నేతల మధ్య టీ'ఢీ'పీ | TDP Leaders Internal fight In Chittoor district | Sakshi
Sakshi News home page

నేతల మధ్య టీ'ఢీ'పీ

Published Thu, Sep 20 2018 1:30 PM | Last Updated on Thu, Sep 20 2018 1:30 PM

TDP Leaders Internal fight In Chittoor district - Sakshi

టీడీపీలో వర్గ పోరు రాజుకుంటోంది. పరస్పరం ప్రతికూల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రచారాలతో స్వపక్షంలోని ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆశావహులు ఇందులో కీలక భూమిక పోషిస్తూ ఒకరికొకరు పొగబెట్టుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎవరికి వారు లైన్‌ క్లియర్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. తిరుపతి, మదనపల్లె, పీలేరు నియోజకవర్గంలోని అ«ధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.

సాక్షి, తిరుపతి: జిల్లాలోని తిరుపతి..మదనపల్లె..పీలేరు నియోజక వర్గాల్లో టీడీపీ నేతల మధ్య వర్గ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అడ్డురాకుండా పన్నాగాలు వేసుకుంటున్నారు. తిరుపతి నియోజకవర్గం తీసుకుంటే ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన వైపు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఈ వాదనను ఖండించారు. తిరుపతిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమెను వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ రాకుండా నగరానికి చెందిన కొందరు ముఖ్యులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్య కార్యక్రమాలకు తనకు ఆహ్వానం పంపటం లేదని సుగుణమ్మ ఇప్పటికే పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారు.

 ఇలా పంపకపోవడం వెనుక ఆమె ప్రత్యర్థుల హస్తముం దని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలిసింది. మహా సంప్రోక్షణ సమయంలోనూ, తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈమెకు ఆహ్వానం రాలేదు. ప్రొటోకాల్‌ పాటించకపోవటంపై ఎమ్మెల్యే అసంతప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలోను ఎమ్మెల్యే హాజరుకాలేదు. ఆహ్వానం కూడా లేదని తెలి సింది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వర్గీయులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

 సర్దుకుపోవాలని సుగుణమ్మకు  సీఎం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. తిరుపతిలోనూ తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌ ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా ఆహ్వానం లేదని ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని భోగట్టా. ఈ విషయాలు ముఖ్యమంత్రికి తెలిసినా పెద్దగా స్పందించలేదని సుగుణమ్మ శిబిరం భావిస్తోంది. అధికారులు,  నేతలను పిలిచి మందలించాల్సింది పోయి ‘సర్దుకోపోండి’ అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో సుగుణమ్మను దూరం పెట్టాలని కొందరు టీడీపీ నేతలు ఈ రకంగా పావులు కదుపుతున్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.

కిషోర్‌ వర్సెస్‌ ఇక్బాల్‌
పీలేరులో హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక్బాల్‌ అహ్మద్‌ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలోనే ఇక్బాల్‌కు చంద్రబాబు మాట ఇచ్చారు. గెలిస్తే మంత్రి పదవి... ఓడితే నామినేటెడ్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్బాల్‌ ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్‌ పదవి ఇస్తారని ఆయన ఆశగా ఎదురుచూశారు. పదవి రాకపోగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు  టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచా రం జరుగుతోంది. కిషోర్‌ కూడా తానే అభ్యర్థినని పలుమార్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్‌లో ఇక్బాల్‌ మంచిపేరు సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ అవుతారని ఇక్బాల్‌ను కిషోర్‌ దూరం పెడుతున్నారని తెలిసింది. ∙పార్టీ కార్యక్రమాలపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. పైగా తప్పుడు ప్రచారం చేయిస్తున్నట్లు ఇక్బాల్‌ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొమ్మనకుండా పొగబెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

నరేష్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కుట్ర
మదనపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డికి పార్టీలో అడుగడుగునా భంగపాటు తప్పటం లేదు. వాల్మీకిపురం మండలం గండబోయనపల్లెకు చెందిన ఆయన కాంగ్రెస్‌ సానుభూతిపరుడిగా పనిచేశారు. వైఎస్‌.రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం నరేష్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ వైపు ఆకర్షించింది. వైఎస్సార్‌ హయాం లో మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు సీటీఎం స్పిన్నింగ్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. తరువాత కోర్టుకెక్కి అనూహ్యరీతిలో ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్నారు. 

అధికారంలో ఉన్న టీడీపీలో చేరితే నియోజకవర్గ అభివృద్ధి, తన ఉన్నతికి బాటలేసుకోవచ్చునని టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో నరేష్‌కుమార్‌రెడ్డి చేరడం సహించలేని టీడీపీలోని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. కలెక్టర్‌ ప్రద్యుమ్న, నరేష్‌కుమార్‌రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలను తెరపైకి తెచ్చారు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఆయనను దెబ్బతీసేందుకు సిద్ధపడ్డారు. సొంత పార్టీకే చెందిన కొందరు కుట్ర పన్నుతుండటంపై నరేష్‌ అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీగా పార్టీలో చేరిన నరేష్‌కుమార్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇన్‌చార్జ్‌గా ప్రకటించకపోవడంపై ఆయన అనుచరవర్గం పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement