దురాగతాలపై పోరుబాటే | TDP leaders on attack YSRCP sarpanch | Sakshi
Sakshi News home page

దురాగతాలపై పోరుబాటే

Published Tue, Feb 17 2015 1:56 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

TDP leaders on attack YSRCP sarpanch

 ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొని తీరతాం
  అధికార పార్టీకి వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరిక
  ఎస్.యానాం సర్పంచ్‌పై దాడి పట్ల ఆగ్రహం
  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజం
 
 అమలాపురం :
 ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుల సొంత మండలమైన ఉప్పలగుప్తం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న దాడుల పట్ల ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తీవ్రంగా స్పందించారు. హోం మంత్రిని మచ్చిక చేసుకోవాలనో, ఎమ్మెల్యే వత్తిడి చేశారనో అధికారపార్టీకి చెందినవారు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై భగ్గుమన్నారు. అధికారపార్టీ అండదండలతో జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని, తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్ష నాయకులను దారికి తెచ్చుకోవాలన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని  ఎలుగెత్తారు. గత శనివారం ఎస్.యానాం సర్పంచ్ 70 ఏళ్ల పెట్టా వెంకట్రావుపై టీడీపీకి చెందినవారు దాడి చేయగానే బాధితుడైన ఆయనపైనే తిరిగి హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధితులైన తమ పార్టీ వారికి న్యాయం చేయకుంటే ఎంతవరకు వెళ్లేందుకైనా వెనుకాడేది లేదని అన్నారు.
 
 ఆమరణదీక్షకు సిద్ధం : విశ్వరూప్
 ‘టీడీపీహయాంలో కారంచేడులో జరిగిన సంఘటన ఇప్పుడు అమలాపురంలో పునరావృతమయ్యేలా ఉంది. ఎస్సీ అధికారులను వేధిస్తున్నారు. దూరంగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు దళితులపై దాడులు చేస్తుంటే పోలీసులు వారికి అండగా ఉంటున్నారు. ఎస్.యానాం సర్పంచ్ పెట్టా వెంకట్రావుపై దాడి కేసులో న్యాయం చేయకుంటే అమలాపురంలో ఆమరణదీక్ష చేస్తాను’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం వద్ద సోమవారం జరిగిన అమలాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ హోం మంత్రి చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుల అండ ఉందంటూ ఉప్పలగుప్తం మండలంలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామానికి చెందిన కొంతమంది సర్పంచ్‌పై దాడి చేయడమే కాక ఆయనను తీసుకు వెళుతున్న అంబులెన్స్‌పై కూడా దాడి చేశారని అన్నారు. అటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు దెబ్బలుతిని ఆస్పత్రి పాలైన 70 ఏళ్ల సర్పంచ్ హత్యాయత్నానికి పాల్పడినట్టు 307 కేసు పెట్టడం హాస్యాస్పదమన్నారు. హోంమంత్రి రాజప్ప నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
 
 పోలీస్‌స్టేషన్ కేంద్రంగా అధికార దర్పం : బోస్
 మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ దళితపేటలో ఇంటి వద్దనున్న వ్యక్తిని కొట్టేందుకు వెళ్లారంటే దాడి చేసేవారికి గల అధికారపార్టీ దన్నును అర్థం చేసుకోవచ్చన్నారు. సర్పంచ్‌పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేసి, అతనిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. దాడి జరగడానికి ముందు సర్పంచ్ రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు కేసు కట్టలేదో చెప్పాలన్నారు. దళితులు ఫిర్యాదు చేసినప్పుడు కేసులు పెట్టకుంటే వారు కూడా ముద్దాయిలవుతారని ఎస్సీఎస్టీ అట్రాసిటీలో ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.  హోంమంత్రికి బయపడి బాధితులకు అన్యాయం చేస్తున్నందున ఎస్.యానాం దాడి కేసులో  ఇతర ప్రాంతానికి చెందిన డీఎస్పీతో విచారణ చేయించాలన్నారు. ‘అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అభివృద్ధి  చేద్దామని లేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దానితో పోలీస్ స్టేషన్   కేంద్రంగా అధికార దర్పాన్ని ఇలా ప్రదర్శిస్తుండడం భావ్యం కాదు’ అని హితవు పలికారు. ఇది ఆపకపోతే ఢిల్లీ తరహా తీర్పు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు ఆపకుంటే ఉద్యమించయినా అధికార పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
 రాజప్ప గౌరవాన్ని నిలుపుకోవాలి : కుడుపూడి
 కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ కోనసీమలో పార్టీల మధ్య కక్షా రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేవని, హోంమంత్రి రాజప్ప తన మండలంలో జరుగుతున్న దాడులపై స్పందించాలని అన్నారు. సర్పంచ్‌పై దాడి విషయంలో న్యాయంగా దర్యాప్తు చేయించి గౌరవాన్ని నిలుపుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు, ఉప్పలగుప్తం ఎంపీపీ శిరంగు రాజా ఎస్.యానాం ఘటన జరిగిన తీరును వివరించారు.   సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఐ.వి.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రాష్ట్ర యువత సంయుక్త కార్యదర్శులు వాసంశెట్టి సుభాష్, గనిశెట్టి రమణలాల్, సుంకర సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముత్తాబత్తుల మణిరత్నంతోపాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నాయకులు కాకినాడ వెళ్లి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement