
పళ్లు పీకి, తలపై మోది..
పళ్లు పీకి, తలపై మోది..
రాజన్నగూడెం(నిడమనూరు),
మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వృద్ధుడి ని గుర్తు తెలియని వ్యక్తులు పళ్లు పీకి, తలపై రాయితో మోది అతి దారుణంగా హత్య చేశారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ సంఘటన మండలంలోని రా జన్నగూడెంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నగూడెంకు చెందిన జంగాల ముత్యాలు(65) గురువారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన అనంతరం పొలానికి నీళ్లు పెట్టొస్తానని వెళ్లాడు. శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతని ఆచూకీ కోసం తెలిసిన చోటల్లా వెతికారు. పొలాల మధ్య నుంచి ఉన్న నిడమనూరు-రాజన్నగూడెం లింక్ రోడ్డుపై శనివారం ఉదయం కొందరు రైతులు వెళ్తుండగా తెల్లటి పదార్థాలు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా నోటి దంతాలు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దంతాలు లభ్యమైన ప్రాతం నుంచి కొద్దిదూరం వరకు రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు వాటిని అనుసరించి వెళ్లగా వాగులో ఓ మనిషి చేయి కనిపించింది. శవంగా గుర్తించి వెలుపలికి తీయగా అతడు ముత్యాలు. మృతుడి దంతాలు పీకి ఉండటంతో పాటు తలభాగం ఓ వైపు ఛిద్రమై ఉంది. వాగులోని నీటిలో ఉండటం వల్ల శవం ఉబ్బింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు సీఐ ఆనందరెడ్డి తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో గ్రామంలోని ఓ కుటుంబం అనారోగ్యం బారిన పడిందని, ముత్యాలు చేసిన మంత్రాల వల్లే ఇదంతా జరిగిందని పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.
మూడ నమ్మకాలను నమ్మవద్దు: సీఐ
నేటి ఆధునిక సమాజంలో చాలా మం ది మంత్రాలు, చేతబడులున్నాయని నమ్ముతున్నారని, మూఢ నమ్మకాల తో అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ ఆనందరెడ్డి హెచ్చరించారు. రా జన్నగూడెంలో ముత్యాలు హత్యా సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మానసిక జబ్బులతో బాధపడుతున్న వారు మంత్రా లు చేయడం వల్లే ఇలా జరిగిందని భావించి కక్షలు పెంచుకుంటున్నారని తెలిపారు.