‘పచ్చ’ పందేల రాయుళ్లను బైండోవర్ చేయించలేని ఖాకీలు
నిర్వాహకులు, ఆటగాళ్లంతా టీడీపీ నాయకులే
చిన్నాచితకా వ్యక్తులపైనే ప్రతాపం
అధికార పార్టీ నేతల జోలికి వెళ్లాలంటే భయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
సంక్రాంతి నేపథ్యంలో ‘పుంజు’కుంటున్న కోడిపందాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోడిపందాల నిర్వహణకు ఎవరికీ అనుమతిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎవరైనా కోడి పందాలు నిర్వహించినా, జూదమాడినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టం చేసింది. కానీ.. కోడి పందాల ఖిల్లా అయిన మన జిల్లాలో పందాల నిర్వాహకులు, జూదగాళ్లలో అధిక శాతం మంది అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండటంతో పోలీసులు ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. చిన్నాచితకా పందేల రాయుళ్లపై ప్రతాపం చూపించి బైండోవర్ చేయిస్తున్న పోలీసులు అధికార పార్టీ నేతల జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. గతంలో కోడిపందాలు నిర్వహించిన చరిత్ర గలవారిని, ప్రస్తుతం పందాల నిర్వహణకు సమాయత్తమవుతున్న వారిని ముందుగానే బైండోవర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిని జిల్లావ్యాప్తంగా ఖాకీలెవరూ పట్టించుకోవడం లేదు.
ఆ ఎమ్మెల్యేను ఎవరు బైండోవర్ చేయగలరు?
జిల్లా కేంద్రానికి సమీపంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకి కోడిపందాల విషయంలో ఘన చరిత్రే ఉంది. సదరు ప్రజాప్రతినిధిని బైండోవర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా ఇంతవరకు ఆ ప్రాంత పోలీసులు ఆ విషయం ఆలోచించే సాహసం కూడా చేయడం లేదు. పవర్ దన్నుతో అధికారులపై దాడుల చేసే చరిత్ర ఉన్న ఆ నేతకు భయపడిపోయారనుకున్నా.. కనీసం ఏలూరులోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా బైండోవర్ చేయించలేని స్థితిలో పోలీసులు కొట్టుమిట్టాడుతున్నారు. పందెం కోళ్లను పెంచుతూ ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిని రూరల్ పోలీస్ స్టేషన్‌లో బైండోవర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఇంతవరకు ఆయన జోలికి వెళ్లలేకపోయారు. ఏలూరు నగరానికి చెందిన మరో ఇద్దరు టీడీపీ నేతల పేర్లు బైండోవర్ల జాబితాలో ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మంగళవారం రాత్రి నగర టీడీపీ నేత ఇంట్లో పందేలకు సిద్ధంగా ఉన్న 13 కోళ్లను పోలీసులు పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ కేసును రాత్రికి రాత్రే నిర్వీర్యం చేసేశారు. భారీస్థాయిలో బరులు సిద్ధం కాకముందే బడా కోడిపందేల రాయుళ్లను బైండోవర్ చేయించలేని పోలీసుల తీరు చూస్తుం టే.. ఈ ఏడాది గతంకంటే ఎక్కువగా.. అడ్డూఅదుపు లేకుండా కోడిపందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
బడా పందెగాళ్లకు బందీలై..
Published Thu, Dec 31 2015 12:46 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement