట్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీరంగరాజపురం మండలంలో జరిగిన అక్రమాలు జిల్లాలోనే మొదటిస్థానంలో నిలిచాయి. మండలంలో మొత్తం 312 పనులను గుర్తించారు. అందులో చెక్‌డ్యాంలు, చెరువు పూడిక తీత పనులు చేపట్టేందుకు రూ.32 కోట్లు కేటాయించారు. పద్మాపురంలో అధికారపార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రూ.2.12 కోట్లతో 5 చెక్‌డ్యాం పనులు చేపట్టారు. అయితే ఈ చెక్‌ డ్యాంలు కేవలం 30 మీటర్లకు ఒకటి చొప్పున నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకా రం అయితే ఒక్కో చెక్‌ డ్యాంకు కనీసం 500 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కారు. ఆ పనుల్లోనూ నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఒండ్రుమట్టితో కలిసిన ఇసుక, కాలం చెల్లిన సిమెంటుతో చెక్‌ డ్యాం నిర్మాణ పనులు చేపడుతున్నారు. వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం చెరువు కలుజు పనులు కూడా నాసిరకంగా చేపట్టారు. పాతగోడపై పనులు చేసి కొత్తగా కలుజు నిర్మించినట్లు రికార్డులు సృష్టించారు. ఏర్పేడు మండలం పల్లం, పంగూరు, జంగాలపల్లి, వికృతమాల, గోవిందవరం  ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేపట్టిన పనుల్లో భారీ ఎత్తున నిధులు స్వాహా అయ్యాయి. రూ.లక్ష పనికి రూ.5లక్షలకు బిల్లులుపెట్టి నిధులు కాజేశారు. శ్రీకాళహస్తి పరిధిలోని ఎంపేడు, ఇలగనూరు, ముచ్చివోలు, కమ్మకండ్రిగ పరిధిలో జరిగిన పనులు నాసిరకంగా చేపట్టారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.

చెరువు పనుల్లోనూ ఇష్టారాజ్యం
జిల్లాలో పెద్ద ఎత్తున చెరువు పూడిక తీత పనులు, మరమ్మతు పనులు, చెరువుల అనుసంధానం పనులు చేపట్టారు. అందులో శ్రీరంగరాజురం మండలంలో జెడ్పీటీసీ సభ్యుడు రుద్రప్పనాయుడు గంగినేని చెరువు, ఆరిమాకుల చెరువు, పద్మాపురం చెరువు పనులు చేపట్టారు. ఇవన్నీ రాత్రికి రాత్రే పనులు చేపడుతున్నారు. చెరువుల్లో పైపైన గడ్డి మొక్కలను తొలగించి పనులు పూర్తిచేసినట్లు రికార్డులు తయారు చేస్తున్నారని, స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. పాలసముద్రం మండలంలో టీడీపీ నేత చేపట్టిన చెరువు పూడిక తీత పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువులో మట్టిని తీసి తన రిసార్ట్‌ చుట్టూ చదును చేసుకున్నారు. ఈ చెరువు పనుల్లో సుమారు రూ.2 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. వరదయ్యపాలెం మండలం కడూరు చెరువు పనులు నామమాత్రంగా చేసి నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనులు సరిగా చేయలేదని స్థానిక రైతులు పనులను అడ్డుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. పూతలపట్టులో నాలుగు చెరువు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు నెల్లూరు జిల్లాకు చెందినవారు టెండర్‌ ద్వారా దక్కించుకున్నట్లు సమాచారం. పనులు ప్రారంభించిన సమయంలో స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు.  దీంతో నాలుగు చెరువు పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

పనులను కూడా అమ్ముకున్న ఘనులు
నీరు చెట్టు పనులు పార్టీ కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉన్నా పడమటి ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కమిషన్లకు కక్కుర్తి పడి కడప జిల్లాలోని మరో టీడీపీ నాయకుడికి అప్పగించారు. అతని నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు పుచ్చుకున్నారు. కుప్పం నియోజక వర్గ పరిధిలో మొత్తం 574 చెరువులు ఉంటే...  2016లో ఓ సారి చెరువుల సంరక్షణ పథకం కింద, మరోసారి జాతీయ ఉపాధిహామీ పథకం కింద, చివరిసారిగా నీరు–చెట్టు పథకంలో మొత్తం 555 చెరువు పనులు చేసినట్లు భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లి పరిధిలోని రామసముద్రం మండలంలో టీడీపీ నాయకులు చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు రికార్డులు తయారుచేసి సుమారు రూ.10 కోట్లు కాజేశారు. నగరి పరిధిలో 15 చెరువుల కింద 40 చెక్‌డ్యాంలు నిర్మించారు. అందులో 20కిపైగా చెక్‌డ్యాంలు నాసిరకంగా నిర్మించినట్లు తెలుస్తోంది. పుత్తూరు పరిధిలోని నందికోన చెరువు పనులు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోలేదు. వీరప్పరెడ్డిపాలెం, నిండ్రమండలంలోని పాదిరిచెరువు, నగరిలోని అడవికొత్తూరు చెరువు పనులు చేపట్టాల్సిన అవసరం లేకపోయినా తూతూ మంత్రంగా పనులు చేసి నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా టీడీపీ నేతలు చేపట్టిన చెరువు పూడిక తీత, చెక్‌డ్యాంల నిర్మాణ పనుల్లో  నిధులు కొల్లగొట్టినట్లు విజిలెన్స్‌ అధికారులు నిగ్గుతేల్చడం గమనార్హం.

పారదర్శక పాలనవైపు అడుగులు
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శక పాలనవైపు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం నీరు చెట్టు కింద చేపట్టిన పనుల్లో అభివృద్ధి కంటే.. అవినీతి అక్రమాలకే పెద్దపీట వేసినట్లు గుర్తించారు. అవినీతి అక్రమాలకు కళ్లెం వేసేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గతంలో పనులు మంజూరై ఇంతవరకు ప్రారంభానికి నోచుకోని వాటిని, కనీసం 25 శాతం కూడా పనులు పూర్తి కాకుండా నామమాత్రంగా చేపట్టిన పనులను సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలిస్తున్నారు. వాటి స్థానంలోనే అవసరమైన చోట కొత్తగా పనులకు శ్రీకారం చుట్టే విధంగా చర్యలు చేపడుతుండడం గమనార్హం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ఇటు ప్రజలు, అటు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఎన్నికల నగారా మోగాక...
సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో టీడీపీ నేతల హడావుడి అధికమైంది. ప్రజా సొమ్మును నిట్టనిలువునా దోచుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకమునుపే నీరు చెట్టు కింద రూ.వందల కోట్ల విలువ చేసే పనులకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ పనులన్నింటినీ టీడీపీ నేతలు, కార్యకర్తలే దక్కించుకున్నారు. హడావుడిగా కాంట్రాక్టర్లు పనులు నామమాత్రంగా ప్రారంభించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.93 కోట్ల విలువ చేసే 348 పనులు నామమాత్రంగా కూడా పనులు చేపట్టకనే వదిలేశారు. కేవలం నిధులు స్వాహా చేసేందుకే ఇలాంటి ప్రక్రియలు చేపట్టారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement