టీచర్ల బదిలీ విధివిధానాలు, షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీ విధివిధానాలు, షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. హేతుబద్ధత (రేషనలైజేషన్)తో ముడిపెట్టి బదిలీలు చేపట్టాల్సి ఉండడంతో విధివిధానాల ఖరారులో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. టీచర్ల రేషనలైజేషన్, బదిలీలు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో వాటిని సమన్వయం చేసుకుంటూ కొత్త మార్గదర్శకాల్ని రూపొందిస్తున్నారు. రేషనలైజేషన్ కింద విద్యార్ధులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉంటే అవసరమైన పాఠశాలలకు బదిలీ చేస్తారు. పాఠశాల ల్లోని ఖాళీల జాబితాను ముందుగా ప్రకటించి వాటిపై జూన్ 6వరకు అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. 7 నుంచి 14 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించి కౌన్సెలింగ్‌ను నిర్వహించే అవకాశముంది. మున్సిపల్ టీచర్ల బదిలీపై ఆ శాఖ కసరత్తు చేస్తోంది.
‘14 కల్లా పూర్తయ్యేలా చూడాలి’
టీచర్ల బదిలీల రేషనలైజేషన్‌ను వచ్చే నెల 14కల్లా పూర్తయ్యేలా చూడాలని రాష్ట్రోపాధాయ సంఘం అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసెఫ్ సుధీర్‌బాబులు పేర్కొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్లను సోమవారం కలసి ఈ అంశంపై చర్చించామని, అందుకు వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు.