బుచ్చయ్యదీ ‘బాబు’ బాటే..
మాట తప్పడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్యన్న వాస్తవం..ఎన్నికల్లో రైతులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలులో వంచనతో తేలిపోయింది. అధినేత విద్యనే ఆ పార్టీ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటబట్టించు కున్నట్టుంది.
అనేక తంటాలు పడి దక్కించుకున్న సీటులో గెలుపు కోసం ఆయన కూడా ఎన్నికల్లో ఎడాపెడా హామీల్ని గుప్పించారు. రాజమండ్రిలో పరిసర గ్రామాల విలీనాన్ని అడ్డుకుంటానన్నది వాటిలో ఒకటి. ఇప్పుడు అందుకు విరుద్ధమైన ఉత్తర్వులు వచ్చినా స్పందించకుండా మన్నుతిన్న పాములా మిన్నకున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాకినాడ: రాజమండ్రి నగరపాలక సంస్థలో పరిసర గ్రామాలు విలీనం కాకుండా అడ్డుకుంటానని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల్లో వాగ్దానం చేశారు. తీరా గ్రామాల విలీనానికి వీలుగా రికార్డులు స్వాధీనం చేసుకోవాలని గురువారం పంచాయతీరాజ్‌శాఖ నుంచి నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఉత్తర్వులు రావడం విలీన గ్రామాల ప్రజలను అమోమయంలో పడేసింది. గోరంట్ల హామీల్లో రూరల్ గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం కాకుండా చూస్తానన్నదే కీలకమైంది.
రాజమండ్రి రూరల్ మండలంలో 10, కోరుకొండ మండలంలో నాలుగు, రాజానగరం మండలంలో ఏడు గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఇదివరకే ఉత్తర్వులిచ్చింది. రూరల్ నియోజకవర్గంలో ఉన్న 10 విలీన గ్రామాలకు ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్నందునే గోరంట్ల.. విలీనానికి అడ్డం పడతానని, తాను గెలిస్తే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి, అభివృద్ధికి దోహదం చేస్తానని ఊరించారు. ఇప్పుడు గ్రామాల రికార్డులు స్వాధీనం చేసుకోమన్న ఆదేశాలపై గోరంట్ల మంటారని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు.
రూరల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల తలూపకుండా గ్రేటర్ రాజమండ్రి తాజా ఉత్తర్వులు బయటకు రావంటున్నారు. రాజమండ్రి పరిసరాల్లోని 13 గ్రామాలను కలుపుకొని కొత్త మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపమిచ్చారు. కాతేరు, కోలమూరు, పాలచర్ల, లాలాచెరువు, దివాన్‌చెరువు, పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్‌సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, గాడాల, మోరంపూడి, తొర్రేడు గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. 2031 నాటి జనాభా, అవసరాలకు అనుగుణంగా సర్కార్ ఆ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దాని ప్రకారం రాజమండ్రి విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్ల నుంచి 162.83 చదరపు కిలోమీటర్లకు, నగర జనాభా 3.41 లక్షల నుంచి 5.92 లక్షలకు, డివిజన్‌ల సంఖ్య 50 నుంచి 70కి పెరుగుతాయి.
గతంలోనే విలీనాన్ని ప్రోత్సహించిన గోరంట్ల!
ఎన్నికలప్పుడు విలీనాన్ని అడ్డుకుంటానని హామీ ఇచ్చిన గోరంట్ల తమను నమ్మించి దగాచేశారని విలీన గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విలీనం కోసం పలువురు న్యాయస్థానానికి వెళ్లేలా గోరంట్లే ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్ని ఆపేందుకే గ్రామాల విలీనానికి అనుకూలంగా నరేంద్రపురానికి చెందిన ఇద్దరితో కేసులు వేయించారని రూరల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు నక్కా రాజబాబు విమర్శిస్తున్నారు. ఆయనే గత ఎన్నికల్లో ఓట్ల కోసం విలీనం జరగకుండా అడ్డుకుంటానని హామీలు ఇచ్చేసి, ఇప్పుడేమో విలీనానికి అనుకూలంగా రికార్డులు అప్పగించాలంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు జారీచేసినా కిమ్మనక పోవడంతో ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తమకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరని విలీనాన్ని అడ్డుకొవాలని కోరుతున్నారు.
ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసిన గోరంట్ల
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే నాలుగు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పిన గోరంట్ల గెలిచాక గ్రామాలను విలీనం చేయాలని చూడడం దారుణం. రాజమండ్రికి చెందిన ఆయనను రూరల్ మండల ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. తీరా చూస్తే చంద్రబాబును మించి ప్రజలను మోసం చేసి వారి మనోభావాలను దెబ్బతీశారు. మరోసారి తన మోసకారి బుద్ధిని చూపారు. మండలంలోని గ్రామాల ప్రజలందరూ ఏకమై ఆయన తీరును ఎండగ డుతూ ఉద్యమిస్తాం. ఎట్టిపరిస్థితిల్లోనూ విలీనం కాకుండా అడ్డుకుంటాం.
- నక్కారాజబాబు, మాజీ వైస్ ఎంపీపీ, రాజమండ్రి రూరల్ మండలం
విలీనంతో ఒరిగేదేమీ లేదు..
రాజమండ్రి నగరపాలక సంస్థలో రూరల్ గ్రామాలను విలీనం చేయడం వలన ఒరిగేది ఏమీ లేదు. రాజమండ్రిలోనే అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉంది. కొన్నిచోట్ల మౌలికసదుపాయాలు కూడా లేవు. పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రూరల్ గ్రామాలను విలీనం చేసి ఏమి ఒరగబెడతారు? అధికారంలో ఉన్న పార్టీ విలీనం చేయాలని ప్రతిసారీ కోరడం దారుణం. గతంలో కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను తీసుకువస్తే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వ్యతిరేకించింది. విలీన ప్రతిపాదనను విరమించుకోవాలి.
- దారపు ప్రసాదరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు