వెంకటగిరి రాజా ప్యాలెస్
వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న రాజాల కుటుంబీకులు ఆ పార్టీని వీడి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరితోపాటు వేలాదిమంది రాజాల అభిమానులు ఆ పార్టీలోకి వెళ్లారు. అధిక సంఖ్యాకుల సామాజిక వర్గానికి చెందిన చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారద ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది.
సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): వెంకటగిరి ఉద్యమాలకు పెట్టింది పేరు. జమిందారీ వ్యతిరేక పోరాటం పురుడు పోసుకుంది వెంకటగిరిలోనే. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. వెంకటగిరి అంటే గుర్తుకు వచ్చేది వెంకటగిరి సంస్థానం, రాజా కుటుంబీకులు, చేనేత పరిశ్రమ. ఇక నియోజకవర్గంలోని రాపూరు మండలంలోని చెల్లటూరు వద్ద 1983లో నిర్మించిన కండలేరు జలాశయాన్ని 11 కి.మీ. పొడవైన మట్టికట్టతో నిర్మించారు. ఇది ఆసియాలోనే మట్టితో నిర్మించిన అతిపెద్ద డ్యామ్. ఇక వెంకటగిరి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కలిగిన వెంకటగిరి చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించాయి. నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో మైకామైన్ పరిశ్రమ విరాజిల్లుతోంది. అరుదైన మైకా ఖనిజ సంపద వెంకటగిరిలో లభ్యమవతుండడంతో ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నియోజకవర్గంలోని రాపూరు మండలంలోనే ఉంది.
అంతటి విశిష్టత కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలో ఎందరో ఉద్దండులు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు, సీఎంగా పనిచేసిన చరిత్ర ఉంది. అయితే అధికారపార్టీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రతి పనిలోనూ మామూళ్లు ముక్కుపిండి వసూళ్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. కృష్ణపట్నం–ఓబులవారిపల్లి రైల్వే పనులు చేసిన కాంట్రాక్టర్ నుంచి రూ.కోట్లు డిమాండ్ చేయడం, వారు నిరాకరించడంతో తన అనుచరులతో పనులు అడ్డగించడం, కాంట్రాక్టర్లను కమీషన్ డిమాండ్‌కు సంబంధించి ఆడియో టేపులు లీకై రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. అయినా వెంకటగిరి నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్లు నియంత్రత్వ పోకడతో వ్యవహరించినా పార్టీ అధిష్టానం ఆయన్ను చూసీ చూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పచ్చపార్టీలో కనీస గౌరవం దక్కక వివాద రహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, రామ్‌ప్రసాద్ యాచేంద్ర ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారద సైతం ఎమ్మెల్యే పెట్టిన అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఆనం అభ్యర్థిత్వంతో వైఎస్సార్‌సీపీలో జోష్
సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు చిగురించాయి. వెంకటగిరి నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో మౌలిక వసతులు కోసం ఆనం రామనారాయణరెడ్డి ప్రకటిస్తున్న సమగ్ర ప్రణాళికపై పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుండడంతో ఈ దఫా ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ 21 వార్డుల్లో టీడీపీకి పట్టం కట్టారు. ఈ విజయాల పరంపర వెనుక వెంకటగిరి రాజాల కృషి ఉందనేది నిర్విదాంశం. అయితే టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కక రాజా కుటుంబీకులు వైస్సార్‌సీపీలో చేరారు. అంతకు ముందే మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారద సైతం వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
హ్యాట్రిక్ అందని ద్రాక్షే..
గతంలో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, ఓజిలి మండలాల్లో కొంతభాగం వరకూ నియోజకవర్గం ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రాపూరు నియోజకవర్గం అంతర్ధానం కావడంతో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో సరికొత్తగా వెంకటగిరి నియోజకవర్గం అవతరించింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌పార్టీకి పెట్టని కోటగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గం 1983 నుంచి ఎనిమిది పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు దఫాలు టీడీపీ, మూడుసార్లు కాంగ్రెస్‌పార్టీకి నియోజకర్గ ఓటర్లు పట్టం కట్టారు.1956లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి.వెంకటస్వామిరెడ్డి, 1957, 1962లో అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయానికి ప్రయత్నించిన అల్లం కృష్ణయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి ఓరేపల్లి వెంకటసుబ్బయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.
