కైకలూరు టీడీపీలో ఎమ్మెల్సీ రగడ
విజయవాడ : ఎన్నికల సమయంలో..అప్పటి కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు బుధవారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ... ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు ఎమ్మెల్యే సీటు కేటాయించారని తెలిపారు.
ఆ సమయంలో జయమంగళకు ఎమ్మెల్సీ సీటును ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించే ఎమ్మెల్సీ జాబితాలో తొలిగా జయమంగళ పేరు ఉండాలని ఈ సందర్బంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై జిల్లాలోని మంత్రులను కలిసి ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవాలని వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సహకార సంఘాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, కలిదిండి, ముదినేపల్లి మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు నున్న రమాదేవి, భూపతి నాగకల్యాణి, బండి లక్ష్మి, పోసిన కుమారి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.