అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే..!
►ఇంకెవరి జోక్యం వద్దు
►తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు
ఒంగోలు: అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌దే పెత్తనమని, ప్రతి అంశంలోనూ ఆయనదే తుది నిర్ణయమని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో అద్దంకి టీడీపీ నేతల మధ్య గొడవ చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రతి విషయంలోను ఎమ్మెల్యే రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంలు పోటీపడి రచ్చ చేస్తుండడంపై సీఎం ఆహ్రం వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే అని మరెవరు జోక్యం చేసుకున్నా క్రమశిక్షణా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది.
కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే అని స్పష్టం చేసినట్లు సీఎం పేర్కొన్నారు. అద్దంకిలో జోక్యం చేసుకోవద్దని, ఆనాడే కరణం బలరాంకు చెప్పానని, అయినా ఆయన అడ్డుతగలడం ఏమిటని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోమారు కరణం బలరాంను పిలిపించి మాట్లాడతానని సీఎం చెప్పారు. అభివృద్ధి పథకాల లోటుపాట్లపై మంత్రులతో కమిటీ వేస్తామని, వారే పర్యవేక్షిస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తంగా అద్దంకి పెత్తనం గొట్టిపాటిదే అని తేల్చిచెప్పినట్లు సమాచారం.