గొట్టిపాటి అందుకే పార్టీ మారుతున్నారు: కరణం బలరాం
► అక్రమ సంపాదనను కాపాడుకోవడానికే..
► పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు
► గొట్టిపాటి రవి చేరికను కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు
► టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి
విజయవాడ: అక్రమంగా సంపాదించిన సొమ్మును, ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అధికార పార్టీలో చేరితే తప్పుడు మార్గంలో సంపాదించిన సొమ్మును కాపాడుకోవచ్చని చూస్తున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై పరోక్షంగా ఆయన ఆరోపణలు చేశారు.
టీడీపీలో గొట్టిపాటి చేరికను వ్యతిరేకిస్తున్న బలరాం ఆ విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించేందుకు మంగళవారం రాత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్లేముందు, బయటికొచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని నిరోధించడానికి పదునైన చట్టాలుండాలని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం అలాంటి చట్టం తీసుకొస్తే ఇలాంటి పిల్లిమొగ్గలు, ఫిరాయింపులు ఉండవన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని టీడీపీలో చేర్చుకునే విధానంలోనే లోపముందన్నారు. గొట్టిపాటి చేరికను అద్దంకి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మిగతా జిల్లాల రాజకీయానికి, ప్రకాశం జిల్లా రాజకీయానికి తేడా ఉందని.. ఆయా జిల్లాల రాజకీయాలను తమ జిల్లాతో పోల్చకూడదని అన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తుందంటే ఆందోళన చెందుతున్నారని కరణం బలరాం చెప్పారు.