
పొత్తుపై టీడీపీకి ఆశా ‘కిరణం’!
ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని డిసైడయిన టీడీపీ.. తమతో పొత్తులకొచ్చే పార్టీల కోసం బూతద్ధం పెట్టి వెతుకుతోంది. పార్టీలు మారి వచ్చే వారిని చేర్పించుకోవడానికి ప్యాకేజీలు ప్రకటించిన తరహాలోనే పార్టీలకూ టోకుగా ప్యాకేజీని సిద్ధంగా ఉంచినా.. టీడీపీతో పొత్తంటేనే వామ్మో అని అన్ని పార్టీలు భయపడుతున్నాయట. ఆ పార్టీ నాయకత్వాన్ని జనం నమ్మడం లేదని, అలాంటి పార్టీతో పొత్తేంటని ముఖం మీదే చెప్పేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు బాధపడిపోతున్నారు.
మనతో పొత్తంటే పార్టీలు ఎగిరి గంతేసి ముందుకొచ్చిన రోజులు పోయి ఇలా అయిందేంటబ్బా అని మథనపడుతున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు సన్నిహిత నేత ఒకరు శుభవార్త చెప్పారట. మనతో పొత్తు పెట్టుకుని కలిసి పని చేయడానికి ఆశా కిరణంలా కొత్త పార్టీ రాబోతోందని చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు తెగ ఆనందపడిపోతున్నారట. అదేంటి సీఎం కిరణ్ ఏర్పాటు చేయబోతున్న కొత్త పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న గ్యారంటీ ఏంటి? ఏమాత్రం అనుమానం అక్కరలేదు. పొత్తు గ్యారంటీ...! ‘ఒక్కొక్కరం ఏమీ చేయలేం...! అందుకే వచ్చే ఎన్నికలను ఎదుర్కొనడానికి ఏం చేయాలన్న దానిపై మన అధినేతతో ముందుగానే చర్చలు జరిగిపోయాయి. పార్టీ ఎప్పుడు పెట్టాలి? ఏం చేయాలి? ముందుగానే డిసైడైంది! విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో లగడపాటి, మన పార్టీ నేతలు, కొత్త పార్టీలోకొచ్చే మిగతా వాళ్లంతా ఒకే వేదికపై కూర్చున్నది చూడలేదా...?’ అని టీడీపీ నేత ఒకరు చెప్పడంతో తమ్ముళ్లు హమ్మయ్య.. అనుకున్నార్ట!