సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. టెండర్ ఫీజు రెండింతలు చేయడంతో దరఖాస్తులు వస్తాయో రావోననే సందేహాల నడుమ తెచ్చిన కొత్త ఎక్సైజ్ మార్గదర్శకాలు ఆ శాఖకు కాసుల పంట పండించాయి. 2019–21 సంవత్సరాలకు 2,216 దుకాణాలకుగాను 48,243 దరఖాస్తులు రావడం ఆ శాఖ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ దరఖాస్తుల ద్వారా రూ.964 కోట్లు ఖజానాకు చేరడం ఎక్సైజ్ శాఖ అధికారులకు ఊరటనిస్తోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నేడు డ్రా తీయనున్నారు.
29 షాపులకు మాత్రం నేడు లాటరీ తీసే అవకాశం లేదు. ఆయా దుకాణాలకు నాలుగుకంటే తక్కువగా దరఖాస్తులు రావడం తో, దరఖాస్తులను అడ్డుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపాకే ఆ 29 షాపులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. అవసరమైతే మళ్లీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కూడా ఉందన్నారు.
ఖమ్మంలో దుమ్ము రేపారు
జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ఉమ్మ డి జిల్లాలో అత్యధికంగా 8,733, హైదరాబాద్‌లో అత్యల్పంగా 1,499 దరఖాస్తు లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఒక్కో దుకాణానికి 48 మంది టెండర్ వేయడం ఎక్సైజ్ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీకి చెందిన వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తు చేసి ఉంటారని అంచనా. సూర్యాపేట, జనగామ, కొత్తగూడెం జిల్లాలకు కూడా సరాసరిన 32 దరఖాస్తులకు పైగా వచ్చాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సగటున 8.7 దరఖాస్తులు రాగా, పెద్దపల్లి జిల్లాలో 9.9 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ వ్యాపారుల తాకిడితో సరిహద్దు జిల్లాలైన నల్ల గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం.
సోమేశ్ ఆకర్షణ మంత్రం
గతంతో పోలిస్తే ఈసారి టెండర్ ఫీజు పెంచినా భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆకర్షణ మంత్రమే కారణంగా కనిపిస్తోంది. దరఖాస్తు ఫీజు రెండింతలు చేశామన్న ఆలోచనే దరఖాస్తుదారులకు రాకుండా, టెండర్ ఫీజుతో పాటు చెల్లించాల్సిన ధరావతును తీసేయడం ద్వారా సోమేశ్ అండ్ టీం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.
ఓవైపు అప్పటికే లైసెన్స్‌లున్న రిటైలర్లు కొత్త షాపుల కోసం రూపొందించిన మార్గదర్శకాలు వ్యాపారులకు నష్టం చేకూరుస్తాయని ప్రచారం చేసి పోటీని తగ్గించే యత్నం చేసినా, క్షేత్రస్థాయిలోని ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారంలోని లాభాలను ప్రచారం చేయడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారని తెలుస్తోంది.వీటికి తోడు ఏపీకి చెందిన వ్యాపారులు కూడా ఈసారి మన రాష్ట్రంలోని షాపులపై దృష్టి సారించడంతో దరఖాస్తులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంమీద దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడం, గతంకన్నా 7వేలకు పైగా ఎక్కువ దరఖాస్తులు రావడంతో సోమేశ్ అండ్ టీం ఉత్సాహంతో ఉరకలేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment