
అనంతపురం టౌన్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శనివారం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏపార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి మాత్రమే ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి చేయూతను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 176 మంది కార్యకర్తలకు రూ.3.52 కోట్లు సాయం అందించామని గుర్తు చేశారు. 1984లో అవిశ్వాసం పెట్టి అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ను పదవి నుంచి దించితే అప్పట్లో జిల్లా ప్రజలు ఎన్‌టీఆర్‌కు అండగా నిలిచారని తెలిపారు.
విభేదాలు వీడి కలిసికట్టుగా పని చేయాలి
విభేదాలను వీడి కలిసికట్టుగా పని చేయాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. నాయకుల్లో విభేదాలోస్తే తానే రంగంలోకి దిగుతాని స్టేజ్‌పైన ఉన్న ప్రజాప్రతినిధులును చూపిస్తూ అన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారు ఎంతటి వారైన ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ పనితీరును వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పని చేయాలన్నారు. ఇప్పటికే ప్రతి 100 ఓట్లకు ఒక సేవా మిత్రను ఏర్పాటు చేశామన్నారు. బూత్ కమిటీలు, సేవా మిత్రలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, శాసనమండలి చీఫ్ విఫ్ పయ్యావుల కేశవ్, ఎంపీలు నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జితేంద్రగౌడ్, ఉన్నం హనుమంతరాయచౌదరి, గోనుగుంట్ల సూర్యనారాయణ, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, అత్తార్‌చాంద్‌బాషా, యామినిబాల, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మెట్టు గోవిందరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment