పోలీసు మెట్లెక్కుతున్న ‘టీడీపీ’ నేతలు | TDP leaders going around police station for their cases | Sakshi
Sakshi News home page

పోలీసు మెట్లెక్కుతున్న ‘టీడీపీ’ నేతలు

Published Fri, Feb 7 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

పోలీసు మెట్లెక్కుతున్న  ‘టీడీపీ’ నేతలు

పోలీసు మెట్లెక్కుతున్న ‘టీడీపీ’ నేతలు

 * భార్యతో జయ ‘మంగళం’ వెంకటరమణ
 * ఆత్మ రక్షణ కోసం వంశీ పాకులాట
 * నాగుల్‌మీరాకు ‘సన్’స్ట్రోక్

సాక్షి, విజయవాడ :  జిల్లాల్లో అంతంతమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి  ఎన్నికల ముందు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జిల్లాలో  టీడీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్న మూడు నియోజకవర్గాల నేతలు ప్రస్తుతం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజలకు నీతులు చెప్పే నేతలే పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతుండటంతో ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఇటువంటి నేతల్ని ఎన్నుకుని  చట్టసభలకు ఏవిధంగా పంపగలమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులు, వారి కుటుంబ సభ్యుల కారణంగానే పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో ఆ పార్టీ గల్లంతవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
 
భార్యతో  వెంకటరమణకు మంగళం...
 
కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ  వెంకట రమణ పదిహేను సంవత్సరాలకుపైగా భార్య సునీతతో కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తండ్రైన తరువాత వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. భార్య సునీత తాజాగా పెనమలూరు పోలీసుస్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. తనను, పిల్లలను అనేక రకాలుగా వేధిస్తున్నారని,  డ్రైవర్లు, సిబ్బంది వద్ద తమను చులకన చేసి  మాట్లాడతున్నారని పలు టీవీ చానల్స్‌లో సునీత కన్నీళ్ల పర్యంతమయ్యారు. 

తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని కూడా  ఫిర్యాదులో పేర్కొన్నారామె. ఆడవాళ్ల చట్టాలు బలంగా ఉన్నాయని, అవసరమైతే  జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ వెంకట రమణ బహిరంగంగానే చెబుతున్నారు. భార్య, బిడ్డల్ని పట్టించుకోకుండా వదిలివేసిన వ్యక్తిని  అసెంబ్లీకి ఏ విధంగా పంపుతామని  కైకలూరు నియోజకవర్గవాసులు ప్రశ్నిస్తున్నారు.
 
ప్రాణరక్షణ కోసం వంశీ ఆందోళన..

తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వల్లభనేని వంశీమోహన్ పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఐజీ సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఇప్పటికే డీజీపీ ప్రసాదరావు, సీపీ బత్తిన శ్రీనివాసులు,  డీసీపీ రవిప్రకాష్‌లను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.

సీతారామాంజనేయులు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారనడానికి తన వద్ద ఆధారాలున్నాయని, తనను కాపాడాలంటూ పోలీసు అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు.  అయితే వంశీకి అనేక మంది ఫ్యాక్షనిస్టులతో విభేదాలున్నాయని,  కేవలం ఐజీ నుంచి ప్రాణభయం అనుకుంటే పొరపాటేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల్లో పోటీకంటే కూడా తన ప్రాణాలను కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారు. తన రక్షణే చూసుకోలేనివాడు రాబోయే రోజుల్లో తమకు  ఏ విధంగా రక్షణ కల్పిస్తారని గన్నవరం నియోజకవర్గవాసులు ప్రశ్నిస్తున్నారు.
 
నాగుల్‌మీరాకు సన్‌‘స్ట్రోక్’
 
తెలుగుదేశంలో సౌమ్యుడిగా గుర్తింపు పొందిన విజయవాడ పశ్చిమ నియోకవర్గ ఇన్‌చార్జి నాగుల్‌మీరాకు ఊహించని దెబ్బ తగిలింది. ఆయన కుమారుడు మౌలాలి (మున్నా) వ్యభిచారం కేసులో ఇరుక్కోవడంతో నాగుల్ మీరా ఇబ్బందుల్లో పడ్డారు. రెండు రోజుల కిందట మున్నాను వ్యభిచారం కేసులో టాస్క్‌పోర్సు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మున్నాను బయటకు తీసుకురావడానికి నాగుల్ మీరా పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగారని పార్టీలో ప్రచారం జోరందుకుంది.

పోలీసులు తన కుమారుడిని అరెస్టు చేయడం తప్పదని తెలుసుకున్న మీరా ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడేందుకు తెగ ప్రయత్నించారు.  మున్నా టీడీపీలో క్రియాశీలక కార్యకర్త అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడినే సక్రమమార్గంలో పెంచలేని  నాగుల్‌మీరా ప్రజలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాసులు ప్రశ్నిస్తున్నారు.
 
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ముగ్గురు నేతల విషయంలో చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటారోనని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. లేదా ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతం అవలంభించి అయోమయం సృష్టిస్తారా.. అని  పార్టీ కార్యకర్తలు చలోక్తులు విసురుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement