కేసీ కాలువ కరకట్టనూ తవ్వేస్తున్నారు!
► నీరు– చెట్టు పేరుతో తెలుగు తమ్ముళ్ల దోపిడీ
► మట్టిని అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లు
► కరకట్టను ఆక్రమించి తవ్వుతున్నా పట్టించుకోని అధికారులు
పూడిపోయిన కాలువలో పూడిక తీసి కాలువను సక్రమంగా ఉంచాలి.. అలా తవ్విన మట్టిని కాలువకు ఇరువైపులా వేయాలి.. దానివల్ల కరకట్టలు భద్రంగా ఉంటాయన్నది అధికారుల ఆలోచన. కానీ అధికార పార్టీ నాయకులు నిబంధనలకు నీళ్లొదిలి మట్టి కోసం ఏకంగా కేసీ కెనాల్ ప్రధాన కాలువ కరకట్టనే తవ్వేస్తున్నారు. ఎంతగా అంటే 50 అడుగులు ఉండాల్సిన కట్టను కేవలం 30 అడుగుల వరకు తగ్గించి కరకట్ట మట్టిని తొలగిస్తున్నారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.
ఖాజీపేట: ఖాజీపేట మండలంలో తుడుమలదిన్నె లాకల దగ్గర కేసీ ప్రధాన కాలువ నుంచి లేఅవుట్ కాలువ ఉంది. బ్రిటీష్ కాలం నుంచి ఈ కాలువ ద్వారా తవ్వారిపల్లె, గుత్తికొట్టాలు గ్రామంలోని సాగు భూములకు నీరు అందుతుంది. కేసీ కాలువలో అధికంగా వచ్చే నీటిని లేఅవుట్ కాలువ ద్వారానే మళ్లించేవారు. అయితే కాలువ పూర్తిగా పూడికతో నిండి ఉంది. ఈ కాలువ మరమ్మతులు చేయాలని అధికారులు భావించారు. అందుకు తగ్గట్టుగా నీరు–చెట్టు పేరుతో పూడిక తీత పనులు చేపట్టారు.
అయితే కాంట్రాక్టర్ కాలువ సుమారు 6 మీటర్లు తీయాల్సి ఉంది. కానీ ఏకంగా 16 మీటర్లు తీసున్నారు. కాలువ పక్కనే ప్రధాన కేసీ కాలువ ఉంది. కాలువ కరకట్ట అధికారికంగా సుమారు 50 అడుగులు పైగానే ఉంటుంది. కాలువ కరకట్టను వదిలి సుమారు 10 మీటర్ల దూరంలో లేఅవుట్ కాలువ పూడిక తీత పనులు జరగాల్సి ఉంది. అయితే కరకట్ట మట్టి పూర్తి నాణ్యమైనది కావడంతో ఆ మట్టి కోసం కరకట్టను కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. దీంతో 50 అడుగులు ఉండాల్సిన కాలువ ఇప్పుడు కేవలం 20 అడుగుల కంటే తక్కువ మందంతో కరకట్ట ఉంది.
కాంట్రాక్టర్‌కు కాసుల పంట..
లేఅవుట్ కాలువ పూడిక తీస్తున్న కాంట్రాక్టర్ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కుతున్నాడు. కాలువ లోని పూడిక మట్టిని కాలువ కరకట్టగా ఉపయోగించాలి. కానీ ఆ మట్టిని రైతులకు అమ్ముతున్నాడు. ట్రాక్టర్‌కు రూ.250 నుంచి రూ.300 వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 20 ట్రాక్టర్లకు పైగా 3 జేసీబీలను పెట్టి మట్టిని తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని విక్రయించడం వల్ల కాంట్రాక్టర్‌కు అధిక లాభం వస్తుందని స్థానికుల అభిప్రాయం.
ప్రమాదంలో కేసీ ప్రధాన కాలువ
కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా కాలువ మట్టిని తరలిస్తుండడంతో కేసీ కెనాల్ ప్రధాన కాలువ పూర్తిగా బలహీన పడుతుందని కేసీ కాలువ అధికారులే అంటున్నారు. కాలువకు నిండుగా నీరు వచ్చినప్పుడు ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే లేఅవుట్ కాలువలో నీరు పారేటప్పుడు ఆక్రమణకు గురై చిన్నగా ఉన్న కరకట్ట కోతకు గురవుతుంది. దీని వల్ల కేసీ కాలువ తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులే అంటున్నారు. ఇప్పటికే తవ్వారిపల్లె నుంచి కొమ్మలూరుకు వెళ్లే రహదారిలోని కరకట్ట ఆక్రమించడం వల్ల కరకట్ట బలహీనంగా మారి కోతకు గురైంది. తిరిగి మరమ్మతు చేసేందుకు అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని అధికారులు అంటున్నారు. బలహీనంగా ఉన్న కరకట్టను బలంగా చేయాలంటే అధిక నిధులు అవసరమవుతాయని రైతులు అంటున్నారు. అదే అధికారులు చర్యలు తీసుకుని మట్టిని తొలగించిన కాంట్రాక్టర్ చేతనే తిరిగి పనులు చేయించాలని రైతులు కోరుతున్నారు.
కాలువ ఆక్రమించినా.. తవ్వినా చర్యలు తీసుకుంటాం
‘కేసీ కాలువకు ఇరువైపులా పెద్ద కరకట్టలు ఉన్నాయి. కాలువను ఆక్రమించినా, కరకట్టను తవ్వినట్లు తెలిసినా వారిపై చర్యలు తీసుకుంటాం. కాలువ కరకట్టను తవ్వుతున్నట్లు మాకు తెలియదు’ అని కేసీ కాలువ డీఈ జిలానీ బాషా తెలిపారు.
కేసీ కాలువ కరకట్ట పైనే సాగు... కాలువకూ పట్టాలు
తవ్వారిపల్లె నుంచి తుడుమలదిన్నె మీదుగా కేసీ కాలువ నెంబర్ 26 నుంచి మైదుకూరు వరకు కేసీ కాలువ ప్రధాన కరకట్ట ఉంది. అయితే కొంత మంది రైతులు ఏకంగా కాలువ కరకట్ట పైనే వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కాలువ పైన రాకపోకలకు ఉండే రహదారి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం 10 మీటర్లు మాత్రమే ఉంది. మరికొన్ని చోట్ల అయితే కాలువ కట్టను ధ్వంసం చేసి మరీ సాగు చేసుకుంటున్నారు. ఇంకొందరు కాలువ స్థలం పైనే గుడి కడుతున్నారు. మరికొందరు తమ పొలంలో కలుపుకుని కాలువ స్థలానికి పట్టా కూడా చేసుకున్నారని రైతులు చర్చించుకుంటున్నారు. ఇలా సుమారు 200 ఎకరాలకు పైగానే కరకట్ట స్థలాన్ని ఆక్రమించి కరకట్టను బలహీన పరిచినట్లు తెలుస్తోంది.
అధికారులు ఎక్కడ..
కేసీ కాలువ స్థితిగతులపై సాగు సమయం కంటే ముందు అధికారులు కాలువ వెంబడి వచ్చి పరిశీలించాలి.. అయితే అధికారులు కాలువపై తిరగడమే మానేశారు. ఆక్రమణల పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు దర్జాగా కాలువను ఇష్టానుసారంగా ధ్వంసం చేసున్నారు. ఇలాగే వదిలేస్తే కాలువను పూర్తిగా ఆక్రమించి నామ మాత్రంగా కాలువను ఉంచుతారని పలువురు రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ అక్రమాల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.