పార్టీ జెండాలతో విద్యార్థులు
నెహ్రూనగర్ (సంతమాగులూరు): రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవుంటుందా! పైసలకు కొరతుంటుందా! అధికారమే చేతుల్లో ఉంటే పగలు రాత్రీ తేడా ఉంటుందా.. కార్యకర్తకు, చిన్నారులకు వ్యత్యాసం ఉంటుందా!.. అవునండీ సంతమాగులూరు మండలం.. కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌కు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించేందుకు శుక్రవారం వస్తున్నట్లు స్థానిక టీడీపీ నేతలకు సమాచారం అందింది. ఇంకేముందీ చేతులు, కాళ్లు ఆడలేదు. ఆయన్ను ఎలాగైనా ఒప్పించాలనుకున్నారు.. మెప్పించాలనుకున్నారు. గతంలో మంజూరైన సీసీ రోడ్డును ఎలాగైనా పూర్తి చేసి ఎమ్మెల్యేతో ప్రారంభింపజేయాలని సర్పంచ్ భర్త గుంజి లక్ష్మయ్య భీష్మించారు. ఇంకా అడ్డేముంది. గురువారం అర్ధరాత్రి పనులు చేపట్టేశారు. అక్కడ కనీసం అధికారులు ఉన్నారా.. పర్యవేక్షిస్తున్నారా అని కూడా పట్టించుకోలేదు.
అర్ధరాత్రి సమయంలో పూర్తి చేసిన సీసీ రహదారి
సుమారు రూ. 8 లక్షల రోడ్డును తెల్లారే సరికే పూర్తి చేశారు. వాస్తవంగా నాణ్యతతో సీసీ రోడ్డు వేస్తే రెండు లేదా లేదా మూడురోజులు పడుతుంది. కానీ నెహ్రూనగర్‌లో వేసిన 150 మీటర్లు రోడ్డు మాత్రం ఒక్క రాత్రిలో ప్రత్యక్షం అయింది. తెల్లారింది.. నాయకులంతా హడావుడిగా చేస్తున్నారు. మరోవైపు పక్కనే ఉన్న గవర్నమెంటు స్కూలు బెల్లు గణగణమంది. పిల్లలంతా బిరబిరమంటూ వచ్చేశారు. ఎమ్మెల్యే వస్తున్నారంటూ టీచర్లకూ వణుకు మొదలైంది. వెంటనే కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ‘రేయ్ ఈ టీడీపీ కండువాలు మీ మెడలో వేసుకోండి. మా అన్న ఎమ్మెల్యే ఫొటో ఉన్న స్టిక్కర్లను మీ చొక్కాలకు పెట్టుకోండి’ అంటూ వాటిని అంటించేశారు. అవేంటో కూడా తెలియని పిల్లలు సరదా పడ్డారు. వాళ్లు చెప్పినట్లు చేశారు. చూసిన జనం మాత్రం నవ్వుకున్నారు. అధికారం ఉంటే ఇలాగే ఉంటుందిలే అని సెటైర్లు వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment