కైకలూరు టీడీపీలో ముదురుతున్న ముసలం
- టిక్కెట్ల కలకలం
- ఇంటి సమస్యలే జయమంగళను దూరం చేస్తున్నాయా?
- తెరపైకి కొత్త ముఖాలు
- వ్యతిరేకిస్తున్న మాగంటి, జయమంగళ అనుచరగణం
కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కలకలం మొదలైంది. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు పార్టీలో చేరతారని వస్తున్న ఊహాగానాలపై లోక్‌సభ సీటు ఆశిస్తున్న మాగంటి బాబు వర్గం కారాలు మిరియాలు నూరిన విషయం విదితమే. తాజాగా జిల్లాలోని తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కైకలూరు మినహా మిగతావి యథాతథంగా పోటీలో ఉండే అవకాశం ఉందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనం కైకలూరు నియోజకవర్గ పార్టీ వర్గాల్లో శుక్రవారం కలకలం రేపింది.
నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు ఈ అంశంపై స్థానిక మాగంటి బాబు నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నిప్పులు చెరిగారు. టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇప్పటికే బీజేపీలో చేరిన యెర్నేని సీతాదేవికి కైకలూరు సీటు కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కార్యకర్తలు కుండబద్దలు కొట్టినట్టు చె ప్పారు.
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జయమంగళ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం, కార్యకర్తల్లో విభేదాలపై అధిష్టానం ఈ సారి సీటు కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తుందనే అనుమానం కార్యకర్తల్లో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అవకాశం దొరికితే పోటీ చేయడానికి మరో ఇద్దరు నేతలు కాచుకు కూర్చున్నారు.
సీటివ్వకపోతే వ్యతిరేకిస్తాం...
పత్రిక కథనంతో కంగుతున్న నాయకులు జయమంగళకు సీటు కేటాయించకపోతే వ్యతిరేకిస్తామని శుక్రవారం టీడీపీ ఏలూరు లోక్‌సభ పరిశీలకుడు గరికపాటి రామ్మోహనరావుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసేదిలేక పత్రిక కథనాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని నచ్చచెప్పి పంపించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పెన్మెత్స త్రినాథరాజు, వల్లభనేని శ్రీనివాస చౌదరి, కొత్తూరు విఠల్, రేమల్లి విజయబాబు, నాయకులు సమావేశంలో మాట్లాడుతూ మాగంటి, జయమంగళకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు.