కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఒంటిపూట బడులు. అదేంటి ఎండాకాలంలో కదా ఈ తరహా తరగతులు నిర్వహించేదనే ఆశ్చర్యపోతున్నారా. ఉద్యమంలో తలమునకలైన ఉపాధ్యాయులు కొందరు పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులవుతున్నా ఇప్పటికీ చుట్టపు చూపుగానే హాజరవుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నా మార్పు కరువవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా రెండున్నర నెలలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. యూనిట్ టెస్ట్‌లు, క్వార్టర్లీ పరీక్షలు కూడా రాయలేకపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు పునఃప్రారంభమైనందున ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాల్సి ఉంది. అలాంటిది కొందరు ఎవరేమైతే మేకేమిటన్న ధోరణితో విధులకు డుమ్మా కొడుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, డీఈవో నాగేశ్వరరావులు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. ఈ నెల 18న కర్నూలు మండలం మిలటరీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గార్గేయపురంతో పాటు నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూళ్లను.. చివరగా నందికొట్కూరు జిల్లా పరిషత్ బాలికలు, ప్రభుత్వ బాలుర పాఠశాలలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో అనుమతి లేకుండా సెలవు పెట్టిన బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ స్కూల్ హెచ్‌ఎంకు మెమో జారీ చేశారు. సమ్మెకాలంలో పాఠశాలలు మూతపడినందున.. శని, ఆదివారాల్లోనూ పని చేయాలని నిర్ణయించడం తెలిసిందే. దీంతో సెలవు రోజుల్లో పాఠశాలలు ఎలా నడుస్తున్నాయో తెలుసుకునేందుకు తనిఖీకి వెళ్లిన కలెక్టర్, డీఈవోలు గత ఆదివారం ఉయ్యాలవాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను మధ్యాహ్నం 1.30 గంటలకే ఉపాధ్యాయులు ఇంటికి పంపడం గుర్తించారు. ఈ విషయంలో ప్రధానోపాద్యాయుడు వెంకటేశ్వర్లును సస్పెండ్ చేశారు. డీఈఓ ఈ ఆదివారం కూడా కర్నూలు నగరంలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు.