డిష్యుం.. డిష్యుం!
♦ కరణం, గొట్టిపాటి వర్గీయుల బాహాబాహీ
♦ ఇంటి స్థలాల పంపిణీ వివాదంలో ఘర్షణ
♦ కొరిశపాడు తహశీల్దార్ కార్యాలయం వేదిక
♦ ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అద్దంకిలో కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల వర్గీయులు పరస్పరం సై అంటే సై అంటున్నారు. ఎక్కడపడితే అక్కడ బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన కరణం వర్గీయుడు జాగర్లమూడి జయకృష్ణ, గొట్టిపాటి వర్గీయుడు, సర్పంచ్ రావి శ్రీధర్‌లు కొరిశపాడు తహశీల్దార్ కార్యాలయంలో పరస్పరం దాడులకు దిగారు. చొక్కాలు చింపుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. సాక్షాత్తు తహశీల్దార్ కార్యాలయమే ఇందుకు వేదిక కాగా, తహశీల్దార్ సాక్షిభూతంగా నిలిచారు. పమిడిపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మండలంలోని పమిడిపాడు గ్రామపరిధిలోని సర్వే నెం.797, 798, 800, 807 పరిధిలో 15 ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలాన్ని గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ఓసీలకు చెందిన 362 మందికి పట్టాలివ్వాలంటూ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత ఐదు నెలలుగా అధికారులు ఇదే కసరత్తులో ఉన్నారు. ఇటీవల గొట్టిపాటి వర్గానికి చెందిన సర్పంచ్ రావి శ్రీధర్ ఆధ్వర్యంలో వారి వర్గీయులు 15 ఎకరాల్లో 8 ఎకరాలను ఆక్రమించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందరికీ పట్టాలు పంపిణీ చేయాలనుకున్న స్థలాన్ని గొట్టిపాటి వర్గీయులు ఆక్రమించుకోవడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయించి గ్రామస్తులందరికీ వెంటనే పట్టాలు పంపిణీ చేయాలంటూ కరణం బలరాం స్థానిక తహశీల్దార్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లోనే 15 ఎకరాలను పూర్తిగా సర్వే చేసి అందులో గ్రామానికి చెందిన 362 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
తహశీల్దార్ ఎదుటే ధూషణల పర్వం..
విషయం తెలుసుకున్న గొట్టిపాటి వర్గీయుడు, సర్పంచ్ రావి శ్రీధర్ బుధవారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయానికి తన వర్గీయులతో వెళ్లారు. తమ స్వాధీనంలో ఉన్న పొలాలను సర్వే చేసి పంపిణీ చేయాలనుకుంటే ఊరుకునేది లేదని తహశీల్దార్‌పై గొడవకు దిగారు. అదే సమయంలో కరణం వర్గానికి చెందిన ఎంపీపీ అనుచరుడు జాగర్లమూడి జయకృష్ణ సైతం తన అనుచరులతో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థలాలు పేదలకు పంచాల్సిందే అంటూ కరణం వర్గీయులు, తమ స్వాధీనంలో ఉన్న పొలాల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ గొట్టిపాటి వర్గీయులు తహశీల్దార్ పి.వి.సాంబశివరావు ముందే వాదనకు దిగారు.
మాటా మాటా పెరిగింది. తిట్లు, దూషణలు మిన్నంటాయి. వాగ్వాదం పతాకస్థాయికి చేరింది. వెంటనే రావి శ్రీధర్, జాగర్లమూడి జయకృష్ణలు ఒకరిపై ఒకరు కలియబడ్డారు. ‘నీ అంతు తేలుస్తానంటే.... నీ అంతు తేలుస్తానంటూ’ హెచ్చరికలు జారీ చేసుకున్నారు. గొడవ తీవ్రరూపం దాల్చటంతో తహశీల్దార్‌తో పాటు అక్కడున్న కొందరు ఇద్దరిని విడిపించారు. ఇంతలో కొందరు మేదరమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన కొరిశపాడుకు చేరుకున్న మేదరమెట్ల పోలీసులు ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పమిడిపాడులో పోలీస్ పికెట్..
ఇటు సర్పంచులతో పాటు రావి శ్రీధర్, ఎంపీపీ అనుచరుడు జాగర్లమూడి జయకృష్ణలపై రౌడీషీట్లు ఉన్నాయి. ఇద్దరి గొడవతో పమిడిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు పమిడిపాడులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పమిడిపాడులో 15 ఎకరాల స్థలాన్ని గ్రామస్తులందరికీ ఇంటి స్థలాలుగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తహశీల్దార్ పి.వి.సాంబశివరావు సాక్షికి తెలిపారు. అయితే ఒక వర్గం అందులో 8 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు.
ఆక్రమణలు తొలగించి గ్రామంలోని 362 మందికి పట్టాలు పంపిణీ చేయాలనుకున్న మాట నిజమేనన్నారు. ఇంతలో ఇరువర్గాలు వచ్చి గొడవ పడ్డారని తహశీల్దార్ తెలిపారు. ఇరువర్గాలు తహశీల్దార్ కార్యాలయంలోనే గొడవకు దిగిన విషయం సమాచారం అందటంతో అక్కడికి చేరుకొని ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయన్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా పోలీస్ పికెటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.