
చంద్రబాబు ఫొటోతో పంపిణీకి సిద్ధం చేసిన సైకిళ్లు
సాక్షి, కడప ఎడ్యుకేషన్: టీడీపీ ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8,9తరగతి విద్యార్థులకు బడికొస్తా పథకంలో భాగంగా ప్రభుత్వం సైకిళ్లను అందిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో (గతేడాది జూన్, జులై నెలల్లో) అందించాల్సినవి ఇవి. ఎన్నికల ముందు విద్యార్థులపై ప్రేమ పుట్టుకొచ్చింది. సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విద్యా సంవత్సరం ముగిసే సమయంలో హడావుడిగా చేపట్టింది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే ఎన్నికల నగారా మోగింది. ఆదివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ కోడ్ తమకేమి పట్టదన్నట్లు కడప జయనగర్‌కాలనీ బాలికల ఉన్నత పాఠశాలల్లో సైకిళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం సాక్షి పాఠశాలకు వెళ్లినప్పుడు సైకిళ్ల ఫిట్టింగ్‌కు సంబంధించిన పనులు జోరుగా సాగితున్నాయి.
ఇంతలో విషయం తెలుసుకున్న డీఈఓ శైలజ, డిప్యూటీ డీఈఓ జిలానీబాష, ఎంఈఓ పాలెం నారాయణతోపాటు విద్యాశాఖ సిబ్బంది హుటాహుటిన జయనగర్‌కాలనీ హైస్కూల్‌కు చేరుకుని పనులను ఆపేయించారు. కిందిస్థాయి సిబ్బందిపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కోడ్ గురించి తెలిపినా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోపగించుకున్నట్లు తెలిసింది. తక్షణం పనులను ఆపేయించి సైకిళ్లపై చంద్రబాబు పోటో ఉన్న రేకులన్నింటిని తొలగింపజేశారు.
సైకిళ్లను పంపిణీ చేయవద్దని ఆదేశించినట్లు తెలిసింది. డీఈఓ శైలజను వివరణ కోరగా సిబ్బందికి కోడ్ విషయం గురించి చెప్పామన్నారు. వారికి తెలియకుండా సిబ్బంది పనులను చేస్తున్నట్లు తెలిసి తక్షణమే స్పందించి పనులు ఆపేశామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు సైకిళ్ల పంపిణీ జరగదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment