
గుంటూరు: పేద కుటుంబంలో జన్మించాడు.. క్రీడలపై మక్కువతో త్రోబాల్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. ప్రతిభ కనబరచడంతో 2012లో ఇండియా త్రోబాల్ టీమ్ సభ్యునిగా ఎంపికయ్యాడు. దేశం తరఫున పాల్గొన్న ప్రతి పోటీలోనూ విశేషంగా రాణించాడు. వరుసగా ఏడు బంగారు పతకాలు సాధించాడు. తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, ప్రభుత్వం తరఫున సాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరకు దళితులకు క్రీడలు ఎందుకంటూ అవమానపరచినా పట్టువదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ సీఎం చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో ఆత్మహత్యకు యత్నించాడు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల కేంద్రానికి చెందిన సునీల్ ఇండియా త్రోబాల్ టీంకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
పేదరికంతో ఇబ్బందులకు గురవుతున్న సునీల్ తనకు ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ తెనాలి ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను కొద్ది నెలల క్రితం కలిసి విజ్ఞప్తి చేశాడు. కనీసం సీఎంని కలిసే అవకాశమైనా ఇప్పించాల్సిందిగా అభ్యర్థించాడు. దళితులకు డబ్బు లేనప్పుడు క్రీడలు ఎందుకంటూ ఆలపాటి అవమానకరంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉందని గుర్తించి దానికోసం పదిసార్లకు పైగా మంత్రి నక్కాను కలిసి వినతిపత్రమిచ్చాడు. ఆయన కూడా అవమానకరంగా మాట్లాడారు. మనోవేదనకు గురైన సునీల్ శుక్రవారం రాత్రి తన ఫేస్‌బుక్ ఖాతాలో 80 నిమిషాల నిడివి కలిగిన వీడియోను పెట్టాడు.అందులో చివరగా తాను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. బంధుమిత్రులు సునీల్‌ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ సునీల్‌ను కలిసింది.
దళితులంటే చులకనగా చూశారు!
సహాయం కోరగా దళితుడిననే కారణంతో టీడీపీ నేతలు తనను చులకనగా చూశారని సునీల్ చెప్పాడు. ఆలపాటి తన సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రాడని ఆరోపించాడు. నక్కా ఆనందబాబును తాను సంప్రదించినా స్పందించలేదన్నాడు. దళితులంటే టీడీపీ ప్రజాప్రతినిధులకు తీవ్ర చులకన భావమన్నాడు. సునీల్ గుంటూరులోని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసి వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment