చీరాల్లో టీడీపీ నేతల హల్‌చల్‌ | TDP Leaders Hulchul In Municipal Office | Sakshi
Sakshi News home page

చీరాల్లో టీడీపీ నేతల హల్‌చల్‌

Published Tue, Feb 19 2019 1:34 PM | Last Updated on Tue, Feb 19 2019 1:34 PM

TDP Leaders Hulchul In Municipal Office - Sakshi

ఇరిగేషన్‌ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తున్న పాలేటి, ఆయన అనుచరులు

చీరాల: చీరాల రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారంటూ టీడీపీ నేతలు హంగామా సృష్టిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ కూసే సమయంలో మీకేం కావాలో..అడగండి.. ఇచ్చేస్తామంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసం వేటలో పడిన ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడితో చీరాలకు కొత్తగా వచ్చిన అధికారులు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము చీరాల్లో పనిచేయలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రొటోకాల్‌ లేకున్నా ఇప్పటికే అధికారులతో ఆ పార్టీ నాయకులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పథకాలన్నీ అక్రమాలని, వాటిపై విచారణ జరపాలంటూ స్వయంగా ఆ పార్టీ నేతలు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితిలు చీరాల్లో నెలకొన్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే తమకు ముఖ్యమంత్రి రాత పూర్వకంగా ఆదేశాలిచ్చారని, తాము చెప్పిందే చేయాలంటూ అధికారులకు హుకూం జారీ చేస్తున్నారు. మరో వైపు ప్రజలను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తున్న నేపథ్యంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం.. పింఛన్లు ఇప్పిస్తాం.. రేషన్‌ కార్డులు కావాలా.. కొత్త ఇళ్లు నిర్మించుకుంటారా..అంటూ ప్రజలతో దగ్గరుండి అర్జీలు ఇప్పిస్తున్నారు. ఇది సాద్యం కాదని ప్రతి ఒక్కరికి తెలిసినా అసాధ్యాలను సుసాధ్యం చేస్తాం.. తమకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.

వాస్తవంగా నూతన పింఛన్లు, హౌసింగ్‌ అర్హత, సబ్సిడీ రుణాలకు సంబందచి ఆన్‌లైన్‌ నమోదు గడువు గత నెల 12శ తేదీనే ముగిసింది. టీడీపీ నాయకులు మాత్రం తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను నిలువునా మోసం చేస్తూ ఆన్‌లైన్‌ గడువు ముగిసిన పథకాలను తిరిగి ప్రారంభించి పథకాలు అందిస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారంటే చీరాల టీడీపీ నాయకులు ప్రజలను మోసం చేసేందుకు నూతన అధ్యాయానికి తెరలేపారని అర్థమవుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న పరిస్థితుల్లో చీరాల్లో పెద్ద రాజకీయ డ్రామా జరుగుతుంది. ఎమ్మెల్యే ఆమంచి పార్టీని వీడటంతో టీడీపీ సీటును ఆశిస్తున్న పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలు తమ అనుచరులతో కలిసి చీరాల్లో కొత్త రాజకీయాలకు తెరలేపారు.

గత నాలుగు రోజుల నుంచి చీరాల నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులను ఎమ్మెల్సీ పోతుల, మాజీ ఎమ్మెల్యే పాలేటిలు కలుస్తుండటంతో నాలుగేళ్లలో టీడీపీ హయాంలో చీరాల్లో జరిగిన అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటుగా అధికారులతో కలిసి పనులను చూస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారంటే చీరాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న దందాను అర్థం చేసుకోవచ్చు. తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు నియోజకవర్గాల్లోని ప్రజలను మోసం చేస్తున్నారు. చీరాల ఇరిగేషన్‌ డీఈ, పంచాయితీరాజ్‌ డీఈ, మున్సిపల్‌ కమిషనర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్‌అండ్‌బీ డీఈ, డ్రైనేజీ డీఈ, హౌసింగ్‌ డీఈలను కలవడంతో పాటు అభివృద్ధి పనుల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలను వెలికితీయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అంతేగాక గతంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై టీడీపీ నేతలు చీరాల రూరల్, వేటపాలెం, టూటౌన్‌ పోలీసుస్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ‘చంద్రన్న పాలనలో ప్రజలే ముందు’ అనే నినాదంతో కొత్తగా టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టేలా చర్యలు తీసుకుంటూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు మైకుల్లో పట్టణం, గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని పాలేటి, పోతుల సునీతలు నియోజకవర్గంలో ప్రజలను నిలువునా మోసం చేసేలా ఉసిగొల్పుతున్నారు.