1978లో వెంకటగిరి నియోజకవర్గం జనరల్ కావడంతో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ అభ్యర్థిగా నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్దిగా విజయం సాధించి 90వ దశకంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1994లో జనార్దన్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి, రాజా కుటుంబీకుడు వీవీఆర్‌కే యాచేంద్ర విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రాజ్యలక్ష్మి వరుస విజయాలు సాధించారు. 1999లో హ్యాట్రిక్ విజయం సాధించలేక టీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ౖటీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణను గెలుపొందారు. దీంతో ఆయన 2019లో హ్యాట్రిక్ ఆశలు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. అల్లం కృష్ణయ్య, నేదురుమల్లి రాజ్యలక్ష్మికి దక్కని హ్యాట్రిక్ విజయం ఈ దఫా కురుగొండ్ల రామకృష్ణ నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆయన ఆశలు నెరవేరుతాయో లేక వెంకటగిరి సెంటిమెంట్ మరోసారి పునరావృతం అవుతుందో వేచి చూడాల్సిందే.
వెంకటగిరి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు
మొత్తం ఓట్లు 2,45,144
పురుషులు 1,42,674
స్త్రీలు 1,42,674
ఇతరులు 39
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ | సాధించిన ఓట్లు | సమీప అభ్యర్థి | పార్టీ | సాధించిన ఓట్లు | మెజారిటీ |
2014 | కురుగొండ్ల రామకృష్ణ | టీడీపీ | 83,669 | కొమ్మి లక్ష్మయ్యనాయుడు | వైఎస్సార్‌సీపీ | 78,034 | 5,635 |
2009 | కురుగొండ్ల రామకృష్ణ | టీడీపీ | 69,731 | నేదురుమల్లి రాజ్యలక్ష్మి | కాంగ్రెస్ | 62,965 | 6,766 |
2004 | నేదురుమల్లి రాజ్యలక్ష్మి | కాంగ్రెస్ | 57,830 | వీబీ సాయికృష్ణ యాచేంద్ర | టీడీపీ | 51,135 | 6,695 |
1999 | నేదురుమల్లి రాజ్యలక్ష్మి | కాంగ్రెస్ | 48,876 | తాటిపత్రి శారద | టీడీపీ | 38,158 | 10,718 |
1994 | వీవీఆర్‌కే యాచేంద్ర | టీడీపీ | 61,324 | నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి | కాంగ్రెస్ | 44,328 | 16,996 |
1989 | నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి | కాంగ్రెస్ | 62,270 | నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి | టీడీపీ | 43,129 | 19,141 |
1985 | వీబీ సాయికృష్ణ యాచేంద్ర | టీడీపీ | 55,240 | పెట్లూరు బాలకృష్ణారెడ్డి | కాంగ్రెస్ | 26,418 | 28,822 |
1983 | నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి | టీడీపీ | 40,835 | నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి | కాంగ్రెస్ | 37,282 | 3,553 |
1978 | నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి | కాంగ్రెస్ | 26,696 | పాదిలేటి వెంకటస్వామిరెడ్డి | జనతాపార్టీ | 26,284 | 412 |
1972 | ఓరేపల్లి వెంకటసుబ్బయ్య | కాంగ్రెస్ | 33,136 | అల్లం కృష్ణయ్య | ఇండిపెండింట్ | 9,092 | 24,044 |
1967 | ఓరేపల్లి వెంకటసుబ్బయ్య | ఇండిపెండెంట్ | 31,193 | అల్లం కృష్ణయ్య | కాంగ్రెస్ | 23,197 | 7,996 |
1962 | అల్లం కృష్ణయ్య | కాంగ్రెస్ | 24,075 | బండి చంద్రశేఖర్‌రెడ్డి | స్వరాజ్ | 16,285 | 7,790 |
1957 | అల్లం కృష్ణయ్య | కాంగ్రెస్ | ––––– | ––––– | ––––– | ––––– | ––––– |
1956 | పాదిలేటి వెంకటస్వామిరెడ్డి | కాంగ్రెస్ | 45,989 | ––––– | ––––– | 44,159 | 1830 |
Comments
Please login to add a commentAdd a comment