సయోధ్య సాధ్యమేనా?
► ఒకే ఒరలో రెండు కత్తులా..!
► నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్యేలకే అంటున్న సీఎం
► ఫిరాయింపుదారుల పెత్తనాన్ని అంగీకరించని పాత నేతలు
► అద్దంకిలో కరణం అంగీకారం ప్రశ్నార్థకమే
► గొట్టిపాటి పెత్తనాన్ని సహించేది లేదంటున్న బలరాం వర్గీయులు
► చీరాల, గిద్దలూరులోనూ ఇదే పరిస్థితి
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది జగమెరిగిన సత్యం. కానీ టీడీపీ జిల్లా రాజకీయాల్లో ఇది సాధ్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉప్పు నిప్పులా ఉంటున్న నాయకులను తిరిగి ఒకే వరలోకి చేర్చాలనే ప్రయత్నం మాత్రం ఫలించేలా లేదు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పూర్తిస్థాయి అధికారాలు ఎమ్మెల్యేలకే కట్టబెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా జిల్లాలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అధికారాలను అప్పగిస్తున్నట్టుగా చెప్పారని సమాచారం. ఆది నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ కరణం బలరాం, చీరాల నేత పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, దివి శివరాం తదితరులు బాబు ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తారా..? లేక తమదైన శైలిలో అసమ్మతిపోరు సాగిస్తారా..?అన్నది తేలాల్సి ఉంది.
అద్దంకిలో సయోధ్య అసాధ్యం..: అద్దంకి రాజకీయాలను పరిశీలిస్తే ఇక్కడ పాత, కొత్త నేతల మధ్య సయోధ్య సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. నియోజకవర్గాన్ని, తన వర్గీయులను వదులుకుని రాజకీయ సమాధి అయ్యేందుకు కరణం బలరాం ఏ మాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. ఆయన మౌనం దాల్చినా.. ఆయన వర్గీయులు ఫిరాయింపు ఎమ్మెల్యేను సహించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ఇక్కడ అధికార పార్టీలో సయోధ్య సంగతి దేవుడెరుగు, వర్గవిభేదాలు మరింతగా పెరగనున్నాయి. ఈ నియోజకవర్గంలో వర్గవిభేదాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో కరణం బలరాంకు వర్గవిభేదాలున్నాయి. గొట్టిపాటిని అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని కరణం ఆదిలోనే వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు ఆయన్ను ఒక దశలో బాబు కరణంకు చెక్ పెడతారన్న ప్రచారమూ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం ఇదే ప్రచారం చేశారు. గొట్టిపాటి రాకతో అద్దంకిలో వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. వీరి గొడవల పుణ్యమా అని ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి–మాఊరు, జనచైతన్యయాత్రలు సైతం అద్దంకిలో జరగలేదు. పింఛన్లు మొదలుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల వరకు ఇరువర్గాలు పోటీ పడటంతో నిలిచిపోయిన పరిస్థితి. ఇక అధికారుల బదిలీల్లోనూ ఆధిపత్య పోరు సాగుతోంది. ఇదే సమయంలో గొట్టిపాటికి లైన్ క్లియర్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కరణం బలరాంకు ఎమ్మెల్సీ కట్టబెట్టినట్లు ప్రచారం ఉంది. అదే సమయంలో ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎమ్మెల్యే సీటిస్తానని బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. బాబు ఎన్ని హామీలిచ్చినా.. కరణం అద్దంకిని గొట్టిపాటికి అప్పగిస్తారా..? కుమారుడి రాజకీయ భవిష్యత్తును ఇందుకు పణంగా పెడతారా..? అన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు అలా జరగదని సమాధానమిస్తున్నారు. కరణం నైజం తెలిసిన వాళ్లు అవసరమైతే కరణం సీఎంనైనా ఎదిరిస్తారే తప్ప తలొగ్గేది లేదని చెబుతుండటం గమనార్హం.
చీరాలలో సయోధ్య సందేహమే..: ఇక చీరాల, గిద్దలూరులలో అదే పరిస్థితి నెలకొంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికార పార్టీలో చేరినా ఆమంచిని పార్టీ టీడీపీ నేత పోతుల సునీత వ్యతిరేకించారు. అడుగడుగునా అడ్డుతగిలారు. ఈ పరిస్థితిని గమనించిన బాబు రెండు వర్గాలను సమన్వయం చేసేందుకు పోతుల సునీతకు ఎమ్మెల్సీ కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అద్దంకి తరహాలోనే మున్ముందు సునీత సైతం ఆమంచి దూకుడుకు అడ్డుకట్ట వేస్తారా... లేక సర్దుకుపోతారా... అన్నది వేచి చూడాల్సిందే! ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూస్తే వారిద్దరి మధ్య పొత్తు సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. సునీత వర్గీయులు ఆమంచిని అడుగుడుగునా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్కడ సయోధ్య ప్రశ్నార్థకమే!
రగడ ఖాయం..: అద్దంకిలో ఇప్పటికీ కరణంకు గట్టి పట్టు ఉంది. మున్సిపాలిటీలో 20 మంది వార్డు కౌన్సిలర్లతో ఆయన వర్గీయులే చైర్మన్‌గా ఉన్నారు. బల్లికురవ ఎంపీపీ మొదలుకొని కోరిశపాడు ఎంపీపీ, జడ్పీటీసీ, జె.పంగులూరు ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు ఆయన వర్గీయులే ఇక నియోజకవర్గవ్యాప్తంగా మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు కరణం వర్గీయులే. ఇక కేడర్ పరంగా గ్రామస్థాయి నుంచి కరణంకు బలమైన పట్టు ఉంది. ఈ పరిస్థితుల్లో కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం నియోజకవర్గాన్ని గొట్టిపాటి చేతుల్లో పెట్టి కరణం తన, కుమారుడు రాజకీయ భవిష్యత్తు వదులుకుంటారనుకోవడం పొరపాటే. గొట్టిపాటి పెత్తనం చలాయించాలని చూసేపక్షంలో కరణం ప్రమేయం లేకుండానే అద్దంకి నియోజకవర్గంలో ఆయన వర్గీయులు ఎమ్మెల్యేకు అడుగడుగునా అడ్డుతగిలే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సైతం కరణం వర్గీయులు అడ్డుకున్న సంఘటనలకు కొదువ లేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే హోదాలో అద్దంకి పెత్తనం చేయడం గొట్టిపాటికి సాధ్యమయ్యే పని కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా కరణం వర్గీయులు వినే పరిస్థితి కానరావడం లేదు. ఇదే జరిగితే అద్దంకి రగడ మరింత పెద్దది కావడం తప్ప సమసిపోయే పరిస్థితి ఉండదు.
ముత్తుములను వ్యతిరేకిస్తున్న అన్నా..: ఇక గిద్దలూరు నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో మంత్రి రావెల కిశోర్‌బాబు, శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, పలుమార్లు వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించిన ఇది సాధ్యం కాలేదు. అన్నా తన ఉనికిని చాటేందుకు ఇప్పటికే నియోజకవర్గంలో పలుమార్లు కార్యకర్తలతో సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించారు. శుక్రవారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సైతం అన్నా రాంబాబుతో మాట్లాడి సర్దుబాటు చేయాలని పార్టీ నేతలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో అటు అన్నాకు సైతం ఏదైనా పదవి కట్టబెట్టి సయోధ్య కుదుర్చుతారా... లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.