ఇక్కడ పనిచేయలేమంటున్న అధికారులు
ఎన్నికల బదిలీల్లో చీరాలకు వచ్చిన నూతన అధికారులు చీరాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజుకో టీడీపీ నాయకుడు కార్యాలయాలకు వచ్చి ఈ పథకంలో అర్హులెవరు?ఎవరెవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించడంతో పాటు అక్రమాలను వెలికి తీయాలని ఫిర్యాదులు చేస్తుండటంతో నూతన అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల వి«ధుల్లో భాగంగా తాము బదిలీపై వస్తే ఈ బాధలేందంటూ అధికారులు వాపోతున్నారు. ఏ హోదా లేకున్నా తమను ప్రశ్నిస్తున్నారని, ఎన్నికల విధులు నిర్వహించకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా ఉన్నతాధికారుల గదుల్లోకి వెళ్లి మరీ తిష్ట వేసుకుని ప్రశ్నిస్తుండటంతో టీడీపీ నేతల ఆగడాలతో తాము ఇక్కడ పనిచేయలేమంటున్నారు.

పోతుల, మున్సిపల్‌ చైర్మన్‌ వాగ్వాదం
చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ మోదడుగు రమేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలోనే వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో తిట్ల పురాణాలు అందుకున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మున్సిపల్‌ కార్యాలయం బయట టెంటు వేయించి ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. అర్జీల అనంతరం ఆ అర్జీలను కమిషనర్‌ శివారెడ్డి చాంబర్‌కు సునీత వెళ్లగా అదే సమయంలో మున్సిపల్‌ చైర్మన్‌ రమేష్‌బాబు కూడా కమిషనర్‌ వద్దకు వచ్చాడు. మున్సిపల్‌ చైర్మన్, వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ పొదిలి ఐస్వామిలు మాట్లాడుతూ పింఛన్లు, గృహ నిర్మాణం, కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించి ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ గత నెల 12నే ముగిస్తే ఇప్పుడు ప్రజల నుంచి అర్జీలు తీసుకుని ప్రజలను మోసం చేస్తారా..అని ప్రశ్నించారు. సునీత, ఆమె అనుచరులు మున్సిపల్‌ చైర్మన్‌పై వాగ్వాదానికి దిగి ప్రభుత్వం తమది.. పథకాలు తాము తెప్పించి ఇస్తాం...నీకేం సంబంధం అంటూ చైర్మన్‌ను ఎదురు ప్రశ్నించి దురుసుగా వ్యవహరించారు. ఓ దశలో ఇరువర్గాల మధ్య తిట్ల పురాణం చోటుచేసుకుంది. కొందరు సర్ది చెప్పడంతో చైర్మన్‌ తన చాంబర్‌కు వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.

చీరాల నుంచి వెళ్లే యోచనలో కమిషనర్‌?
మున్సిపల్‌ కమిషనర్‌గా విధుల్లో చేరి వారం రోజులు గడవకముందే కమిషనర్‌ శివారెడ్డి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చీరాల ఎంపీడీవోగా పోస్టింగ్‌ తీసుకున్న మహబూబ్‌ సుభానీ చీరాల్లో తాను పనిచేయనని ఉన్నతాధికారులకు చెప్పడంతో చేసేదేమిలేక చీరాల ఎంపీడీవో స్థానంలో చేబ్రోలు ఎంపీడీవోను నియమించారంటే చీరాల్లో ఎన్నికల విధులు కూడా సక్రమంగా టీడీపీ నేతలు పని చేసుకోవన్విడం లేదని అధికారులు వాపోతుండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement