సాక్షి, కర్నూలు: రబీ ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. పంటలు ఎండుతున్నా చుక్క నీరు అందని పరిస్థితి. ఇలా వదిలి.. అలా నిలుపుదల చేస్తూ డ్యాం అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. కర్ణాటక రైతుల ఒత్తిళ్లకు తలొగ్గి తీసుకుంటున్న నిర్ణయం.. ఇక్కడి రైతులకు శాపంగా మారుతోంది.
తాజాగా ఈనెల 23న డ్యాం నుంచి నీటి విడుదల నిలిపేయడంతో కేసీ ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల్లో కేసీ పరిధిలోని 30వేల ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, చెరుకుతో పాటు వివిధ కూరగాయల పంటలు సాగవుతున్నాయి. 2013-14 సంవత్సరానికి టీబీ డ్యాంలో నీటి లభ్యత ఆధారంగా 6.7 టీఎంసీలను కేసీ కాలువకు కేటాయించారు. ఇందులో 2 టీఎంసీలు ఒకసారి, మరోసారి 2.5 టీఎంసీలను అనంతపురం జిల్లాకు రివర్స్ స్లూయిజ్‌ల ద్వారా మళ్లించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల కేసీ ఆయకట్టు రైతులు ఇరిగేషన్ అధికారులను దిగ్బంధించడంతో మిగిలిన 2.2 టీఎంసీల వాటా నుంచి గత డిసెంబర్ 27వ తేదీన 0.7 టీఎంసీ నీటిని విడుదల చేశారు.
మిగిలిన మరో 1.5 టీఎంసీల నీటి వాటాను ఈనెల 20వ తేదీ నుంచి విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులు ఇండెంట్ పెట్టారు. ఆ మేరకు 21 నుంచి 23వ తేదీ వరకు ఆర్‌డీఎస్‌కు 800 క్యూసెక్కులు, కేసీకి 1,200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. డ్యాం నుంచి విడుదలైన ఈ నీరు కేసీ కాలువ 0-150 కిలోమీటరు పరిధిలోని కర్నూలు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల పరిధిలోని ఆయకట్టుకు చేరాల్సి ఉంది. అయితే నీరు సుంకేసుల రిజర్వాయర్‌కు చేరకమునుపే డ్యాం అధికారులు 24వ తేదీ నుంచి నిలిపేయడంతో కేసీ ఆయకట్టు భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది.
పేరుకు కేసీ వాటా విడుదల చేసినా.. ఆయకట్టుకు చుక్కనీరు అందకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. డ్యాం నుంచి విడుదల చేసిన నీరు కాలువ ద్వారా కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల మీదుగా ఆయకట్టుకు అందాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం కర్ణాటక రైతులు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవడంతో తలొగ్గిన బోర్డు అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలోని 30వేల ఎకరాల్లో చేతికందాల్సిన పంట ఏమవుతుందోనని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటీవల కేసీకి సాగునీరు ఇవ్వాలని రైతులు ఆందోళనలు చేపట్టగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిబ్రవరి నెలాఖరు వరకు నీరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం డ్యాం అధికారులు నీటి విడుదలను నిలుపుదల చేసినా నాయకులు నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడ తిరగబడతారోనని ఇరిగేషన్ అధికారులు సెలవుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తాగునీటికీ కటకటే.. వేసవిలో కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు 2 టీఎంసీ నీరు అవసరం. ప్రస్తుతం సుంకేసులలో 1.15 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీరు కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కష్టమవుతున్న తరుణంలో టీబీ డ్యాం నుంచి రావాల్సిన నీరు నిలుపుదల చేయడంతో సుంకేసులకు నీటి చేరిక పూర్తిగా తగ్గిపోయింది. డ్యాం నుంచి నీటి వాటా విడుదలైతే తప్ప ఈ వేసవిలో కర్నూలు ప్రజలు గొంతు తడవని పరిస్థితి నెలకొంది.
పంటలకు ఇబ్బంది ఉండకపోవచ్చు: ఆర్.నాగేశ్వరరావు, ఎస్‌ఈ, ఇరిగేషన్
రబీలో కేసీ ఆయకట్టు కింద సాగుచేసిన ఆరుతడి పంటలకు టీబీ డ్యాం నుంచి నీటి విడుదల నిలిపేసినా ఇబ్బంది ఉండకపోవచ్చు. కర్ణాటక ప్రాంత రైతుల సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బోర్డు అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో నీరు విడుదల చేస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు.
కన్నీటి సాగు
Published Sun, Jan 26 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement