గుడివాడ అర్బన్ : జిల్లాలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్ముళ్లు తమ తడఖా చూపుతున్నారు. తాజాగా మంగళవారం గుడివాడ మున్సిపల్ అధికారులపై స్థానిక నేతలు బెదిరింపులకు దిగారు. ‘మా మాట వినలేదంటే ఏదో ఒక సాకుతో ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఉసిగొల్పుతాం. మీ సంగతి చూస్తాం..’ అంటూ గుడివాడకు చెందిన టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కమిషనర్, అధికారులను బెదిరించారు.
మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కౌన్సిలర్లు చింతల వరలక్ష్మి, యేల్చూరి వేణు, అడుసుమిల్లి శ్రీనివాస్, పొట్లూరి కృష్ణారావు, మరికొందరు నాయకులు కలిసి సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ కార్యాలయంలోని జనన మరణ విభాగానికి సంబంధించి ఒక సమాచారం ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేశారు. మున్సిపాల్టీలోని సహాయ సమాచార అధికారి (మున్సిపల్ మేనేజర్) వీరి దరఖాస్తుకు నిర్ణీత వ్యవధిలో సమాధానం ఇవ్వలేదు. సమాచారం కోసం దరఖాస్తు చేసిన టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను వివరణ కోరగా, అప్పీలేట్‌కు వెళ్లాలని ఆయన సూచించారు. దీంతో మళ్లీ ఈ నెల ఒకటో తేదీన అప్పీలేట్ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సమాచారం ఇచ్చేందుకు అప్పీలేట్ అధికారికి 30 రోజుల సమయం ఉంటుంది. కానీ, టీడీపీ నాయకులు మంగళవారం(21వ రోజు) మున్సిపల్ కార్యాలయానికి వచ్చి హడావుడి చేశారు.
తాము దరఖాస్తు చేసినా ఎందుకు సమాచారం ఇవ్వలేదని కమిషనర్ ప్రమోద్‌కుమార్‌తో గొడవకు దిగారు. తనకు అప్పీలేట్ అధికారిగా ఈ నెలాఖరు వరకు సమయం ఉందని, అప్పటిలోపు సమాచారం ఇస్తానని కమిషనర్ చెప్పినా టీడీపీ నాయకులు శాంతించలేదు. ‘మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులకే సమాచారం ఇస్తున్నారు. మాకు ఇవ్వట్లేదు..’ అంటూ కౌన్సిలర్ లింగం ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు. సమాచార హక్కుచట్టం ప్రకారం సమాచారం ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని కమిషన్ చెప్పారు. సంతృప్తి చెందని టీడీపీ నేతలు కమిషనర్ టేబుల్‌పై బాదుతూ ‘మీ సంగతి తేలుస్తాం..’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ వెళ్లిపోయారు.
తమ్ముళ్ల తడాఖా
Published Wed, Oct 22 2014 4:34 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM
Advertisement