జిల్లాలో తెలుగు తమ్ముళ్లు‘చౌక’ దందాకు అంతూపొంతూ లేకుండా పోతోంది. రేషన్ దుకాణాలపై పడి పైసలేరుకోడానికి చీకటి ఒప్పందాలకు శ్రీకారం చుడుతున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. డీలర్లను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించే పని జోరందుకుంది. అధికార బలంతో నెలవారి మామూళ్లకు బరి తెగిస్తున్నారు. అందుకు అంగీకరించిన దుకాణదారులపై దాడులు పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.
విశాఖ రూరల్: హుదూద్ తుపాను జిల్లా ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తే.. ప్రజాప్రతినిధులు, వారి అనుచరులకు మేలు చేసింది. బాధితులకు 25 కిలోల బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరకులను చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేపట్టింది. ముందు కార్డుదారులకు సరుకులు ఇచ్చారు. తరువాత కార్డు లేని వారికి ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. కార్డులేని వారికి ఏ విధంగా ఇవ్వాలన్న విషయంపై అధికారులు తర్జనభర్జన పడగా.. ఈ అవకాశాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. స్థానికంగా ప్రజల్లో పట్టు సాధించడానికి ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీ సిఫార్సు లేఖలను తెరపైకి తీసుకొచ్చారు. జన్మభూమి కమిటీలో సభ్యులందరూ టీడీపీ నేతలే ఉన్నారు. దీంతో ప్రతీ రేషన్ దుకాణం వద్ద ఎమ్మెల్యేల అనుచరులు, స్థానిక నేతలు తిష్టవేశారు.
టీడీపీ నేతల జులుం: ప్రతి దుకాణం వద్ద టీడీపీ నాయకుల హవా కనిపిం చింది. ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన స్లిప్పులను తమకు నచ్చిన వారికి పంపిణీ చేశారు. వారు చెప్పిన వారికే రేషన్ ఇవ్వాలంటూ డీలర్లపై పెత్తనం చెలాయించారు. అంతటితో ఆగకుండా ఎంత మొత్తంలో సరుకులు వచ్చాయి, ఎంత మేర పంపిణీ చేశారో రిజిస్టర్లు చూపించాలంటూ డీలర్లపై జులుం ప్రదర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలురన్న సందేహం ఉన్న డీలర్లపై వీరు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. కొంత మం దిపై విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించారు. టీడీపీ అనుచరుల షాపుల్లో అక్రమాలను విజిలెన్స్ అధికారులు వెలుగులోకి తెచ్చినప్పటికీ వారిపై కేసులు పెట్టకపోవడం విశేషం.
అనకాపల్లిలో ఒక రేషన్‌షాపుపై నిఘా అధికారులు దాడులు చేయగా 40 మంది లబ్ధిదారులకు సరకుల పంపిణీ విషయం లో తేడా ఉన్నట్లు గుర్తించి షాపును మూసివేశారు. అయితే స్థానిక నాయకుడు అధికారుల నుంచి తాళాలు తీసుకొని వారి అనుచరులకే ఆ పంపిణీ బాధ్యతలను అప్పగించడం స్థానికంగా దుమారం రేపింది. ఎస్.రాయవరం మండలంలో ఒక రేషన్‌షాపుపై అధికారులు తనిఖీలు నిర్వహించగా సరకుల్లో వ్యత్యాసంతో పాటు, రికార్డులు సక్రమంగా లేనట్లు గుర్తించినప్పటికీ సదరు డీలర్ టీడీపీ వర్గీయుడు కావడంతో కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అడవివరంలో రేషన్‌షాపుల పరిధిలో స్థానిక నేత 530 మందికి స్లిప్పులు అందించి వారికి సరకులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో వారు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి గంటా డీలర్లపై దాడులు చేయించి సదరు నాయకునిపై మాత్రం ఫిర్యాదు చేయకుండా వదిలేశారు. ఇలా జిల్లాలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
చీకటి ఒప్పందాలు
హుదూద్ సాయం పంపిణీలో డీలర్లపై పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు చీకటి ఒప్పందాలకు తెరలేపుతున్నాయి. ఎమ్మెల్యేల అనుచరులమంటూ నెల వారి మామూళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ప్రతీ నెలా మిగులు సరకులను తాము సూచించిన వారికి చెప్పిన ధరకే విక్రయించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ షాపునకు ఇండెంట్ పెడుతున్నారు. తమ ద్వారా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే ఇబ్బందులు ఉండవంటూ భరోసా ఇస్తున్నారు. లే కుంటే అధికారులతో దాడులు చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నా రు. ప్రజా పంపిణీ వ్యవస్థనే తమ సొంత జాగీరులా మార్చుకొని పేదల బతుకులతో ఆటలాడుకోవాలని చూస్తున్నారు. వీరి వ్యవహారం పట్ల విసుగెత్తిపోయిన కొంత మంది డీలర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
తమ్ముళ్ల ‘చౌక’ దందా
Published Tue, Nov 4 2014 9:04 AM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM
Advertisement
Advertisement