mla gottipati ravikumar
-
విద్యార్థుల మెడలో టీడీపీ హారం
నెహ్రూనగర్ (సంతమాగులూరు): రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవుంటుందా! పైసలకు కొరతుంటుందా! అధికారమే చేతుల్లో ఉంటే పగలు రాత్రీ తేడా ఉంటుందా.. కార్యకర్తకు, చిన్నారులకు వ్యత్యాసం ఉంటుందా!.. అవునండీ సంతమాగులూరు మండలం.. కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌కు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించేందుకు శుక్రవారం వస్తున్నట్లు స్థానిక టీడీపీ నేతలకు సమాచారం అందింది. ఇంకేముందీ చేతులు, కాళ్లు ఆడలేదు. ఆయన్ను ఎలాగైనా ఒప్పించాలనుకున్నారు.. మెప్పించాలనుకున్నారు. గతంలో మంజూరైన సీసీ రోడ్డును ఎలాగైనా పూర్తి చేసి ఎమ్మెల్యేతో ప్రారంభింపజేయాలని సర్పంచ్ భర్త గుంజి లక్ష్మయ్య భీష్మించారు. ఇంకా అడ్డేముంది. గురువారం అర్ధరాత్రి పనులు చేపట్టేశారు. అక్కడ కనీసం అధికారులు ఉన్నారా.. పర్యవేక్షిస్తున్నారా అని కూడా పట్టించుకోలేదు. అర్ధరాత్రి సమయంలో పూర్తి చేసిన సీసీ రహదారి సుమారు రూ. 8 లక్షల రోడ్డును తెల్లారే సరికే పూర్తి చేశారు. వాస్తవంగా నాణ్యతతో సీసీ రోడ్డు వేస్తే రెండు లేదా లేదా మూడురోజులు పడుతుంది. కానీ నెహ్రూనగర్‌లో వేసిన 150 మీటర్లు రోడ్డు మాత్రం ఒక్క రాత్రిలో ప్రత్యక్షం అయింది. తెల్లారింది.. నాయకులంతా హడావుడిగా చేస్తున్నారు. మరోవైపు పక్కనే ఉన్న గవర్నమెంటు స్కూలు బెల్లు గణగణమంది. పిల్లలంతా బిరబిరమంటూ వచ్చేశారు. ఎమ్మెల్యే వస్తున్నారంటూ టీచర్లకూ వణుకు మొదలైంది. వెంటనే కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ‘రేయ్ ఈ టీడీపీ కండువాలు మీ మెడలో వేసుకోండి. మా అన్న ఎమ్మెల్యే ఫొటో ఉన్న స్టిక్కర్లను మీ చొక్కాలకు పెట్టుకోండి’ అంటూ వాటిని అంటించేశారు. అవేంటో కూడా తెలియని పిల్లలు సరదా పడ్డారు. వాళ్లు చెప్పినట్లు చేశారు. చూసిన జనం మాత్రం నవ్వుకున్నారు. అధికారం ఉంటే ఇలాగే ఉంటుందిలే అని సెటైర్లు వేసుకున్నారు. -
అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే..!
►ఇంకెవరి జోక్యం వద్దు ►తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు ఒంగోలు: అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌దే పెత్తనమని, ప్రతి అంశంలోనూ ఆయనదే తుది నిర్ణయమని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో అద్దంకి టీడీపీ నేతల మధ్య గొడవ చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రతి విషయంలోను ఎమ్మెల్యే రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంలు పోటీపడి రచ్చ చేస్తుండడంపై సీఎం ఆహ్రం వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే అని మరెవరు జోక్యం చేసుకున్నా క్రమశిక్షణా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే అని స్పష్టం చేసినట్లు సీఎం పేర్కొన్నారు. అద్దంకిలో జోక్యం చేసుకోవద్దని, ఆనాడే కరణం బలరాంకు చెప్పానని, అయినా ఆయన అడ్డుతగలడం ఏమిటని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోమారు కరణం బలరాంను పిలిపించి మాట్లాడతానని సీఎం చెప్పారు. అభివృద్ధి పథకాల లోటుపాట్లపై మంత్రులతో కమిటీ వేస్తామని, వారే పర్యవేక్షిస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తంగా అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే అని తేల్చిచెప్పినట్లు సమాచారం. -
డిష్యుం.. డిష్యుం!
♦ కరణం, గొట్టిపాటి వర్గీయుల బాహాబాహీ ♦ ఇంటి స్థలాల పంపిణీ వివాదంలో ఘర్షణ ♦ కొరిశపాడు తహశీల్దార్ కార్యాలయం వేదిక ♦ ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించిన పోలీసులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అద్దంకిలో కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల వర్గీయులు పరస్పరం సై అంటే సై అంటున్నారు. ఎక్కడపడితే అక్కడ బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన కరణం వర్గీయుడు జాగర్లమూడి జయకృష్ణ, గొట్టిపాటి వర్గీయుడు, సర్పంచ్ రావి శ్రీధర్‌లు కొరిశపాడు తహశీల్దార్ కార్యాలయంలో పరస్పరం దాడులకు దిగారు. చొక్కాలు చింపుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. సాక్షాత్తు తహశీల్దార్ కార్యాలయమే ఇందుకు వేదిక కాగా, తహశీల్దార్ సాక్షిభూతంగా నిలిచారు. పమిడిపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మండలంలోని పమిడిపాడు గ్రామపరిధిలోని సర్వే నెం.797, 798, 800, 807 పరిధిలో 15 ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలాన్ని గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ఓసీలకు చెందిన 362 మందికి పట్టాలివ్వాలంటూ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత ఐదు నెలలుగా అధికారులు ఇదే కసరత్తులో ఉన్నారు. ఇటీవల గొట్టిపాటి వర్గానికి చెందిన సర్పంచ్ రావి శ్రీధర్ ఆధ్వర్యంలో వారి వర్గీయులు 15 ఎకరాల్లో 8 ఎకరాలను ఆక్రమించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందరికీ పట్టాలు పంపిణీ చేయాలనుకున్న స్థలాన్ని గొట్టిపాటి వర్గీయులు ఆక్రమించుకోవడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయించి గ్రామస్తులందరికీ వెంటనే పట్టాలు పంపిణీ చేయాలంటూ కరణం బలరాం స్థానిక తహశీల్దార్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లోనే 15 ఎకరాలను పూర్తిగా సర్వే చేసి అందులో గ్రామానికి చెందిన 362 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తహశీల్దార్ ఎదుటే ధూషణల పర్వం.. విషయం తెలుసుకున్న గొట్టిపాటి వర్గీయుడు, సర్పంచ్ రావి శ్రీధర్ బుధవారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయానికి తన వర్గీయులతో వెళ్లారు. తమ స్వాధీనంలో ఉన్న పొలాలను సర్వే చేసి పంపిణీ చేయాలనుకుంటే ఊరుకునేది లేదని తహశీల్దార్‌పై గొడవకు దిగారు. అదే సమయంలో కరణం వర్గానికి చెందిన ఎంపీపీ అనుచరుడు జాగర్లమూడి జయకృష్ణ సైతం తన అనుచరులతో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థలాలు పేదలకు పంచాల్సిందే అంటూ కరణం వర్గీయులు, తమ స్వాధీనంలో ఉన్న పొలాల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ గొట్టిపాటి వర్గీయులు తహశీల్దార్ పి.వి.సాంబశివరావు ముందే వాదనకు దిగారు. మాటా మాటా పెరిగింది. తిట్లు, దూషణలు మిన్నంటాయి. వాగ్వాదం పతాకస్థాయికి చేరింది. వెంటనే రావి శ్రీధర్, జాగర్లమూడి జయకృష్ణలు ఒకరిపై ఒకరు కలియబడ్డారు. ‘నీ అంతు తేలుస్తానంటే.... నీ అంతు తేలుస్తానంటూ’ హెచ్చరికలు జారీ చేసుకున్నారు. గొడవ తీవ్రరూపం దాల్చటంతో తహశీల్దార్‌తో పాటు అక్కడున్న కొందరు ఇద్దరిని విడిపించారు. ఇంతలో కొందరు మేదరమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన కొరిశపాడుకు చేరుకున్న మేదరమెట్ల పోలీసులు ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పమిడిపాడులో పోలీస్ పికెట్.. ఇటు సర్పంచులతో పాటు రావి శ్రీధర్, ఎంపీపీ అనుచరుడు జాగర్లమూడి జయకృష్ణలపై రౌడీషీట్లు ఉన్నాయి. ఇద్దరి గొడవతో పమిడిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు పమిడిపాడులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పమిడిపాడులో 15 ఎకరాల స్థలాన్ని గ్రామస్తులందరికీ ఇంటి స్థలాలుగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తహశీల్దార్ పి.వి.సాంబశివరావు సాక్షికి తెలిపారు. అయితే ఒక వర్గం అందులో 8 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఆక్రమణలు తొలగించి గ్రామంలోని 362 మందికి పట్టాలు పంపిణీ చేయాలనుకున్న మాట నిజమేనన్నారు. ఇంతలో ఇరువర్గాలు వచ్చి గొడవ పడ్డారని తహశీల్దార్ తెలిపారు. ఇరువర్గాలు తహశీల్దార్ కార్యాలయంలోనే గొడవకు దిగిన విషయం సమాచారం అందటంతో అక్కడికి చేరుకొని ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయన్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా పోలీస్ పికెటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
నేనెవర్నీ కొనడంలేదు: సీఎం చంద్రబాబు
టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విజయవాడ (లబ్బీపేట): ‘నేను ఎవరినీ డబ్బులిచ్చి కొనడం లేదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు.. నాకు ఏ బలహీనతలు లేవు..’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. విజయవాడలోని ఎ-కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. -
గొట్టిపాటి అందుకే పార్టీ మారుతున్నారు: కరణం బలరాం
► అక్రమ సంపాదనను కాపాడుకోవడానికే.. ► పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు ► గొట్టిపాటి రవి చేరికను కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు ► టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి విజయవాడ: అక్రమంగా సంపాదించిన సొమ్మును, ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అధికార పార్టీలో చేరితే తప్పుడు మార్గంలో సంపాదించిన సొమ్మును కాపాడుకోవచ్చని చూస్తున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై పరోక్షంగా ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీలో గొట్టిపాటి చేరికను వ్యతిరేకిస్తున్న బలరాం ఆ విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించేందుకు మంగళవారం రాత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్లేముందు, బయటికొచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని నిరోధించడానికి పదునైన చట్టాలుండాలని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం అలాంటి చట్టం తీసుకొస్తే ఇలాంటి పిల్లిమొగ్గలు, ఫిరాయింపులు ఉండవన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని టీడీపీలో చేర్చుకునే విధానంలోనే లోపముందన్నారు. గొట్టిపాటి చేరికను అద్దంకి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మిగతా జిల్లాల రాజకీయానికి, ప్రకాశం జిల్లా రాజకీయానికి తేడా ఉందని.. ఆయా జిల్లాల రాజకీయాలను తమ జిల్లాతో పోల్చకూడదని అన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తుందంటే ఆందోళన చెందుతున్నారని కరణం బలరాం చెప్పారు.