- బహిరంగంగా డబ్బు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు
- ఓటు వేశాక మరికొంత ఇస్తామని ప్రచారం
- పేదల బస్తీల్లో విచ్చలవిడిగా మద్యం సరఫరా
- చోద్యం చూస్తున్న పోలీసులు
కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఆదివారం కూడా యథేచ్ఛగా కొనసాగింది. సాయంత్రానికి ప్రచార పర్వం పరిసమాప్తమయ్యాక ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా అధికార టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పోలీసులు మిన్నకుండిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో చోటా మోటా నాయకులు బహిరంగంగానే స్లిప్పుల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. పేదల బస్తీలలో మద్యం పంచుతున్నారు. మహిళల్ని ఆకర్షించేందుకు ముక్కు పుడకలు, కుంకుమ భరిణెలు, చీరెలు, జాకెట్ ముక్కల్ని ఎర వేస్తున్నారు. డబ్బు పంచుతున్న వారిని వైఎస్సార్ సీపీ నాయకులు పట్టిచ్చినా పోలీసులు కాసేపు స్టేషన్లో కూర్చోబెట్టి ఆ తర్వాత వదిలేస్తున్నారు.
ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నగరంలోని పలు ప్రాంతాల్లో మకాం వేసి డబ్బు, మద్యం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. తొలి విడత డబ్బు తీసుకున్న వారు పోలింగ్ జరిగే మంగళవారం స్లిప్పులు చూపించి మలి విడత సొమ్మును తీసుకు వెళ్లవచ్చని పోటీలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఆయన అనుచరులు ప్రచారం ముగిసిన తర్వాత కూడా పేదల బస్తీల్లో వాహనాల్లో తిరుగుతూ డబ్బు, మద్యం పంచడం వివాదాస్పదమైంది.
కాకినాడ మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇస్తాం..
కాకినాడ మేయర్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్ జనం సాక్షిగా ప్రకటించారు. జగన్ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతూ జగన్ నాయకత్వాన్ని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు పాలనపై విసిగి వేసారిన ప్రజలు ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పి తమ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నారు.
ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. జగన్ రోడ్‌షోలో పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వేణుంబాక విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పార్థసారథి, పినిపే విశ్వరూప్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, కంబాల జోగులు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి పాల్గొన్నారు.
ముస్లిం యువకులను విడిపించండి..
రోడ్‌షో టూటౌన్ పోలీసు స్టేషన్ మీదుగా సాగుతున్నపుడు అక్కడ పెద్ద సంఖ్యలో ముస్లింలు గుమికూడి జగన్‌ను కలిశారు. తమ ప్రాంతంలో అధికార పార్టీ వారు డబ్బు పంచుతున్నారని ఫిర్యాదు చేస్తే తమ పిల్లలనే (యువకులను) స్టేషన్‌లో నిర్బంధించారని వివరించారు. స్టేషన్‌లోకి వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఈ సమయంలో పోలీస్‌స్టేషన్‌లోకి రావడం మంచిది కాదని, సమస్యను జటిలం చేయకూడదని ఆయన వారికి నచ్చ జెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును పిలిచి.. పోలీసు అధికారులతో మాట్లాడి వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగన్ పర్యటన ముగిసిన వెంటనే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇద్దరూ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడి నిర్బంధంలో ఉన్న ముస్లిం యువకులను విడిపించారు.