అద్దంకి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన నిర్ణయం చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. దొంగదీక్షలు చేపట్టడం మానుకుని నిజాయితీగా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో అద్దంకిలో రవికుమార్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు శనివారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్ట విభజనపై తన నిర్ణయం ఏమిటో చెప్పకుండానే సీమాంధ్రలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలను రోడ్లపైకి పంపి సమైక్యాంధ్ర నినాదాలు చేయించడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని, ఆ మేరకు రెండోసారి ఆమరణ దీక్ష చేపట్టారని తెలిపారు. చంద్రబాబు కూడా తన నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించిన తర్వాతే దీక్ష చేపట్టాలని, అప్పుడు మాత్రమే టీడీపీ నాయకులు, కార్యకర్తలను రోడ్లపైకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజీనామాలు చేస్తున్న ఎంపీలు, మంత్రులు.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన వెంటనే రాజీనామాలు చేసిఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్నారు.
కాంగ్రెస్, టీడీపీల స్వార్థం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రజలకు అన్ని విషయాలూ తెలుసని, అందుకే రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుల ఇళ్లపై వారే స్వచ్ఛందంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదని, అందువల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహానేత వైఎస్‌ఆర్ బతికుంటే విభజన మాటెత్తే ధైర్యం ఎవరికీ ఉండేదికాదని గొట్టిపాటి పేర్కొన్నారు. ఆయన మరణానంతరం కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రంలో పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదని, అన్ని పార్టీలూ వైఎస్‌ఆర్ సీపీని ఆదర్శంగా తీసుకుని విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కుతీసుకునేంత వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజాసంక్షేమం కోసమే జగన్ దీక్ష : నూకసాని బాలాజీ
కందుకూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని రెండుప్రాంతాలైన తెలంగాణ, సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోసమే వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ పేర్కొన్నారు. జగన్ ఆమరణ దీక్షకు మద్దతుగా కందుకూరు అంబేద్కర్ బొమ్మ వద్ద వైఎస్‌ఆర్ సీపీ నాయకులు శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ దీక్షలను ప్రారంభించిన నూకసాని బాలాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం జగన్‌మోహన్‌రెడ్డిని 16 నెలల పాటు అన్యాయంగా జైలులో నిర్బంధించిందని, అంతటి బాధలోనూ సమైక్య రాష్ట్రం కోసం జైలులో కూడా జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. జైలు నుంచి ఆయన బయటకు వచ్చిన కొద్దిరోజులకే తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో చలించి పోయి సమైక్య రాష్ట్రం కోసం రెండోసారి ఆమరణ నిరాహార దీక్షను శనివారం నుంచి ప్రారంభించారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినప్పటికీ లెక్కచేయకుండా ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమై జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. గతంలో కూడా విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ దీక్ష, రైతుల కోసం రైతు దీక్ష, మహిళల సమస్యల పరిష్కారానికి మహిళలతో దీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్న కేసీఆర్.. తెలంగాణలోని ప్రజల కోసం గతంలో ఏం పోరాటాలు చేశారో చెప్పాలని బాలాజీ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో ఇరుప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయన ఢిల్లీలో దీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నాడో ప్రజలకు అర్థంకావడం లేదన్నారు. తన దీక్ష ఉద్దేశాన్ని చంద్రబాబునాయుడు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌లు ఢిల్లీలో ఎందుకు కలిశారో కూడా చెప్పాలన్నారు. లేకుంటే ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి, మండల కన్వీనర్ పీవీ రమణయ్య, యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేషం గంగిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సుదర్శిశ్యామ్, యువజన విభాగం పట్టణ, మండలాల అధ్యక్షులు షేక్ రఫి, కూనం రామకృష్ణారెడ్డి, కొండారెడ్డిపాలెం సర్పంచ్ సురేష్, పార్టీ నాయకులు గొడ్డటి బాలరాఘవ్‌యాదవ్, కొల్లి మాధవరావు పాల్గొన్నారు.
బాబూ..నీ నిర్ణయం చెప్పు
Published Sun, Oct 6 2013 5:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement