ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం | CM Jagan at Tidco house handover program in Gudivada | Sakshi
Sakshi News home page

ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం

Published Sat, Jun 17 2023 4:34 AM | Last Updated on Sat, Jun 17 2023 4:09 PM

CM Jagan at Tidco house handover program in Gudivada - Sakshi

దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి రాగానే 300 అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని గతంలో ఇదే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. ఈ రోజు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నా. ఇవిగో ఆ ఇళ్లు.. ఇవిగో ఆ ఊళ్లు. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ.16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు. నిస్సిగ్గుగా తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నోరు విప్పితే అబద్ధాలే. – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం కొనసాగుతోందని, ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇది పేదల బాగు కోసం పరితపించే ప్రభుత్వం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 77 ఎకరాల ఒకే లేఅవుట్‌లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ఆయన ప్రారంభించారు.

ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా 30.60 లక్షల ఇంటి పట్టాలు అందజేశామని, ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో సైతం అన్ని అడ్డంకులను అధిగమించి, చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడ్డు­కొని, సుప్రీంకోర్టులో మరీ పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు.

గత ప్రభుత్వం పేదలను అప్పులపాలు చేయా­లని చూస్తే, మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలు హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా ఇవాళ మనం ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

కొత్త గుడివాడ కనిపిస్తోంది
ఒకవైపు టిడ్కో ఇళ్లు.. మరోవైపు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే.. ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. మొత్తం 257 ఎకరాల్లో రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్‌లో 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. మొత్తంగా 16,640 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండబోతున్నాయి. అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా దాదాపు 50 వేల మంది జగనన్న లే అవుట్‌లో నివాసం ఉండబోతున్నారు. 
ఈ లేఅవుట్‌తో పాటు నియోజకవర్గం మొత్తం 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలిచ్చామని గర్వంగా చెబుతున్నా.
ఈ లేఅవుట్‌ ఇంటి స్థలం విలువ ఎంత ఉంటుందని ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. గజం రూ.14 వేలని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం రూ.7 లక్షలు ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు స్థలం ద్వారా రూ.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. 
 ఒక్కో ఇంటిని రూ.2.70 లక్షలతో కడుతున్నాం. అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం రూ.10–15 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. 
ఇవాళ ఇచ్చిన పట్టాలకు సంబంధించి 4,200 ఇళ్లు మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో కూడా ఇళ్లు వస్తాయి. జూలై 8.. నాన్న గారి జయంతి రోజున ఈ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. ఇలాంటి అభివృద్ధి గుడివాడలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు ముందుకు వేస్తున్నాం.  

ఇంటి స్థలాల విలువే రూ.75 వేల కోట్లు
మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. కేవలం రూ.2.5 లక్షల చొప్పున వేసుకున్నా, 30.60 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లకు పైగా ఉంటుంది. 
 
టిడ్కో ఇళ్ల పేరుతో నాడు పేదలపై భారం
ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్‌ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు రూ.2 వేలు చొప్పున ఒక్కో ఫ్లాట్‌కు దాదాపు రూ.5.75 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.లక్ష అవుతుంది.
రూ.6.75 లక్షలు ఖర్చయ్యే ఒక్కో ఫ్లాట్‌కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మిగిలిన రూ.3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా రూ.3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూపోవాలి. అలా రూ.7.20 లక్షలు పేదవాడు తన జేబు నుంచి కట్టాలి.  అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. 
మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న 1,43,600 టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాం. రూ.6.75 లక్షలయ్యే ఒక్కో ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. 
365 చదరపు అడుగుల ఇంటికి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత రూ.3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. మరో రూ.25 వేలు కలిపి ప్రతి పేద వాడికి రూ.4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. 
 430 చదరపు అడుగులు ఇంటికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.3 లక్షలు కాకుండా, మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష వేసుకుని.. గతంలో తీసుకున్న డిపాజిట్‌ను రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించాం. రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రూ.4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. 

పేదల వ్యతిరేకి చంద్రబాబు
 నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఇదే పని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? అందరూ ఆలోచించాలి. కారణం చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు.  
అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలన్స్‌ వస్తుందని చంద్రబాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు. ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి అమరావతిలో 50 వేల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం.   
మన ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి లంచాలు, వివక్షకు తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసింది. నాలుగేళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్‌ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ.31 వేల కోట్లు ఇచ్చాం.
అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మల పిల్లల బాగోగుల కోసం రూ.19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ.19,178 కోట్లు, చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం.
నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.14,913 కోట్లు ఇవ్వగలిగాం. సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్‌ బాధితులకు కూడా మేలు చేశాం.    
 
గుడివాడకు వెన్నుపోటు అల్లుడు 
ఇదే గుడివాడకు చెందిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న అల్లుడు.. ఆయన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారు? కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టించలేదు.  
ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అనుమతివ్వండి అంటూ అడుగుతున్నాడు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల తర్వాత.. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటారట. 
ఇప్పుడు మైకు పట్టుకొని ఇంకో చాన్స్‌ ఇవ్వండి అన్నీ చేసేస్తా అంటాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి బెంజ్‌ కారూ ఇస్తానని చెబుతారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇలా మాయ మాటలు చెబతూ మళ్లీ మోసం చేయడానికి బయలుదేరాడు.
ఫలానా మంచి పని చేశాను కాబట్టి చాన్స్‌ ఇవ్వండి అని అడగలేని పరిస్థితి ఆయనది. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని ఈయనకు ప్రజలను ఓటు అడిగే నైతికత కూడా లేదు.
 
ఊరూరా విప్లవాత్మక మార్పులు
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లంచాలు, వివక్షకు తావివ్వని వలంటీర్‌ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. 
కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, ఫిషింగ్‌ సెంటర్లు కడుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం.. ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ఊరూరా కళ్లెదుటే కనిపించేలా మనసు పెట్టి పని చేసిన ప్రభుత్వం మనదే. 

40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని పరిస్థితి. ఇలాంటి ఈ చంద్రబాబు.. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి అట! రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటున్నట్లు ప్రవర్తిస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. తన జీవితమే బాబు కోసమని, తన వ్యాన్‌ను చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్నారు.

వీరికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. మొత్తంగా గజ దొంగల ముఠా మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రజల ముందుకు వస్తోంది. వీళ్ల మాదిరిగా నాకు హంగూ, ఆర్భాటం, ఇతర పార్టీలు, చానళ్లు తోడు లేకపోవచ్చు. ఈ తోడేళ్ల గుంపు అంతా ఒక వైపు ఉంటే, మీ బిడ్డ మాత్రం మిమ్మల్ని, దేవుడిని నమ్ముకుని ఒంటరిగా మరోవైపు ఉన్నారు. మీరంతా ఈ దుష్టచతుష్టయం అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మారండి.  

గుడివాడకు వరాల జల్లు
గుడివాడ నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు సాయం కావాలని ఎమ్మెల్యే నాని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటికకు రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్‌ ప్లాన్‌ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా కోసం ల్యాండ్‌ అక్విజేషన్‌ కావాలన్నారు. అందుకు రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నాం.

మల్లాయపాలెం లే అవుట్‌లో ఇంటర్నల్‌ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు ఇస్తున్నాం. గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్‌ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు రూ.26 కోట్లతో శంకుస్థాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్‌ మిషన్‌ కింద చేపడుతున్న పైప్‌లైన్‌ ప్రాజెక్టులో భాగంగా గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయిస్తూ ఈ పనులకూ శంకుస్థాపన చేశాం.  

మనం మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా భావించి.. 99 శాతం హామీలు నెరవేర్చాం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు.. ప్రతిసారీ మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేశాడు.  మన పార్టీ పేదల హృదయం నుంచి పుట్టింది కాబట్టి.. ఇలా మంచి పనులు చేయగలుగుతున్నాం. టీడీపీ పెత్తందార్ల పార్టీ.. వారంతా గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని, ప్రజలను నమ్ముకుంటే.. వారు పొత్తులు, ఎత్తులు, చిత్తులంటూ దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు.    – సీఎం వైఎస్‌ జగన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement