
‘వైఎస్ జగన్‌ను చూసి టీడీపీ భయపడుతోంది’
కాకినాడ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి టీడీపీ భయపడుతోందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తి చేస్తారని ఆయన తెలిపారు. బుధవారం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ... ‘చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు.
రాజ్యాంగాన్ని తానే రాసినట్లుగా చంద్రబాబు ఫీల్ అవుతున్నారు. తన గొప్పల కోసం పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. జ్యోతుల నెహ్రును సంతృప్తి పరిచేందుకే ఆయన కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. జ్యోతుల నవీన్ ఇప్పటివరకూ కూడా వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యుడే. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలను వాడవాడలా తీసుకువెళ్తాం’ అని అన్నారు.