పల్నాట కపట నాటకం! | TDP Leaders Over Action In Palnadu Area | Sakshi
Sakshi News home page

పల్నాట కపట నాటకం!

Published Wed, Sep 11 2019 5:36 AM | Last Updated on Wed, Sep 11 2019 8:10 AM

TDP Leaders Over Action In Palnadu Area - Sakshi

మేడికొండూరు వద్ద టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన వైఎస్సార్‌ సీపీ నేతల వాహనాలు (ఫైల్‌)

సాక్షి, గుంటూరు: అధికారంలో ఉండగా పల్నాడు ప్రాంతంలో అరాచకాలకు పాల్పడిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు, వీటిని ప్రోత్సహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రశాంతతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చేస్తున్న యత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడుపై మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుకు గత ఐదేళ్లలో సొంత పార్టీ నేతలు ఏడుగురిని హతమార్చడంతోపాటు విచ్చలవిడిగా దౌర్జన్యాలు సాగిస్తే కనిపించలేదా? అని ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా గురజాల, మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో గూండాల్లా ప్రవర్తించిన ఆ పార్టీ నేతలు ఈరోజు ఏం ముఖం పెట్టుకుని అరాచకాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేసి పల్నాడు ప్రతిష్టను దిగజార్చొవద్దని హితవు పలుకుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో తాము చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.

కిడ్నాప్‌లతో వికృత రాజకీయాలు..
టీడీపీ నేతలు అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఏడుగురు ఎంపీటీసీలున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముప్పాళ్ల  ఎంపీపీ స్థానం దక్కకుండా కిడ్నాప్‌లకు దిగి ఐదుగురు ఎంపీటీసీలు మాత్రమే ఉన్న టీడీపీకి చేజిక్కించుకున్నారు. 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీలతో కలసి వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా, అంబటి రాంబాబులపై మాజీ స్పీకర్‌ కోడెల తనయుడు శివరామ్‌ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ముస్తఫాతో పాటు అంబటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు. పోలీసులు టీడీపీ ఒత్తిళ్లకు లొంగిపోయి తూతూమంత్రంగా కేసులు పెట్టి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వారి అడుగులకు మడుగులొత్తారు.

నరసరావుపేటలో గూండాయిజం...
నరసరావుపేటలో మాజీ స్పీకర్‌ కోడెల, ఆయన తనయుడు శివరామ్‌ అరాచకాలను అడ్డుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై టీడీపీ అధికారంలో ఉండగా దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహించింది. వైఎస్సార్‌సీపీ నాయకులకు చెందిన ఎన్‌సీవీ, గ్రామీణ కేబుల్‌ నెట్‌వర్క్‌ కార్యాలయాలపై గూండాలతో దాడులు చేయించి కేబుల్‌ పరికరాలను ధ్వంసం చేయడంతో పాటు మాజీ డీసీసీబీ అధ్యక్షుడు నల్లపాటి చంద్రశేఖర్‌రావుపై దాడి చేసి గాయపరిచారు. పైగా తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. 

గత ఐదేళ్లలో పల్నాడులో టీడీపీ హత్యాకాండ...
2014 సెప్టెంబర్‌ 11న
కారంపూడి మండలం చినగార్లపాడులో వైఎస్సార్‌సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి(45)ని టీడీపీ వర్గీయులు హత్య చేశారు. గోవిందరెడ్డి ఇంటి మీద మూకుమ్మడిగా దాడి చేసి వెంటాడి కత్తులతో నరికి చంపారు. అడ్డువచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డిని సైతం హత్య చేసేందుకు యత్నించారు. కోటిరెడ్డి గొంతులో తల్వార్‌ దిగడంతో చాలా రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పటికీ ఆ గాయంతో బాధపడుతున్నాడు.

2014 సెప్టెంబర్‌ 22న
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో వైఎస్సార్‌ సీపీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిలను హతమార్చిన కేసులో ముగ్గురు టీడీపీ నాయకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

2014లో టీడీపీ అధికారం చేపట్టాక
నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో మృతి చెందాడు. అయితే అధికారం అండతో ముగ్గురు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించారు.

2014 డిసెంబర్‌ 19న
దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను టీడీపీ వర్గీయులు హతమార్చారు. కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న ఆయన్ను గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి అతి కిరాతకంగా చంపారు.

2015 కారంపూడి మండలం
నరమాలపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత పెద వెంకటేశ్వర్లు(బ్రహ్మం)ను టీడీపీ వర్గీయులు నరికి చంపారు. 

2017 డిసెంబర్‌లో
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేట కొడవళ్లతో నరికి చంపారు. 

2019 ఏప్రిల్‌ 11న
ఎన్నికల పోలింగ్‌ రోజు గురజాలలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ముస్లింలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేశారు. పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారు.  (చదవండి: రెండు వర్గాల ఘర్షణకు రాజకీయ రంగు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement