మద్యం దుకాణాలపై మంత్రి కన్ను
మద్యం లెసైన్సీలపై టీడీపీ ఒత్తిళ్లు
లాటరీ కోసం దరఖాస్తు
లేయకుండా అడ్డు
ఉన్న దుకాణాల్నీ కొనేస్తున్న వైనం
జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలపై మంత్రి కన్ను
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలోని మద్యం దుకాణాలపై టీడీపీ కన్ను పడింది. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పుడిప్పుడే విజిలెన్స్ సహా అన్ని విభాగాల నుంచి నిఘా పెరగడంతో నేతలు మద్యం వ్యాపారం వైపు దృష్టి మళ్లించారు. గుడ్‌విల్ పేరిట దుకాణాల్ని సొంతం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం పొరుగు జిల్లాల మద్యం వ్యాపారుల్ని రంగంలోకి దించారు. సాక్షాత్తూ జిల్లా
మంత్రికి సన్నిహితంగా ఉంటున్న మద్యం వ్యాపారే ఈ తతంగం నడుపుతుండడంతో బలహీనమైన వ్యాపారులు ఏమీ అనలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలతో తమకెందుకొచ్చిన తగాదా అంటూ వారి ఒత్తిడికి తలవంచుతున్నారు. ఇందుకు ఎక్సైజ్ అధికారులు కూడా వంత పాడుతుండడం విశేషం.
జిల్లా మంత్రి చొరవతో...
జిల్లాలో 232మద్యం దుకాణాలున్నాయి. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి మరో ఏడు దుకాణాలు ఇక్కడకు తరలించారు. పలాస, సీతంపేట వంటి ప్రాంతాల్లో మినహా అన్నిచోట్లా వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో 15బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. వీటి రెన్యువల్ ప్రక్రియ ముగియడం, కొత్త లెసైన్సీ విధానాన్ని అందుబాట్లోకి తీసుకువచ్చామని ప్రభుత్వం ప్రకటించడంతో వాటిపైనా నేతల కన్ను పడింది. మొత్తానికి జిల్లాలోని మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లో ఉండాలన్న మంత్రి ఆదేశాల మేరకు విశాఖ, విజయనగరం నుంచి వ్యాపారస్తుల్ని ఇక్కడకు రప్పించినట్టు ప్రచారం జరుగుతోంది.
కొత్త వ్యాపారులే టార్గెట్
మద్యం దుకాణాల ద్వారా భారీగా సొమ్ము సంపాదించొచ్చనే ఆశతో కొంతమంది కొత్త వ్యక్తులు ఈ వ్యాపారంలోకి అడుగెట్టారు. అనుభవం లేక, పోటీదారుల ఒత్తిళ్లు తట్టుకోలేక, సీనియర్ వ్యాపారుల ఆగడాలు భరించకలేక వారంతా సతమతమవుతున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ టీడీపీ నేతలకు కలిసొచ్చింది. జిల్లాలోని పలు మార్లు దరఖాస్తు చేసేందుకు వచ్చినవారిని ఒత్తిడి తెచ్చి అసలు పోటీలో పాల్గొనకుండానే వెనక్కు పంపిచేశారు. ఇటీవల ప్రభుత్వ మద్యం దుకాణాలకు జరిగిన లాటరీ ప్రక్రియలో కోటబొమ్మాళి పరిధిలో కొత్త వ్యక్తులెవరూ లాటరీకి రాకపోవడమే ఇందుకు ఉదాహరణగా తోటి వ్యాపారులు చెబుతున్నారు.
అదే విధంగా నరసన్నపేట పరిధిలోనూ వ్యాపారులు దరఖాస్తులేయకుండా టీడీపీ నేతలు జాగ్రత్త పడ్డారు. మంత్రి అనుచరుడిగా చె ప్పుకుంటున్న ఓ వ్యక్తి ఏకంగా 200దరఖాస్తులేయించగా (సుమారు రూ. 70లక్షలు ఖర్చుచేసి) వాటిలో ఐదు దుకాణాల్ని దక్కించుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. టెక్కలి నియోజకవర్గ పరిధిలో దాదాపు అన్ని దుకాణాలూ తమవే కావాలని డిమాండ్ చేయడంతో అధికార పార్టీ నేతలతో మనకెందుకంటూ చాలామంది తప్పుకున్నట్టు తెలిసింది. చిన్నచిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తుల్నీ బెదిరించి తమ వ్యాపారానికి అడ్డుతగలకుండా చేసుకున్నారని అధికారులూ పరోక్షంగా చెబుతున్నారు.
గుడ్‌విల్‌పై దుకాణాలు
నష్టాల్లో ఉన్న దుకాణాలతో పాటు వ్యాపారం బాగా జరుగుతున్న దుకాణ దారుల్ని బెదిరించి గుడ్‌విల్ చెల్లించి ఇప్పటికే సుమారు 20షాపుల్ని టీడీపీ నేతలు, అనుయాయులు దక్కించుకున్నట్టు సమాచారం. లాటరీలో మిగిలిపోయిన దుకాణాల్ని కూడా త్వరలో బినామీల ద్వారా దరఖాస్తులేయించి జిల్లాలో మద్యం వ్యాపారం తమ గుప్పిట్లో ఉంచుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఇదే గానీ జరిగితే టోకున మద్యం సరఫరా, నిషేధిత బ్రాండ్ల విక్రయం, భారీగా బె ల్ట్ దుకాణాల కొనసాగింపు, ఎమ్మార్పీ ఉల్లంఘన తప్పదని అబ్కారీశాఖ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.