- ఎవ్వరికీ సంతకం చేయని చంద్రబాబు
- మోత్కుపల్లి గైర్హాజరు
టీడీపీ అభ్యర్థులుగా గరికపాటి, తోట నామినేషన్లు
Published Wed, Jan 29 2014 2:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారాంకు అందజేశారు. గరికపాటి మూడు సెట్లు, సీతారామలక్ష్మి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. అయితే వీరిలో ఏ ఒక్కరినీ ప్రతిపాదిస్తూ అధినేత చంద్రబాబు సంతకాలు చేయలేదు. నామినేషన్ల దాఖలు కార్యక్రమానికీ వెళ్లలేదు. గరికపాటి, సీతారామలక్ష్మి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై 50 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తనకు అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఎవరినీ ప్రతిపాదించకపోగా, నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. గరికపాటి నామినేషన్ పత్రాలపై పి.అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పయ్యావుల కేశవ్ తదితరులు సంతకాలు చేశారు. సీతారామలక్ష్మి పత్రాలపై గాలి ముద్దుకృష్ణమ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు సంతకాలు చేశారు.
టీడీపీ అభ్యర్థికే నా ఓటు: జేపీ
తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే మద్దతిస్తానని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. ‘‘టీడీపీ అభ్యర్థికి మద్దతివ్వాలని చంద్రబాబు ఫోన్ చేశారు. అయితే ఇద్దరు టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. నాకు ఉన్నదే ఒక్క ఓటు. దానిని టీఆర్‌ఎస్ అభ్యర్థి కేకేకు వేయలేను కదా’’ అని చెప్పారు.
మోత్కుపల్లి వద్దకు బాబు రాయబారం
సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ సీటు ఇస్తాం. ఖర్చును కూడా మేమే భరిస్తాం’’ అంటూ తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వద్దకు అధినేత చంద్రబాబు మంగళవారం పలువురు నేతలను రాయబారానికి పంపారు. వారి ప్రతిపాదనను విన్న మోత్కుపల్లి ఏమాత్రం స్పందించలేదు. తన మనసులో ఏముందో కూడా ఆయన బైట పెట్టలేదు. రాయబారానికి వచ్చిన నేతలు మాత్రం.. మోత్కుపల్లి అలక వీడారని, ఇక అంతా ప్రశాంతతేనని చెబుతున్నారు.
Advertisement
Advertisement